Chandrayaan-3: జయహో భారత్.. చంద్రయాన్-3 సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్..!

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం, 02.35 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌ను మోసుకుంటూ శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

  • Written By:
  • Updated On - July 14, 2023 / 04:31 PM IST

Chandrayaan-3: యావద్భారతం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై శోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం, 02.35 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌ను మోసుకుంటూ శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పేలోడ్‌ను మండించి మొదటి రెండు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. చంద్రుడి దిశగా వెళ్లేందుకు మూడో పే లోడ్‌ను కూడా మండించింది. 02.42 గంటల సమయానికి మూడో దశ చేరుకోగా, 02.54 గంటలకు మూడు దశల్ని షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసుకున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ముందుగా రాకెట్‌ను అవసరమైన ఎత్తులోకి చేర్చేందుకు మూడు దశల్లో పేలోడ్స్‌ను మండించారు. ప్రస్తుతం రాకెట్ నిర్ణీత కక్షలోనే వెళ్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రయాన్-3 ప్రయోగం పూర్తవ్వడానికి మరికొన్ని రోజులు పడుతుంది.

ఈ రాకెట్ నుంచి ల్యాండర్ చంద్రుడిని చేరుకోవడానికి దాదాపు 40 రోజులు పడుతుంది. వచ్చే నెల 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత దీన్నుంచి రోవర్ విడిపోతుంది. ల్యాండర్, రోవర్ చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయి. అక్కడ కనీసం 14 రోజులపాటు రోవర్ పని చేస్తుంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక వివరాల్ని ఇస్రో సేకరిస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది.