Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ నెల 14న చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగించబోతుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి మూడు ఉగప్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతుంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ప్రయోగ విశేషాలు.
చంద్రుడి గురించి తెలుసుకోవాలని మనిషి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. దాదాపు 60 ఏళ్లుగా ఈ విషయంలో పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీతోపాటు ఇండియా వంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. 1969లోనే అమెరికా అపోలో అనే వ్యోమనౌక ద్వారా ముగ్గురిని చంద్రుడిపైకి పంపింది. ఈ విషయంలోనూ పైచేయి సాధించాలని భారత్ నిర్ణయించింది. మన ఇస్రో ఆధ్వర్యంలో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2008, అక్టోబర్ 22న తొలిసారిగా చంద్రయాన్ వ్యోమనౌకను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 2019 జూలైలో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగాలతో ఆర్బిటార్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను చంద్రుడిపైకి పంపించారు. వీటి ద్వారా మొత్తం 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. అయితే, చంద్రయాన్-2 పాక్షికంగానే విజయవంతమైంది. కారణం.. చివరి రెండు నిమిషాల్లో ల్యాండర్, చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంది. దీంతో దాన్నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇకపై ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత చంద్రయాన్-3ని ప్రయోగిస్తున్నారు. ఈ నెల 14న చేపట్టనున్న చంద్రయాన్-3 ద్వారా ఒకేసారి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రయోగించబోతున్నారు.
చంద్రయాన్-3 విశేషాలివి
ఏపీ, శ్రీహరికోట సతీష ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతుంది. ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఈ నెల 14, మధ్యాహ్నం 02.35 గంటలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగానికి మొత్తం రూ.615 కోట్ల వ్యయం అయింది. ప్రయోగ సమయంలో రాకెట్ బరువు 640 టన్నులు, ప్రపోల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు, ల్యాండర్ బరువు 1752 కేజీలు, రోవర్ బరువు 26 కిలోలు. దాదాపు 120 ప్రైవేట్ సంస్థలు ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. గతంలోలాగా పొరపాట్లు జరగకుండా చంద్రుడిపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి అనువైన పరికరాలను ఇస్రో సిద్ధం చేసింది. గంటకు 6,058 కి.మీ. వేగంతో ల్యాండర్ కిందికి జారుతుంది. ల్యాండర్‌లో అమర్చిన నాలుగు బుల్లి రాకెట్లు ఈ వేగాన్ని నియంత్రిస్తాయి. సెకన్‌కు 2 మైళ్ల వేగంతో ల్యాండర్ హెలికాప్టర్‌లా చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత అందులోంచి రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రుడిపై పరిశోధనలకుగాను ల్యాండర్, రోవర్‌లో ఆధునిక పరికరాలు అమర్చారు. చంద్రుడిపై ఉష్ణ లక్షణాలను, భూకంపతను, వాతావరణాన్ని కొలవడానికి, ఉపరితల మూలకం గురించి తెలుసుకోవడానికి అనువుగా ల్యాండర్, రోవర్‌లను తీర్చిదిద్దారు. రోవర్‌కు అమర్చిన అనేక కెమెరాల నుంచి వచ్చే చిత్రాల సాయంతో అక్కడి విశేషాల్ని మరింత దగ్గరగా, క్షుణ్ణంగా తెలుసుకునే వీలుంది.
ప్రయోగం సాగుతుందిలా..?
భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రయాన్-3 అంతదూరం చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. చంద్రయాన్-3లో ప్రయోగించే ఎల్‌వీఎం3-ఎం4 అనే రాకెట్ ప్రయోగం మూడంచెల్లో సాగుతుంది. ఈ రాకెట్‌కు 3,900 కిలోల బరువు గల ప్రపోల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌లు అమర్చారు. మొదటగా రాకెట్ చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి చేరుస్తుంది. ఇది భూమి చుట్టూ ఇది 24 రోజుల పాటు తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడి దిశగా రాకెట్ ప్రయాణం మొదలవుతుంది. చంద్రుడి కక్ష్యలోకి చేరడానికి 5 రోజులు పడుతుంది. చంద్రుడి చుట్టూ 19 రోజుల పాటు తిరుగుతుంది. నెమ్మదిగా చంద్రుడికి చేరువవుతూ 30 కి.మీ. సమీపానికి చేరుకుంటుంది. ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోయి దక్షిణ ధృవంలో దిగుతుంది. అక్కడ్నుంచి వాటి ప్రయాణం, పరిశోధన మొదలవుతుంది. ఈ నెల 14న ప్రయోగించే ఉపగ్రహం ఆగష్టు 23 లేదా 24న చంద్రుడిపైకి చేరుకుంటుంది. అన్ని పరిస్తితులు అనుకూలిస్తేనే ఇది జరుగుతుంది. లేదంటే కాస్త ఆలస్యం కావొచ్చు. అనుకున్న సమయంలో ల్యాండింగ్ సాధ్యం కాకుంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూసి, సెప్టెంబర్‌లో ల్యాండ్ అయ్యేలా చేస్తామని పరిశోధకులు అంటున్నారు.
వ్యోమగాముల్ని కూడా పంపేలా..
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇండియా నుంచి వ్యోమగాముల్ని కూడా చంద్రుడిపైకి పంపిస్తారు. చంద్రయాన్ ప్రయోగం ద్వారా అక్కడి జల వనరులు, ఖనిజాలు, ఇంధన నిల్వలు వంటి వాటి గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను దింపిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది.