COVID-19: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అప్రమత్తం కావాల్సిందేనా..?

కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పది శాతం పెరిగింది. జులై రెండో వారంలో అమెరికాలో 7,100 మందికిపైగా రోగులు కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉండేది. ఎమర్జెన్సీ వార్డులో చేరుతున్న రోగుల సంఖ్య 0.73 శాతం పెరిగింది.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 01:13 PM IST

COVID-19: కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అమెరికాలో కోవిడ్ కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రభుత్వ ఆరోగ్య సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

అందులోనూ కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పది శాతం పెరిగింది. జులై రెండో వారంలో అమెరికాలో 7,100 మందికిపైగా రోగులు కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉండేది. ఎమర్జెన్సీ వార్డులో చేరుతున్న రోగుల సంఖ్య 0.73 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.49 శాతంగా ఉంది. డిసెంబర్ తర్వాత అమెరికాలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదవుతోంది ఇప్పుడే. కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా కేసులు కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియెంట్ కారణంగా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉంటుందన్నారు. రుతుపవనాలు కూడా ఇందుకు కారణం కావొచ్చన్నారు. ఇన్‌ఫ్లుయెంజా మాదిరిగానే పలు కారణాలవల్ల సీజన్ మారినప్పుడు ఈ తరహా వ్యాధులు విజృంభించడం సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు.

మన దేశంలోనూ కోవిడ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,474 కోవిడ్ కేసులున్నాయి. కొన్ని నెలలుగా దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అత్యల్ప స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 4.5 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో దాదాపు 5.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ కోవిడ్ విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, తీవ్ర, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న పెద్ద వయసు వాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారైతే పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు.