Chandrayaan 3: భారత్ కొత్త చరిత్ర.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్-3.. ప్రయోగం విజయవంతం..

140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 06:27 PM IST

Chandrayaan 3: అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై వ్యోమనౌకను పంపిన అగ్ర దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా ఇండియా కొత్త చరిత్ర సృష్టించింది.

చంద్రయాన్-3 విజయవంతం కావడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 05:44 గంటలకు ప్రారంభమైంది. ఈ సమయానికి నిర్దేశిత ప్రదేశానికి చంద్రయాన్-3 చేరుకుంది. వెంటనే ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ పంపింది. ఈ కమాండ్ అందుకున్న విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్.. ఏఐ టెక్నాలజీ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ఇంజిన్లను మండించి వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను చేరుకుని, తర్వాత జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్లు ఎత్తు చేరుకుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుని, నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. జాబిల్లిపై దిగేందుకు అనువైన ప్రదేశాన్ని కెమెరా, కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టీమీటర్స్, లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ వంటి ఎక్విప్‌మెంట్ల సాయంతో ల్యాండింగ్‌కు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకుంది.

నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకుంటూ.. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. చంద్రుడిపై చంద్రయాన్-3.. 14 రోజులపాటు పని చేస్తుంది. అక్కడి దక్షిణ ధృవంపై మట్టిని, వాతావరణం వంటి అంశాల్ని ఇది పరిశీలించి సమాచారాన్ని చేరవేస్తుంది.