CM KCR: తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయం ఆదివారం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమంలో చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయం.. అధికారులు, నేతలు వరుసగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం. ఇప్పుడు దీనిపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడితే తెలంగాణ సంస్కృతిని తానే కాపాడుతున్నట్లు చెప్పుకొనే కేసీఆర్.. ఇప్పుడు నేతలు, అధికారులు వరుసగా వంగివంగి దండాలు పెట్టడంపై ఏమంటారు? ఇది కూడా తెలంగాణ సంస్కృతి అంటారా? గుజరాతీకి తెలంగాణ వ్యక్తి కాళ్లు మొక్కడం ఏంటని ప్రశ్నించిన కేటీఆర్ ఇప్పుడేం చెబుతారు?
ప్రజా ప్రతినిధులు, అధికారులు.. ఎవరి స్థాయి వారిది. ఎవరి పని వారిధి. ఒకరితో ఒకరు కలిసి పనిచేయాల్సిందే. అంతమాత్రాన ఒకరిమీద ఒకరు ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, ఎందుకో మన దగ్గర ప్రజా ప్రతినిధులు అంటే అధికారులకు ఎనలేని భయం, గౌరవాన్ని చూపిస్తుంటారు. నేతలపై అనవసర విధేయత చూపిస్తారు. తాజాగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. సచివాలయానికి వచ్చిన కేసీఆర్‌కు వరుసగా నేతలు, అధికారులు వంగివంగి కాళ్లకు మొక్కారు. ఒకరిని చూసి మరొకరు వరుసగా కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. ఈ దృశ్యాలు లైవ్‌లో టెలికాస్ట్ అయ్యాయి. అసలెందుకు అధికారులు కేసీఆర్ పాదాలకు నమస్కరించాలి అనే ఆలోచన చాలా మందిలో మెదిలింది. ఎందుకంటే అధికారులు కేసీఆర్‌తో సంబంధం లేకుండా ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు మారినా అధికారులు మాత్రం రిటైర్ అయ్యే వరకు సర్వీస్ చేయాల్సిందే. అలాంటిది నేతల ప్రసన్నం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి? కేసీఆర్ లేదా మరో నేత దయాదాక్షిణ్యాల మీదే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయా?
ఆత్మగౌరవం ఏమైంది?
తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నినాదాల్లో ఆత్మగౌరవం ఒకటి. తెలంగాణ ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని, ఆత్మగౌరవంతో బతకాలంటే తెలంగాణ రావాలని అప్పట్లో నినదించారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక మాత్రం ఆత్మగౌరవం కనిపించడం లేదు. అనేక చోట్ల ఇలాగే నేతలకు అధికారులు వంగివంగి దండాలు పెడుతున్నారు. సమాజంలో ఎంతో గౌరవం పొందే అధికారులు తమ ఆత్మగౌరవనాన్ని నేతల పాదాలదగ్గర తాకట్టుపెట్టడం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. గతంలో తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అలాగే పలు జిల్లా కలెక్టరేట్ భవనాల ప్రారంభం సందర్భంగా కూడా పలువురు కలెక్టర్లు ఇలాగే కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. దేశంలోనే అత్యున్నత సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్‌లు ఒక సీఎం కాళ్లు మొక్కడంపై అప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా, ఈ పద్ధతి ఆగిపోలేదు.
కేసీఆరే ప్రోత్సహిస్తున్నారా?
గతంలో ఎప్పుడో ఒకప్పుడు.. ఎవరో ఒకరు తప్ప ముఖ్యమంత్రి, మంత్రుల కాళ్లకు దండం పెట్టే పని చేయలేదు. పరస్పరం గౌరవించుకుంటూనే పని చేసుకు వెళ్లే వాళ్లు. కానీ, ఇప్పుడు కొందరు అధికారులు వరుసగా సీఎం కాళ్లకు దండం పెడుతూ అధికారుల స్థాయిని తగ్గిస్తున్నారు. ప్రజల చేత మెప్పు పొందాల్సిన అధికారులు ఇలాంటి పని చేసి ప్రజల్లో చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి పెద్దదే కావొచ్చు. కానీ, అధికారులకు ఈ స్థాయి ఇచ్చింది ప్రభుత్వమే కానీ, కేసీఆర్ కాదని గుర్తించాలి. అధికారులు.. తమ స్థాయిని అలా తగ్గించుకోకుండా, ఆత్మ గౌరవంతో బతకాలి. కానీ, నేతల ఆశీస్సులు ఉంటే చాలు అనుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి వాటిని ఖండించాల్సిన సీఎం కేసీఆర్ వీటిని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోంది. చాలా కాలంగా ఇలా కేసీఆర్ కాళ్లపై అధికారులు పడుతున్నారు. వీటిని కేసీఆర్ ఎప్పుడో వద్దని చెప్పుంటే ఇప్పుడిలా చేసేవాళ్లు కాదు. కానీ, కేసీఆర్ ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. అధికారుల ఆత్మగౌరవం గురించి పట్టించుకోవడం లేదు. ఇది కూడా తెలంగాణ సంస్కృతే అనుకుంటున్నారా? తెలంగాణలో అధికారులంతా తనకు, తన తోటి నేతల కాళ్లకు వంగి సలాం చేయాల్సిందే అని కేసీఆర్ భావిస్తున్నారా? ఇలాంటి విమర్శలు రాకూడదనుకుంటే కేసీఆర్ ఇకనుంచైనా అధికారులకు ఈ విషయంలో సూచనలు చేయాలి.
కేటీఆర్ ఏం చెబుతారు?
గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన కాళ్లకు నమస్కరించారు. అమిత్ షా చెప్పులు తీసి ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీ పాదాల దగ్గర బండి సంజయ్ తాకట్టుపెట్టారంటూ విమర్శించారు. మరి ఇప్పుడు తెలంగాణలో అధికారులు చేస్తున్నదేంటి? తన తండ్రి, సీఎం కేసీఆర్ పాదాల దగ్గర ఉద్యోగులు తాకట్టుపెడుతుంటే కేటీఆర్‌కు కనిపించడం లేదా? ఇప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రావట్లేదా? ఈ అంశంలో కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలి. కేటీఆర్ కూడా దీనిపై స్పందించాలి.