Medigadda Barrage: మేడిగడ్డ పరిశీలనకు రాబోతున్న కేంద్ర బృందం..

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృదం తెలంగాణకు రాబోతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో సెంట్రలవ్‌ వాటర్‌ బోర్డుకు రిపోర్ట్‌ ఇవ్వబోతోంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 02:26 PM IST

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ బ్రిడ్జ్‌ కుంగిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇంజనీరింగ్‌ వండర్‌ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు లోపాలు బయటపడటం హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఈ విషయంలో స్పందించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృదం తెలంగాణకు రాబోతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో సెంట్రలవ్‌ వాటర్‌ బోర్డుకు రిపోర్ట్‌ ఇవ్వబోతోంది.

ఈ రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇందులో అసాంఘికశక్తుల ప్రమేయం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు బ్రిడ్జ్‌కు నష్టం కలిగేలా చేశారని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. గతేడాది ఈ బ్యారేజ్‌ నుంచి దాదాపు 29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిది. అప్పుడు కూడా డ్యామేజ్‌ అవ్వని బ్రిడ్జ్‌ ఇప్పుడు ఒక్కసారిగా డ్యామేజ్‌ అవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలో మీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.