Coding Ninjas: సాఫ్ట్ వేర్ ఉద్యోగులను బయటకు పంపకుండా ఆఫీసుకి తాళం.. ఎక్కడో తెలుసా..?

సాప్ట్ వేర్ ఆఫీసుల్లో పని చేయడం అంటే బయటకు కనిపించినంత సాప్ట్ గా ఉండదు. ఇది అందులో పనిచేసే వారికి బాగా తెలుసు. ఎందుకంటే బయటకు కనిపించే వర్కింగ్ హవర్స్ ఒకటి, లోపల జరిగే పనిగంటలు మరొకటి ఉంటాయి. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని కాసులు ఆశ చూపిస్తాయి కొన్ని కంపెనీలు. ఇలా కాకుండా ఇచ్చిన పని పూర్తి చేసేంత వరకూ లాగ్ ఆఫ్ చేయకూడదు అంటూ హెవీ టాస్క్ ఇచ్చి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. లాక్ డౌన్ కారణంగా తమ పిల్లలు చేసే పనేంటో ఇంట్లోని వారు అందరూ కళ్లారా చూసి ఉంటారు. సాఫ్ట్ వేర్ అంటే ప్రోగ్రామింగ్ ల్యంగ్వేజ్ అంతకాకపోయినా వర్క్ ఫ్రం హోం కారణంగా పేరెంట్స్, రిలేటీవ్స్ కి కొంతో గొప్పో అర్థమయ్యే ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఉద్యోగులు పని అయిపోయే వరకూ బయటకు వెళ్లకూడదు అని షరతులు పెడుతూ గేట్ కు తాళాలు వేయించింది ఒక కంపెనీ. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 07:28 PM IST

హరియాణాలోని గురుగ్రామ్ ఐటీ హబ్లో కోడింగ్ నింజాస్ అనే ఎడ్ టెక్ కంపెనీ దశాబ్ధకాలంగా ఐటీ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీలోని సెక్యూరిటీ చేసిన నిర్వాకం కంపెనీ తలంపులకు కారణం అయ్యింది. ఆఫీసు లోనుంచి పని మధ్యలో బయటకు వెళ్లకూడదని అలా వెళ్లాలంటే పై అధికారుల పర్మిషన్ లెటర్ ఉండాలని షరతుపెట్టింది. ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఒకరు రిలాక్స్ కోసమో, అత్యవసర పని నిమిత్తమో బయటకు వెళ్లాలని వస్తున్నారు. దీనిని గమనించిన సెక్యూరిటీ ఒకరు డోర్ కి తాళాలు వేస్తూ కనిపించారు. బయటకు వెళ్లాలి తలుపులు తీయమని అడిగితే పర్మిషన్ లెటర్ చూపించమని అడుగుతాడు. ఎవరు తలుపులు వేయమని ఆదేశించారు నీకు అని సదరు ఉద్యోగి ప్రశ్నించగా మేనేజర్ చెప్పాడు అంటూ బదులిస్తాడు ఆ సెక్యూరిటీ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల కామెంట్లతో సాఫ్ట్ వేర్ కంపెనీల పై తమదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. పని పేరుతో శ్రామికుల రక్తం తాగేస్తున్నారంటూ ఒకరు.. కార్పోరేట్ రంగంలో ఏస్థాయిలో పని ఒత్తిడికి నిదర్శనం ఈ వీడియో అని మరొకరు దుయ్యబడుతున్నారు. కార్పోరేట్ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం రోజురోజుకూ దిగజారిపోతుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా వైరల్ కాస్త వివాదాస్పదంగా మారిన తరువాత కంపెనీ యాజమాన్యం స్పందించి సంజాయిషీ ఇచ్చుకుంది. ఇది ఒక ఉద్యోగి చేసిన తప్పిదమని, తమకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై వెంటనే చర్యలు తీసుకున్నమని చెప్పుకొచ్చింది. యాజమాన్యంతో పాటూ వ్యవస్థాపకులు జరిగిన ఘటనలోని తప్పిదాన్ని గుర్తించి నేరుగా ఉద్యోగులకు క్షమాపణలు చెప్పామని తెలిపింది. అలాగే అలా అసౌకర్యానికి గురిచేసిన సదరు సెక్యూరిటీ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ సంఘటనలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్క ఉద్యోగికీ క్షమాపణలు తెలియజేస్తున్నామని కూడా వెల్లడించింది.

ఏది ఏమైనా ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. చిన్న సెక్యూరిటీ ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఎవరి ఆదేశాలు లేకుండా ఇలాంటి హేయమైన చర్యకి పాల్పడతాడా.? అంతటి సాహసం, ధైర్యం అతనిలో ఉంటుందా..? లేకుంటే ఈ సెక్యూరిటీకి నిజంగానే ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు అనేది గమనించదగ్గ అంశం. ఎందుకంటే ఇలా జరుగుతుందని బహుశా యాజమాన్యం అనుకోకపోవచ్చు. సీన్ కట్ చేస్తే తమ కంపెనీ నిర్వాకం బట్టబయలైన కారణంగా పేరు ఎక్కడ పోతుందో అన్న అభద్రతా భావంతో క్షమాపణలు అనే కొత్త రాగం అందుకొని ఉండవచ్చు. దీనికి ప్రతీకగా నింద సెక్యూరిటీ మీద మోపి ఇంతటితో ఈ సంఘటనకు ఎండ్ కార్డ్ వేయాలనుకుని ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా ఇలాంటి సంఘనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఇలా వెలుగులోకి వస్తే మరికొన్ని చీకటి తెరల్లో దాగిఉంటాయని చెప్పక తప్పదు.

 

T.V.SRIKAR