Earphones Using: జాగ్రత్త.. హెడ్‌ఫోన్స్ అతిగా వాడి వినికిడి శక్తి కోల్పోయిన యువకుడు

అతిగా ఇయర్ ఫోన్స్ వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇలా రోజూ ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడి వినికిడి శక్తి కోల్పోయాడు. చెవులు పనిచేయకుండా తయారయ్యాయి. ఆ యువకుడు ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 12:00 PM IST

Earphones Using: ఈ రోజుల్లో చాలా మంది ఇయర్ ఫోన్స్/ఇయర్ బడ్స్ వాడుతున్నారు. ముఖ్యంగా యూత్ అయితే, రోజంతా వీటిని చెవిలో పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. గేమ్స్, వీడియోస్, కాల్స్.. అన్నింటికీ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. జర్నీ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు, జిమ్ కెళ్లినా.. ఇలా అన్ని చోట్లా వీటిని వాడుతున్నారు.

పైగా పెద్ద శబ్దంతో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇలా అతిగా ఇయర్ ఫోన్స్ వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇలా రోజూ ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడి వినికిడి శక్తి కోల్పోయాడు. చెవులు పనిచేయకుండా తయారయ్యాయి. ఆ యువకుడు ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో క్రమంగా వినికిడి శక్తి తగ్గిపోయింది. దీంతో ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. అతడి పరిస్థితి గమనించిన వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు. వినికిడి శక్తి కొంచెం మెరుగయ్యేలా చేశారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే, గతంలో ఉన్నంత మెరుగ్గా అతడి వినికిడి శక్తి ఉంటుందని చెప్పలేం. కాగా, అందరికీ ఇలా శస్త్ర చికిత్స చేసినంత మాత్రాన తిరిగి వినికిడి శక్తి వస్తుందని చెప్పలేమని డాక్టర్లు అన్నారు. అందుకే అసలు ఈ పరిస్థితే తెచ్చుకోకుండా జగ్రత్త వహించాలని సూచించారు.

ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు. టీనేజర్లు, యువత, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వినియోగించి, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. వరుసగా గంటల తరబడి, ప్రతి రోజూ ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో తేమ శాతం పెరుగుతుంది. లోపలి నుంచి గాలి బయటకు.. బయట నుంచి గాలి లోపలికి వెళ్లదు. దీంతో చెవి లోపల చెమట ఎక్కువై, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీంతో చెవులు క్రమంగా ఇన్ఫెక్షన్ సోకి, వినికిడి శక్తి తగ్గుతుంది. దీంతో చాలా మంది వైద్యుల వద్దకు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్లకు ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకింది.. అది ఏ దశలో ఉంది అనే దాన్నిబట్టి వారికి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇన్ఫెక్షన్ లోపలికి దాకా చొచ్చుకుపోతే చికిత్స కూడా పనిచేయకపోవచ్చు. ఫలితంగా శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతాయి. జాగ్రత్తగా ఉంటే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.

చెవి భాగంలో నొప్పి, లోపలి నుంచి చీము కారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఈ చికిత్స కొన్నిసార్లు నెలల తరబడి అవసరం రావొచ్చు. ఢిల్లీకి చెందిన యువకుడికి రెండుసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అందుకే గంటల తరబడి వరుసగా ఇయర్ ఫోన్స్ వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నేరుగా ఫోన్ స్పీకర్ ద్వారానే మాట్లాడాలి. అలాగే ఇయర్ ఫోన్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోకూడదు. దీనివల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ వాల్యూమ్‌తో కూడా మ్యూజిక్ వినకూడదు.