COVID 19: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 761 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 761 మందికి కరోనా సోకినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ఒక్కరోజులోనే కరోనా కారణంగా 12 మంది మరణించారు. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య తక్కువగా ఉండేది.
Jana Sena : కాపుల ఓట్ల కోసం పవన్ పాట్లు.. నాగబాబు సీక్రెట్ మీటింగ్ ?
రెండు లేదా మూడుకు మించి మరణాలు నమోదు కాలేదు. కానీ, ఇలా ఈసారి ఏకంగా 12 మంది మరణించడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. ఇక.. గురువారం ఒక్కరోజే 838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలి కాలంలో జేఎన్1 వేరియెంట్ కంగారు పెట్టిస్తోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో జేఎన్ 1 వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. జనవరి 3 నాటికి దేశంలో జేఎన్ 1 కేసులు 541కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా మరణించిన 12 మందిలో ఐదుగురు కేరళకు చెందిన వారు కాగా.. నలుగురు కర్ణాటక, ఇద్దరు మహారాష్ట్ర, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు.
శుక్రవారం ఉదయం నాటికి కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 5,33,385కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం ఉన్నాయి. కొవిడ్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కేసులు సంఖ్య, మరణాలు పెరుగుతున్నప్పటికీ ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.