తిరుమల వెళ్లిన భక్తులు హుండీలో కానుకలు వేస్తారు. ఎవరు ఎంత వేస్తారో, ఏం వేస్తారో ఎవరికైనా తెలుసా..? అమెరికన్ డాలర్లు వేశారో, సౌదీ రియాద్‌లు సమర్పించుకున్నారో ఎవరికి తెలుసు..? విదేశాల నుంచి ఈహుండీకి పంపే గుప్తదాత తన వివరాలు ఇస్తాడా..? ఇవ్వాలంటోంది కేంద్రం, ఆర్‌బీఐ.. అంతేకాదు అలా ఇవ్వకపోవడం నేరమంటూ టీటీడీని కూడా వ్యాపార సంస్థల గాటిన కట్టేసి పన్ను వూసులు చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై రిజర్వ్‌బ్యాంక్ రూ.4.31కోట్ల జరిమానా విధించింది. 2019లో టీటీడీకి రూ.1.14కోట్ల అపరాధ రుసుం విధించింది. తాజాగా మరో రూ.3.19కోట్ల ఫైన్ వేసింది. మొత్తం కలిపి రూ.4.31కోట్లు… ఇంతకీ ఈ జరిమానా ఎందుకయ్యా టీటీడీ తనకు విరాళం ఇచ్చిన భక్తుల పూర్తి వివరాలు ఇవ్వకపోవడమేనట. తిరుమల వెంకన్నకు ప్రపంచంలోని పలు దేశాల్లో భక్తులున్నారు. అసలు ఆయనకు భక్తులు లేనిది ఎక్కడ…? విదేశాల్లో ఉండే భక్తులు వెంకన్నకు ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తుంటారు. తమకు తోచినంత పంపిస్తుంటారు. ప్రతి భక్తుడు తమ పూర్తి వివరాలు ఇవ్వరు. అలా ఈ-హుండీ ద్వారా స్వామికి భక్తులు పంపిన రూ.26కోట్ల రూపాయల చుట్టూనే వివాదం నడుస్తోంది. ఆ డబ్బు ఎవరెవరు పంపారు, వారి వివరాలేంటన్నది కేంద్ర హోంశాఖ ప్రశ్న.. అయితే అందరి వివరాలు తమ దగ్గర లేవంటోంది టీటీడీ. అయ్యా మాది వ్యాపార సంస్థ కాదు ధార్మిక సంస్థ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందించమని కోరినా కేంద్రం స్పందించలేదు. సరికదా వెంకన్నకే జరిమానా విధించింది. దాన్ని వసూలు చేసింది కూడా. ఇంతకీ మరో విచత్రమేమిటంటే ఆ డబ్బు ఇంకా టీటీడీ ఖాతాకు రాలేదు. ఎస్‌బీఐ దగ్గరే ఉన్నాయి. ఆ డబ్బు ఆపేశారు కానీ జరిమానా మాత్రం వసూలు చేసేశారు.
టీటీడీకి వచ్చే నిధులు ఎందుకు ఖర్చు చేస్తారో తెలుసా..? భక్తులు తాము పలానా సేవ కోసం అంటూ విరాళాలు ఇస్తారు. వాటిని ఆ కార్యక్రమానికే వినియోగిస్తారు. ఏడుకొండలపై నిత్యం అన్నదానం జరుగుతుంది. వచ్చిన వారికి లేదనకుండా ఆకలి తీరుస్తారు. అలాంటి శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్టుకు కోట్లలో నిధులు వస్తుంటాయి. అలాగే ఆరోగ్యప్రసాదిని, ప్రాణదాన ట్రస్ట్, శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సర్జరీ అండ్ రీసెర్చ్ ( BIRRD) ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ ఇలా ఎన్నో ట్రస్టులున్నాయి. వాటితో కేవలం ధార్మిక సేవ మాత్రమే కాదు మానవ సేవ కూడా చేస్తారు. పేదలకు విద్యాదానం, ఖరీదైన వైద్యం ఉచితంగా అందించడం, గోసంరక్షణ ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్నదానానికి ఇచ్చే నిధులకు లెక్కలు చెప్పాలంటే.. ఎంత వచ్చాయో టీటీడీ చెబుతుంది. కానీ పంపిన వారందరి పూర్తి వివరాలు ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలదు.? గుప్తదానం చేసే భక్తుల సంఖ్య కోకొల్లలు.. అలాంటి వారు తమ వివరాలు ఇస్తారా..? హుండీలో అమెరికన్ డాలర్లు వేసి భక్తులు వెళ్లిపోతారు. ఎవరు వేశారో అధికారులు ఎలా పసిగడతారు.?
పారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ( FCRA) నిబంధనలను టీటీడీ ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ అంటోంది. నిజానికి విదేశాల నుంచి వచ్చే విరాళాలను టీటీడీ ఎలా కాదనగలదు.? ప్రతి ఒక్కరినీ మీ వివరాలు ఇవ్వండి, మీ పాన్ కార్డ్ ఇవ్వండి, మీ గుర్తింపు కార్డులు ఇవ్వండి అంటే విదేశాల్లో ఉన్నవారు ఇస్తారా..? అసలు ఈహుండీ ఉద్దేశమే ఏడుకొండలకు రాలేని భక్తులు ఉడతాభక్తిగా తమ వంతు స్వామిసేవకు కానుకలుగా ఎంతో కొంత పంపడమే. అలాంటి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటే ఎలా..? ఆ నగదును టీటీడీ వ్యాపార అవసరాలకు వినియోగించదు కదా..! ధార్మిక సేవా కార్యకలాపాలకే దాన్ని వినియోగిస్తారన్నది, అదంతా పారదర్శకంగా జరుగుతుందని కేంద్రానికి తెలియదా..?
టీటీడీకి గతంలో ఎఫ్‌సీఆర్‌ఏ కింద మినహాయింపు ఉండేది. 2018లో దాని గడువు ముగిసింది. అప్పట్నుంచి దాన్ని పునరుద్ధరించలేదు. సరికదా వెంకన్నపై పన్ను పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. హిందూయుజాన్ని భుజానికి ఎత్తుకున్న బీజేపీకి.. ఆ హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలతో ఇలా ఆడలాటడం సమంజసమేనా…? తిరుమల వ్యాపార కేంద్రం కాదు.. ఆధ్యాత్మిక క్షేత్రం.. దాని పాలనా వ్యవహారాలు చూసే టీటీడీ లాభాపేక్షతో పనిచేయదు. ఈ విషయం కేంద్రం, ఆర్‌బీఐ గుర్తుంచుకోవాలి. ఇలాగే ఇతర మతాలకు చెందిన బోర్డులపై జరిమానా విధించగలదా..? ఇతర మత బోర్డులకు విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి. మరి వాటిపై విచారణ జరిపించగలదా.? ఆ ధైర్యం చేయగలదా.?