Chinese Millionaire: చైనా మిలియనీర్.. 27 సార్లు పరీక్షల్లో ఫెయిల్..

లియాంగ్ షి అనే 56 ఏళ్ల వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో లేబర్ స్థాయి నుంచి పెద్ద నిర్మాణ కంపెనీ స్థాపించే వరకు ఎదిగాడు. స్థానికంగా చాలా ధనవంతుడు. అయితే, అప్పట్లో పెద్దగా చదువుకోలేకపోయాడు. దీంతో తనకు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని ఉంది. దాదాపు 40 ఏళ్లుగా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 12:08 PM IST

Chinese Millionaire: చైనాలో అతడో మిలియనీర్. వయసు 56. చాలా కింది స్థాయి నుంచి కుబేరుడి స్థాయికి ఎదిగాడు. ఇంకేం.. అతడు జీవితంలో అన్నీ సాధించినట్లే అనుకుంటే పొరపాటే. ఎప్పటినుంచో సాధించాలని ఆశపడుతున్న పరీక్షల్లో మాత్రం వరుసగా ఫెయిలవుతూనే ఉన్నాడు. ఇప్పటికీ తను అనుకున్నది సాధించలేకపోతున్నాడు. చైనాలో అత్యంత కష్టమైన పరీక్షలో 27సార్లు ఫెయిలయ్యాడు. అయినా మళ్లీ పట్టుదలతో ప్రయత్నిస్తా అంటున్నాడు.
లియాంగ్ షి అనే 56 ఏళ్ల వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో లేబర్ స్థాయి నుంచి పెద్ద నిర్మాణ కంపెనీ స్థాపించే వరకు ఎదిగాడు. స్థానికంగా చాలా ధనవంతుడు. అయితే, అప్పట్లో పెద్దగా చదువుకోలేకపోయాడు. దీంతో తనకు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని ఉంది. దాదాపు 40 ఏళ్లుగా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సిచువాన్ యూనివర్సిటీలో చదవాలనేది అతడి డ్రీమ్. ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. దీని కోసం అతడు అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ద నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీఈఈ) పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీన్ని గొకావో అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన అర్హత పరీక్షల్లో ఒక్కటి అంటుంటారు.

ఈ పరీక్షల్లో విజయం సాధిస్తేనే కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది. ఎంతకాలమైనా ఈ పరీక్ష రాయొచ్చు. లియాంగ్ షి కూడా దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ పరీక్ష రాస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 27 సార్లు పరీక్ష రాసి, ఫెయిలయ్యాడు. ఈ ఏడాది కూడా పరీక్ష రాసినా, మరోసారి ఫెయిలయ్యాడు. గత శుక్రవారం ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాదిమంది విద్యార్థులతోపాటు లియాంగ్ షి కూడా ఫలితాల కోసం ఎదురు చూశాడు. కానీ, కావాల్సిన పాయింట్లకంటే 34 పాయింట్లు తక్కువగా అర్హత సాధించాడు. దీంతో ఈసారి కూడా ఫెయిలయ్యాడు. అతడు విజయం సాధిస్తాడేమోనని మీడియా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ ఫలితాలు వెలువడ్డ అనంతరం లియాంగ్ షి మాట్లాడుతూ రిజల్ట్ చూడగానే తన గుండె బద్ధలైందన్నాడు.

యూనివర్సిటీలో ప్రవేశం పొందడం తన కల అని చెప్పాడు. పరీక్ష కోసం తాను ఎంతగానో శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నిస్తా అన్నాడు. వచ్చే ఏడాది పరీక్ష కోసం ప్రయత్నిస్తా అన్నాడు. జీవితంలో ఎన్నో మిలియన్ల డబ్బులు పోగేసి, కంపెనీ స్థాపించి, ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగినాసరే.. లియాంగ్ షి జీవితంలో గొకావో పరీక్ష ఒక తీరని కలగానే మిగిలిపోతోంది.