Chandrayaan 3: చంద్రయాన్-3.. చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లే. అయితే, ఈ ప్రయోగం ఇంకా పూర్తి కాలేదు. అసలైన ప్రయోగం ఇప్పుడే మొదలుకానుంది. చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండుగా విడిపోయి పరిశోధనలు సాగిస్తాయి. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 అక్కడి సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తుంది. ల్యాండింగ్ పూర్తైన తర్వాత.. విక్రమ్ ల్యాండర్ తాను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్లు ఇస్రోకు సందేశం పంపింది.విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన నాలుగు గంటల తర్వాత ల్యాండర్‌కు ఒక వైపు ఉన్న ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఓ ర్యాంప్ వస్తుంది.
ఈ ర్యాంప్ పై నుంచి 6 చక్రాలు ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా చంద్రుడిపైకి దిగుతుంది. ఈ రోవర్‌కు ఒక జాతీయ పతాకం ఉంది. చక్రాలకు ఇస్రో లోగో కూడా ఉంది. ఇది సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. ఈ రోవర్ నెమ్మదిగా కదులుతూ చంద్రుని పరిసరాలను స్కాన్ చేస్తుంది. ఆ డేటాను ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఈ డేటాను ఇస్రో సెంటర్‌కు పంపిస్తుంది. అంటే రోవర్ నేరుగా డేటాను పంపలేదు. ల్యాండర్ రోవర్‌లో ఉన్న పేలోడ్స్‌తో కన్ఫిగర్ చేసిన టూల్స్ ఆ డేటాను గ్రహిస్తాయి. మూడు పేలోడ్స్ విక్రమ్ ల్యాండర్ ఉపరితల ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్స్) సాంద్రతను కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలంపై టెంపరేచర్‌ను కొలుస్తుంది. ల్యాండర్ అక్కడే నిలిచి ఉంటుంది. రోవర్ మాత్రం చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. ల్యాండింగ్ సైట్ చుట్టూ భూ స్వభావాన్ని అంచనా వేస్తుంది. అంటే మట్టి, మంచు వంటి నిర్మాణాలను పరిశీలిస్తుంది.
14 రోజులే అధ్యయనం
ల్యాండర్, రోవర్.. రెండూ చంద్రుడిపై 14 రోజులపాటే పరిశోధనలు చేస్తాయి. కారణం.. చంద్రుడిపై ఒక రోజు (ఒక పగలు, ఒక రాత్రి) అంటే భూమిపై 28 రోజులు. మనకు 14 రోజులు పగలుంటే, 14 రోజులు చీకటి ఉంటుంది. ల్యాండర్, రోవర్.. సౌరశక్తి ఆధారంగా పని చేస్తాయి. చంద్రుడిపై పగలు ఉన్న 14 రోజులు మాత్రమే సౌరశక్తితో ఇవి పని చేస్తాయి. ఆ తర్వాత అక్కడ చీకటి ఏర్పడతుంది. ఈ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రత మైనస్ 238 డిగ్రీల వరకు ఉంటుంది. ఇంత శీతల పరిస్థితుల్లో రోవర్, ల్యాండర్ పని చేయడం ఆగిపోతాయి. అందువల్ల 14 రోజులు మాత్రమే అక్కడ ఇవి పనిచేసి, సమాచారం అందిస్తాయి. ఆ తర్వాత రెండూ నిర్వీర్యమైపోతాయి. అయితే, తర్వాత చీకటి పోయి మళ్లీ పగలు వచ్చిన తర్వాత ఇవి పని చేసే అంశాన్ని కొట్టిపారేయలేం. కానీ, అందుకు అవకాశాలు చాలా తక్కువ. అందులోనూ ల్యాండర్ పనిచేస్తేనే సమాచారం అందుతుంది. రోవర్ పని చేసినా.. అది ల్యాండర్‌కే సమాచారం ఇస్తుంది కాబట్టి ల్యాండర్ పని చేయకుంటే మనకు సమాచారం అందదు. అయితే, చంద్రుడిపై రోవర్ ఎంత దూరం ప్రయాణిస్తుందో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడి నుంచి ఈ రెండూ పంపించే సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.