Cool Roof Policy: తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ.. భవనాల్లో ఎండ వేడిమి తగ్గించేలా సరికొత్త ప్లాన్.. కరెంటూ ఆదా!

తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ 2023-28 అమలు కానుంది. ఈ విధానాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. దీని ప్రకారం 600 గజాలు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాలు కూల్ రూఫ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఆ భవనాలు చల్లగా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - April 5, 2023 / 04:21 PM IST

Cool Roof Policy: తెలంగాణలో కొత్తగా కట్టబోతున్న భవనాలు ఇకపై మరింత చల్లగా ఉండబోతున్నాయి. ఎండ వేడి దాదాపు 5 డిగ్రీలు తగ్గేలా ఈ భవనాలు నిర్మితం కానున్నాయి. దీనికి కారణం కూల్ రూఫ్ పాలసీ 2023-28. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా అమల్లోకి తెచ్చిన సరికొత్త విధానమిది. దీనివల్ల భవనాల్లో ఎండ వేడిమి తగ్గుతుందని, ఇది పర్యావరణాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. దేశంలో ఈ విధానాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇంతకీ.. కూల్ రూఫ్ పాలసీ అంటే ఏంటి? ఇది భవనాల్లో చల్లదనాన్ని ఎలా అందిస్తుంది?

ఇదీ పాలసీ
కూల్ రూఫ్ పాలసీ అమలయ్యే ప్రాంతాల్లో భవన నిర్మాణదారులు, భవనాల యజమానులు ఈ పాలసీని పాటించి తీరాలి. దీని ప్రకారం.. 600 గజాలు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాలు కూల్ రూఫ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అలా నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. సాధారణంగా కూల్ రూఫ్‌ల ఏర్పాటుకు ఒక చదరపు మీటరుకు రూ.300 ఖర్చవుతుందని అంచనా. నిజానికి ఈ పాలసీని నాలుగేళ్ల క్రితమే తీసుకురావాలి అనుకున్నారు. దీని కోసం అప్పట్లోనే ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం.

తర్వాత దీనికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు, సలహాల్ని మున్సిపల్ శాఖ స్వీకరించింది. అనంతరం తుది పాలసీని రూపొందించింది. తాజాగా ఈ పాలసీని అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీ నిర్మాణదారులు లేదా భవన యజమానులకు ఆర్థికంగా భారమే. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహకాలు ఇవ్వాల్సింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రోత్సాహం ప్రకటించలేదు. దీంతో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే సందేహాలు నెలకొన్నాయి.

నిజంగానే చల్లదనాన్ని అందిస్తుందా?
కొత్తగా నిర్మితమవుతున్న భవనాలు ఎక్కువ ఎండ వేడిమికి గురవుతున్నాయి. భవనాలపై పడ్డ ఎండ వేడి లేదా సూర్యకాంతి తిరిగి పరావర్తనం చెందడం లేదు. వచ్చిన ఎండను వచ్చినట్లే భవనాలు గ్రహిస్తున్నాయి. దీంతో భవనాల్లో ఉష్ణోగ్రత/వేడి ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. దీని కోసం కరెంటు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది. ఇది అంతిమంగా పర్యావరణానికి కూడా హాని చేస్తుంది. అదే కూల్ రూఫ్ టెక్నాలజీని వాడితే ఈ పరిస్థితి ఉండదు. భవనాలు, ఇండ్లు చల్లగా అవుతాయి. ఈ పద్ధతిలో కొత్తగా నిర్మాణం చేపట్టే భవనాల పైకప్పుల్లో కూల్ రూఫ్ టెక్నాలజీ వాడుతారు.

అంటే పైకప్పులు నిర్మించేందుకు వాడే మెటీరియల్‌లో ప్రత్యేక రసాయనాలు కలిపిన పదార్థాలు, సామగ్రి వాడుతారు. ఇవి ఎండ వేడిమిని తగ్గిస్తాయి. సూర్యకాంతి/ఎండ పడినప్పుడు ఆ కాంతిని తిరిగి పరావర్తనం చెందిస్తాయి. దీనివల్ల పైకప్పులు చల్లగా మారుతాయి. దీంతో ఇల్లు, భవనం లోపల కూడా చల్లగా ఉంటుంది. మిగతా భవనాలతో పోలిస్తే కూల్ రూఫ్ టెక్నాలజీ వాడిన ఇండ్లు గరిష్టంగా 5 డిగ్రీల చల్లదనాన్ని కలిగి ఉంటాయి. కూల్ రూఫ్ విధానంలో ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్న కూల్ పెయింట్స్ వేయడం, కూలింగ్ టైల్స్ వేసుకోవడం, వినైల్ షీట్లు ఏర్పాటు చేసుకోవడం, బిల్డింగుపైనా, చుట్టూ మొక్కలు పెంచడం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా బిల్డింగు లోపల చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. దీనివల్ల కరెంటు కూడా ఆదా అవుతుంది. బిల్డింగ్ లోపల ఎక్కువ చల్లగా ఉండటం వల్ల ఏసీలు, ఫ్యాన్లు వంటివి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో కరెంటు ఆదా అయి, బిల్లు తగ్గుతుంది.


భవిష్యత్తు ప్రణాళిక ఇది
ప్రస్తుతం 600 గజాల విస్తీర్ణం కలిగిన భవనాలు, ఇండ్లకు మాత్రమే కూల్ రూఫ్ పాలసీని అమలు చేయనున్నారు. అయితే, 2030కల్లా 300 గజాల స్థలంలో నిర్మించే వాటికి కూడా ఈ విధానాన్ని అమలు చేస్తారు. కొత్తగా కట్టే వాటికే కాకుండా ఇప్పటికే నిర్మించిన భవానాలు, ఇండ్లలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తారు. దీనివల్ల భవనాలు, ఇండ్ల లోపల వేసవి కాలం ఎండ వేడిమితో సతమతమయ్యే పరిస్థితి తప్పుతుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం లేదు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల రెండు వందల చదరపు కిలోమీటర్లు, మిగిలిన రాష్ర్టంలో వంద చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఈ విధానాన్ని వర్తింపజేస్తారు. తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇక కూల్ రూఫ్ టెక్నాలజీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, జీహెచ్ఎంసీ, ఐఐఐటీ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.