Tractor For Farmers: రైతులకు సగం ధరకే ట్రాక్టర్ అందిస్తున్న కేంద్రం.. ఎలా పొందాలంటే..

రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా యాభై శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు. సగం ధర రైతు చెల్లిస్తే.. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దేశంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడే.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 07:52 PM IST

Tractor For Farmers: రైతులకు పలు పథకాల్ని అందిస్తున్న కేంద్రం మరో అద్భుత పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. రైతులు సబ్సిడీతో సగం ధరకే ట్రాక్టర్ సొంతం చేసుకునేలా ఒక పథకాన్ని రూపొందించింది. అదే.. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన. రైతులకు ట్రాక్టర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దుక్కి దున్నడం, నాట్లు, పంట రవాణా సహా అనేక అవసరాలకు ట్రాక్టర్ అవసరం. లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్‌ను అందరూ కొనలేరు. అలాంటి వారికోసం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం అందించే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం ద్వారా సగం ధరకే ట్రాక్టర్ సొంతం చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు..? దీన్ని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం.

ఎవరు అర్హులు..?
రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా యాభై శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు. సగం ధర రైతు చెల్లిస్తే.. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దేశంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడే. సొంత పొలమే ఉండాల్సిన అవసరం లేదు. కౌలు రైతు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కౌలు రైతులు.. అసలైన పొలం యజమాని నుంచి ఎన్‌ఓసీ తీసుకుని, దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ట్రాక్టర్ పొందాలనుకునే రైతు ఆదాయం సంవత్సరానికి రూ.1.50 లక్షలు మించకూడదు. నిర్దిష్ట అర్హతలు ఉంటే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకుని పథకానికి అర్హులైతే వారికి ట్రాక్టర్ ధరలో సగం కేంద్రం చెల్లిస్తుంది. నచ్చిన ట్రాక్టర్‌ను రైతే ఎంచుకోవచ్చు. తాను ఎంచుకున్న ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే, మిగతా సగం బ్యాంకు నుంచి రుణంగా కూడా పొందవచ్చు. ఆ రుణాన్ని నెలవారి వాయిదా పద్ధతిలో చెల్లిస్తే సరిపోతుంది. ట్రాక్టర్ ధర ఎనిమిది లక్షలైతే.. కేంద్రం నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తుంది. మిగతా సగాన్ని రుణంగా పొంది, బ్యాంకులకు చెల్లించాలి. అలాగే ఈ పథకం ద్వారా ఒక రైతు.. ఒక్క ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అలాగే గత ఏడు సంవత్సరాలలో ఆ రైతు వేరే ట్రాక్టర్ ఏదీ కొనుగోలు చేసి ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

దరఖాస్తులో నచ్చిన ట్రాక్టర్ మోడల్ వివరాలతోపాటు, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్టు సమర్పించాలి. దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో రైతు ఉంటున్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన వివరాల కోసం 155261/011-24300606 నంబర్లను సంప్రదించవచ్చు. ఇవే పథకాల్ని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం వైయస్‌ఆర్ యంత్రసేవ పేరిట అందిస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. వీటికి కూడా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.