Mobile Lost: మీ మొబైల్ పోతే ఏం చేయాలి?

నేటి ఆధునిక యుగంలో ఫోన్ అనేది నిత్యవసర వస్తువులా మారిపోయింది. వినోదం నుంచి విజ్ఞానం వరకూ ఆహారం నుంచి అలంకరణ సామాగ్రి వరకూ అన్ని స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి ఫోన్ ఒక గంట సేపు మనతో లేకుంటే సతమతమై పోతూ ఉంటారు కొందరు. అదే ఫోన్ దొంగతనానికి గురైతే.. అంతే సంగతి. నిద్రాహారాలు మని దాని పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంతలా యాంత్రిక సంబంధం కలిగిన మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైతే అందులోని సమాచారం ఇతరులు దుర్వినియోగం చేయకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 02:30 PM IST

ఫోన్ పోతే పరేషాన్..
మొబైల్ ఫోన్ కు అంతటి ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రదాన కారణం ఉంది. అందులో సేవ్ చేసుకున్న డేటా అంటే.. ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్స్, మెసేజెస్ కావచ్చు. ఇంకా బ్యాంకు సంబంధిత సమాచారం కూడా ఉండవచ్చు. సాధారణంగా అన్నీ ఇందులోనే భద్రపరుచుకుంటారు. అందుకే ఇంతటి పరేషాన్ కి గురికావల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ కేంద్ర సర్కార్ సరికొత్త విధానాన్ని రూపొందించింది. దానిపేరు సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR).

ఎలా ఉపయోగించాలి..
ఇది గూగుల్ సర్చ్ ఇంజన్ ద్వారా తెరవగలిగే పోర్టల్. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈపోర్టల్ లో మనం పోగొట్టుకున్న మొబైల్ సంబంధిత వివరాలను (మొబైల్ నంబర్, ఐఎంఐ వివరాలు, ఫోన్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్ తోపాటూ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రిసిప్ట్ ను) పొందుపరచాలి. అలా నమోదు చేసిన వెంటనే కేంద్ర పర్యవేక్షణలో ఉండే టెలికమ్యూనికేషన్ శాఖకు ఈ వివరాలు చేరుతాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్ లో మన ఫోన్ కు సంబంధించిన వివరాలు పోందుపరిచి ఉండటం కారణం చేత పోర్టల్ లోకి వెళ్లి మన ఫోన్ ను బ్లాక్ చేయవచ్చు. అలా బ్లాక్ చేసిన వెంటనే టెలిఫోన్ నెట్వర్క్ ఆధారంగా మన ఫోన్ లోని సమాచారం తస్కరించిన వ్యక్తి చూడటానికి, దుర్వినియోగపరచడానికి వీలు పడదు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన స్థితిని తెలుసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక మన ఫోన్ దొరికిన తరువాత అదే పోర్టల్ లోకి వెళ్లి ఫోన్ సంబంధిత వివరాలను చూడటానికి అన్ బ్లాక్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇలా అన్ బ్లాక్ చేయాలి అంటే బ్లాక్ చేసినప్పుడు పొందు పరిచిన వివరాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పాస్వర్డ్, ఐడీ వంటివి సరిగ్గా ఇవ్వకుంటే మన డేటా తిరిగి పొందే అవకాశం ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటు..
సీఈఐఆర్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. కానీ వీటిని ప్రయోగదశలో ఉన్న కారణంగా కొన్ని రాష్ట్రాల్లోనే ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అమలు చేసింది. ప్రయోగం విజయవంతం కావడంతో అన్ని రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిని 2023 మార్చ్ 15 నుంచే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా గతనెల 15 తరువాత ఫోన్ పోగొట్టుకున్నట్లయితే ఈసేవలను వినియోగించుకొని తమ ఫోన్ లోని డేటాను మిస్ యూజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు.

 

 

T.V.SRIKAR