Chandrayaan-3: చంద్రుడికి చేరువగా చంద్రయాన్-3.. సాఫ్ట్ ల్యాండింగే కీలకం.. చరిత్ర లిఖించబోతున్న భారత్..!

చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించిన దాదాపు 40 రోజుల తర్వాత చంద్రుడిపై దిగుతుంది. అంటే.. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగే అవకాశాలున్నాయి. ఇది చాలా కీలక దశ. చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత 14 రోజులపాటు ఇది తన పరిశోధన కొనసాగిస్తుంది.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 02:45 PM IST

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక ఘట్టానికి చేరుకుంది. చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడికి అతి చేరువగా వచ్చేసింది. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం).. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుంచి విడిపోయింది. ఈ ప్రయోగంలో ఆఖరిఘట్టమైన చంద్రుడిపై దిగడమే మిగిలుంది. ఇది కూడా విజయవంతమైతే.. భారత్ కొత్త చరిత్ర లిఖించినట్లే.
జులై 14న ఇస్రో.. చంద్రయాన్-3ని ప్రయోగించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం ప్రయోగించిన ఈ వ్యోమనౌక విజయవంతంగా కక్ష్యలోకి, చంద్రుడికి చేరువగా వెళ్లింది. అనేక దశలు దాటుకుంటూ ఇది తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించిన దాదాపు 40 రోజుల తర్వాత చంద్రుడిపై దిగుతుంది. అంటే.. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగే అవకాశాలున్నాయి. ఇది చాలా కీలక దశ. చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత 14 రోజులపాటు ఇది తన పరిశోధన కొనసాగిస్తుంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోన్న చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ నెమ్మదిగా చంద్రుడి దిశగా దిగువ కక్ష్యలోకి చేరుకుంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ ‘డీబూస్టింగ్’ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరుగుతుంది. మరో ఐదు రోజుల్లో.. అంటే ఆగస్ట్ 23న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతాయి. చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్తోంది. గతంలో అమెరికా, రష్యా ఆధ్వర్యంలోని సోవియట్ యూనియన్, చైనా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. కానీ, ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోలేదు. చంద్రయాన్-3 అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయితే.. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలుస్తుంది. అయితే, ఇటీవలే రష్యా ప్రయోగించిన లూనా-25 కూడా ఈ నెల 22న చంద్రుడిపై దిగే ఛాన్స్ ఉంది. మనకంటే ముందే రష్యా వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధృవంపై దిగితే.. ఇండియా ఈ ఘనత సాధించిన రెండో దేశంగా నిలుస్తుంది.
ముచ్చటగా మూడో ప్రయోగం
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేసిన మూడో ప్రయోగం చంద్రయాన్-3. భారత్ తొలిసారిగా 2008లో చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా చంద్రుడి మీద నీరు ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత 2019 జూలైలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించినప్పటికీ ఇది పాక్షికంగానే విజయం సాధించింది. ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే సమయంలో విఫలమైంది. దీంతో రెండో ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు. ఈసారి లోపాల్ని సరిదిద్దుకుని చంద్రయాన్-3 పేరుతో మూడో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది ఇస్రో. ఈ ప్రయోగం దాదాపు చివరి దశకు చేరుకుంది. అందుకే ఈ ప్రయోగం విజయవంతం కావాలని యావద్భారత దేశం కోరుకుంటోంది. చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్షణాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
చంద్రయాన్-3 ప్రత్యేకతలివి
చంద్రయాన్-2లో జరిగిన సాంకేతిక లోపాలను, పొరపాట్లను సరిదిద్ది తాజా ప్రయోగం చేపట్టింది ఇస్రో. ఇది చంద్రుడిని చేరేందుకు దాదాపు 40 రోజుల సమయం పడుతోంది. కారణం.. దీని బరువు. ఇది సుమారు 3,900 కేజీలుంటుంది. ఇందులో ల్యాండర్ మాడ్యూల్‌ బరువు 1,500 కేజీలు కాగా, ప్రజ్ఞాన్ రోవర్ బరువు 26 కేజీలు. ఈ ప్రయోగానికి అయిన మొత్తం ఖర్చు.. రూ.615 కోట్లు. చంద్రయాన్-3 చంద్రుడి కక్ష‌్యలోకి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌక వేగాన్ని తగ్గించారు. కక్ష్య తగ్గించడం ద్వారా చంద్రుడికి చేరువగా తీసుకొచ్చారు. చంద్రుడి దక్షిణ ధృవంలో సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యే ప్రదేశంలో దీన్ని దించుతారు. చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత అక్కడి పరితలంపై ఉన్న ముఖ్యమైన డేటాను, ఫోటోలను సేకరించి, వాటిని పరిశోధనల కోసం భూఉపరితలంపైకి పంపుతుంది. చంద్రుడిపై వాతావరణాన్ని కాదు.. ఉపరితలం దిగువన ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టెక్టోనిక్ యాక్టివిటీ కూడా ఇది నిర్వహిస్తుంది. జాబిల్లికి సంబంధించిన కీలక సమాచారాన్ని మనకు పంపుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వార అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ నిలుస్తుంది.