Corona Cases: పుట్టింటి వాసాలు లెక్కెడుతున్న కరోనా.. కోవిడ్ కేసుల్లో రికార్డ్ సృష్టిస్తున్న చైనా..

చైనాలో కోవిడ్ మళ్లీ కోరలు చాస్తుంది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో అన్నట్లు కేసుల దుందుబి మోగిస్తుంది. రికార్డ్ స్థాయిలో వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంతటి దీన పరిస్థితుల్లో ఆ దేశం ఉందో.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 04:09 PM IST

కోవిడ్ పుట్టింది చైనాలోనే అన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడే దీని తీవ్రత అధిక స్థాయిలో ఉంది. రోజు రోజుకూ కాదు.. గంటగంటకూ, గడి గడియకూ అన్న విధంగా కరోనా మహమ్మారి తన ఉనికిని విస్తరింపజేస్తుంది. దీనికి గల ప్రదాన కారణం కొత్త వేరియంట్లు అంటున్నారు నిపుణులు. ఇది ఇలాగే కొనసాగితే జూన్ మాసాంతానికి అత్యధికంగా వారానికి 6.5 కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉండవచ్చునని అక్కడి వైద్యనిపుణులు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనా కోలుకోవడం కష్టమే అంటూ కొన్ని అంతర్జాతీయ మీడియాలో కొన్ని ప్రత్యేక కథనాలు ప్రచురితం అవుతున్నాయి. దీంతో ఆదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకరకమైన ఆందోళన ఎదురవుతోంది.

ఒమెక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్ కారణంగా ఏప్రిల్ నుంచి కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. మే చివరి నాటికే నాలుగు కోట్ల కేసులు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అక్కడి స్థానిక వైద్యులు చెప్పినట్లు ఈ పత్రికల సారాంశం. గత ఏడాది డిసెంబర్ లో కరోనా తీవ్రతను గుర్తించి జీరో కోవిడ్ విధానాన్ని అమలుచేశారు. అప్పుడు కూడా ఇంతలా విజృంభించలేదని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈసారి వినాశనమే అన్నట్లు కరోనా తన పంజా విసురుతోందని భయాందోళనకు గురౌతున్నారు.

ఇంతటి విపత్కర పరిస్థితులు తలెత్తిన తరువాత దొంగలు పడి ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు అన్న విధంగా అక్కడి ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి మళ్ళీ తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని సూచించారు. ఒమెక్రాన్ ఎక్స్ బి బి వేరియంట్ వైరస్ తీవ్రతను అధిగమించే సామర్థ్యం వ్యాక్సిన్లకు లేదంటున్నారు. ఈరకమైన వైరస్ బారినుంచి తట్టుకునేందుకు ప్రత్యేకమైన టీకాలను తయారు చేస్తున్నామంటున్నారు. చైనా అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించే నిపుణుడు జాంగ్ నన్షాన్ చెప్పినట్లు కొన్ని కథనాలు ఇంటర్నేషనల్ పత్రికా మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించి రెండు రకాలా కొత్త టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మరో నాలుగు రకాలా సరికొత్త వ్యాక్సిన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అంటున్నారు. ఈ సరికొత్త టీకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి తీవ్రమైన వైరస్ ను అయినా తట్టుకొని నిలబడతారని ఈ వ్యాక్సీన్ల తయారీకి అనుమతులు కూడా మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇప్పుడున్న వేరియంట్ తీవ్రత తక్కువ, వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం వృద్దుల్లో, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిలో అధికంగా ఉందని డ్రాగన్ దేశ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తిరిగి జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తే ఇంతటి స్థాయి ప్రమాదం నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది. గతంలో జీరో పాలసీ పై గృహ నిర్భంధం అంటూ చేసిన తిరుగుబాటు కారణంగానే ఇప్పుడు కరోనా కాటుకు గురికావాల్సి వస్తుందని చెప్పాలి.

 

T.V.SRIKAR