Android: ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా.. రిస్క్‌లో ఉన్నట్లే.. కేంద్రం హెచ్చరికలు..

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా వివరించిన సంస్థ.. వీటితో సైబర్‌ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లే చాన్స్ ఉందని హెచ్చరించింది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 06:42 PM IST

Android: ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా వివరించిన సంస్థ.. వీటితో సైబర్‌ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ 10, 11, 12, 12ఎల్‌, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు ఆ సంస్థ తమ ప్రకటనలో వెల్లడించింది.

ఫ్రేమ్‌వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌లో తప్పుల కారణంగా ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపింది. వీటిని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటాలాంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశముందని సెర్ట్ ఇన్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. హ్యాకర్లు ఫోన్లపై దాడి చేసినప్పుడు మొబైల్‌ను వారి అధీనంలోకి తీసుకుని ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడం, డివైజ్‌ను పనికిరాకుండా చేసేందుకు ఈ లోపాలు ఉపయోగపడుతాయని వివరించింది.

ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ అప్డేట్స్‌పై క్లిక్‌ చేసి ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.