China: పెళ్లొద్దు మొర్రో అంటున్న చైనీయులు.. టెన్షన్‌లో జిన్‌పింగ్.. ఏం జరుగుతోంది ?

వద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ళ మంటరా.. నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా అంటాడు మన్మథుడు సినిమాలో మన గ్రీకువీరుడు నాగర్జున. చైనా యువతీయుకులు కూడా ఇప్పుడు ఇదే పాట తమ భాషలో పాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమన్నా.. సంబంధాలు చూస్తామన్నా..పెళ్లిగిళ్లీ జాన్తానై అంటూ పారిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 10:36 PM IST

పెళ్లి మాట ఎత్తితే చాలు ఈ మధ్యకాలంలో చైనా యూత్ మొహం చాటేస్తున్నారంట. పెళ్లిళ్లు చేసుకోండి.. పిల్లల్ని కనండి.. హ్యాపీగా ఉండండి అని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే.. జనం మాత్రం ఇంట్లోవాళ్ల మాట..ప్రభుత్వం చెప్పే మాటలు వినడం లేదంట. యూత్‌లో చాలామంది పెళ్లిని వాయిదా వేసుకోవడమో.. అసలు వద్దనుకోవడమే ఇప్పుడు చైనాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

పెళ్లి బాజాలు.. అప్పుడొకటి..ఇప్పుడొకటి.!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా కొంతకాలం వరకు చైనా వెలిగిపోయింది. ఒకనొక దశలో పెరుగుతున్న జనాభాను మోయలేని స్థాయికి దేశం చేరుకుంది. అలాంటి దేశంలో పెళ్లిళ్లు చేసుకుని సంసారాలు చేయాల్సిన యువతీయువకుల జనాభా కోట్లలో ఉంటుంది. వాళ్లంతా ఇప్పటికీ అలానే ఉన్నారు. వారిలో చాలా తక్కువమంది మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మెజార్టీ యూత్ బ్యాచ్‌లర్స్‌గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. చైనాలో పెళ్లిళ్లు ఏ స్థాయికి పడిపోయాయంటే.. 1986 తర్వాత ఇంత తక్కువ వివాహాలు ఎప్పుడూ నమోదు కాలేదంట. 2013లో చైనా వ్యాప్తంగా 13.5 మిలియన్ జంటలు వివాహాలు చేసుకుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య సగం కంటే తక్కువగా ఉంది. గడిచిన పదేళ్లుగా చైనాలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తూనే ఉంది. 2022-23లో మాత్రం అత్యల్పంగా పెళ్లిళ్లు జరిగాయి.

పెళ్లిళ్లు లేవు.. పిల్లలు లేరు.. కొత్త తరం లేదు
చైనాలో కొన్ని దశాబ్దాల క్రితం వన్ చైల్డ్ పాలసీ అమల్లో ఉండేది. ఒకరిని మించి కనడం చట్ట ప్రకారం నేరం. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోయి ఉపాధి అవకాశాలు తగ్గి.. ఆర్ధిక అసమానతలు పెరగడంతో చైనా…. చాలా సంవత్సరాల పాటు వన్ చైల్డ్ పాలసీని అమలు చేసింది. 2012లో జిన్‌పింగ్ దేశాధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పెళ్లిళ్ల విషయంలో చాలా లిబరల్‌గా వ్యవహరించింది. పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్నికనే జంటలను ప్రోత్సహించింది. వన్ చైల్డ్ పాలసీని అనధికారికంగా ప్రభుత్వం సడలించినా.. ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. పైగా వయసు మీదపడిన తర్వాత పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

2010-2020 మధ్య పెళ్లిళ్లు చేసుకునే మహిళల వయసు 24 నుంచి 29కి పెరిగింది. దీంతో 2016లో చైనా ప్రభుత్వం వన్ చైల్డ్ పాలసీని పూర్తిగా రద్దు చేసింది. పెళ్లిళ్లు చేసుకోండి.. ముగ్గురు పిల్లల్ని కనండి అంటూ కొత్త నినాదం అందుకుంది. చైనాలోని స్థానిక ప్రభుత్వాలైతే.. పిల్లల్ని కనేవాళ్లకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాయి. ఉచిత IVF విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. రెండో కాన్పు, మూడో కాన్పు అయితే ప్రత్యేక సబ్సిడీలు కూడా అందించే ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వం ఇన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించినా… ప్రజలు మాత్రం పెళ్లి…పిల్లలు అన్న కాన్సెప్ట్ ‌వైపు వెళ్లడం లేదు. పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమేపీ తగ్గడంతో కొత్త జనరేషన్ లేకుండా పోతుందన్న భయం చైనా ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బర్త్ రేట్ పడిపోవడంపై ఇప్పుడు చైనా పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ చైనా యువత పెళ్లంటే ఎందుకు నో చెబుతోంది ?
పైకి చూడటానికి చైనా చాలా శక్తివంతమైన దేశంగా.. అమెరికాను ఢీకొట్టే ఆర్థికవ్యవస్థగా కనిపిస్తుంది గానీ… వాస్తవానికి చైనా పరిస్థితి ఈ మధ్యకాలంలో గాలిబుడగలా మారిపోయింది. స్థానిక ప్రభుత్వాలు చేసే అప్పులు గుదిబండగా మారిపోయాయి. చైనా దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అప్పుల భారాన్ని మోస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా చైనా బయటకు చెబుతున్నంత గొప్పగా లేకపోవడంతో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసుకుని కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్న యూత్‌కు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. దశాబ్దాలపాటు చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా జనాభా గణనీయంగా తగ్గుతూ వచ్చింది.

దీంతో ప్రస్తుత జనరేషన్‌లో వర్కింగ్ క్లాస్ శాతం బాగా తగ్గిపోయింది. దీనికి తోడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సుధీర్ఘకాలం పాటు చైనా ప్రభుత్వం విధించిన కోవిడ్ ఆంక్షలు కూడా ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేశాయి. జీవితంపైనే విరక్తి కలిగేలా చైనా పాలకులు వ్యవహరించిన తీరు యుత్‌లో లైఫ్‌పై ఆసక్తిని తగ్గించేసింది. ఉద్యోగాలు దొరక్క.. జాబ్ ఉన్నా అరకొర జీతాలతో లాక్కురాలేక.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆ భారాన్ని ఎలా మోయాలో అర్థంకాక చైనా యువతీయువకులు పెళ్లి మాట వినడానికే ఇష్ట పడటం లేదు. పెళ్లి చేసుకుని పిల్లలను కంటే సరిపోదు.. చైనా ప్రభుత్వం విధించే సవాలక్ష ఆంక్షలను అధిగమించి పిల్లలను పెంచడాన్ని ప్రజలు గుదిబండగా భావిస్తున్నారు.

చైనాకు త్వరగా ముసలితనం వచ్చేసిందా ?
జనాభా సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో..అప్పుడు ఏ దేశమైనా విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చైనా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. గడిచిన పది సంవత్సరాలుగా చైనాలో పెళ్లిళ్ల శాతం క్రమంగా తగ్గుతూ రావడంతో జనాభా సమతుల్యత దారుణంగా దెబ్బతిన్నది. యంగ్ జనరేషన్ కంటే ముసలి వాళ్లు ఎక్కువైపోయారు. చైనా పూర్తి సంపన్న దేశం కాకముందే పూర్తిగా ముసలిదైపోతుందని అక్కడి ప్రజలే జోకులేసుకునే పరిస్థితికొచ్చింది. ప్రతి వెయ్యిమందిలో మరణాల రేటు 7.1శాతంగా ఉంటే.. జననాల రేటు 1.3 శాతంగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2019 లెక్కల ప్రకారం చైనాలో 60 ఏళ్లు దాటిన వాళ్లు 254 మిలియన్ ప్రజలు ఉంటే.. 2040 నాటికి వాళ్ల సంఖ్య 402 మిలియన్లకు చేరుకుంటుందని ఓ అంచనా. దేశ జనాభాలో ఈ వ్యత్యాసం చైనా ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతుంది. ఒకప్పుడు చైనా అనుసరించిన జనాభా నియంత్రణ విధానం.. చివరకు ఆ దేశానికే శాపంగా మారింది.