Chandrayaan-3: చంద్రుడికి చేరువగా చంద్రయాన్-3.. జాబిల్లిని అతి దగ్గరగా తీసిన వీడియో విడుదల

చంద్రయాన్-3లో కీలకమైన కక్ష్య కుదింపు చర్య ఆదివారం రాత్రి విజయవంతంగా పూర్తైంది. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా శాస్త్రవేత్తలు కక్ష్యను కుదించగలిగారు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 03:37 PM IST

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడికి మరింత దగ్గరగా చేరుకుంది. చంద్రయాన్-3లో కీలకమైన కక్ష్య కుదింపు చర్య ఆదివారం రాత్రి విజయవంతంగా పూర్తైంది. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా శాస్త్రవేత్తలు కక్ష్యను కుదించగలిగారు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ నెల 9, మధ్యాహ్నం జాబిల్లికి చంద్రయాన్-3 రాకెట్ ఇంకా దగ్గరగా వెళ్తుంది.

దీనికి సంబంధించిన ఘట్టాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య నిర్వహిస్తారు. చంద్రుడికి కక్ష్యలోకి చేరుకున్న జాబిల్లిని శాస్త్రవేత్తలు దశలవారీగా కక్ష్య తగ్గిస్తూ, చంద్రుడికి దగ్గరగా తీసుకొస్తున్నారు. ఇలా స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య తగ్గిస్తూ, చంద్రుడికి సమీపంలోకి తీసుకొస్తారు. చివరగా చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష‌్యలోకి ప్రవేశపెడతారు. తర్వాత ఈ నెల 23న నెమ్మదిగా చంద్రుడిపై దించుతారు. మొత్తంగా 40 రోజుల్లో చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం చంద్రయాన్-3 చంద్రుడికి 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 తన పని ప్రారంభించింది. సమీపం నుంచి చంద్రుడి వీడియోలు, ఫొటోలు చిత్రీకరించింది.

జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో చంద్రుడిని వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. చంద్రుడికి సంబంధించి అతి దగ్గరగా తీసిన వీడియోల్లో ఇదీ ఒకటి. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలం ఆకుపచ్చ రంగులో ఉంది. చంద్రుడిపై లోతైన గుంటలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రయాన్-3 వివిధ దశలు పూర్తి చేసుకుని, మూడు లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించింది. చంద్రుడిపై చేరుకున్న తర్వాత చంద్రుడిపై ఒక రోజు చంద్రయాన్-3 పని చేస్తుంది. అంటే భూమిపై దాదాపు 14 రోజులపాటు ఇది తన మిషన్ నిర్వర్తిస్తుంది. గత నెల 14న ఏపీలోని శ్రీహరికోటలోని షార్ నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడిపైకి వ్యోమనౌకల్ని పంపాయి. ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్న చంద్రయాన్-3 కూడా పూర్తైతే ఇండియా కూడా వాటి సరసన చేరుతుంది. ఇండియా చివరగా 2019లో చంద్రయాన్-2 చేపట్టింది. అయితే, ఈ ప్రయోగం విఫలమైంది. తర్వాత 2021లోనే తాజా ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.