ఫామ్‌లో లేను కదా అని పారిపోయాననుకున్నారేమో… ఏం కాదు… జస్ట్ రెస్ట్ మోడ్‌లో మాత్రమే ఉన్నా అంటోంది కరోనా ( Corona)…. దేశంలో మరో మారు పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. వైరస్ ( Virus) దూకుడు చూస్తుంటే ఫోర్త్ వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఇటు మన దేశంలో పరిస్థితిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పెట్టింది.
దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతున్నాయి. ఏడాదిన్నరగా చడీచప్పుడు లేకుండా ఉన్న కరోనా చాపకింద నీరులా పాకిపోతోంది. వైరస్ చనిపోయిందని అంతా లైట్ తీసుకున్నా అది మాత్రం అన్నింటినీ తట్టుకుని మనుగడ సాధిస్తోంది. ఇప్పుడు ఒళ్లు విరుచుకుని రెచ్చిపోతోంది. దేశంలో ప్రస్తుతం ప్రతి రోజూ కాస్త అటూ ఇటుగా 3వేలకు పైగా కేసులు వస్తున్నాయి. గత ఆరునెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. వారం క్రితం వరకు రోజుకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరడమే టెన్షన్ పెడుతోంది. రోజువారి పాజిటివిటీ రేటు (Positivity Rate) 2.09శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 16వేలకు పైగా యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
రోజుకు లక్షకు పైగా కేసులు చూసిన మనకు 3వేల కేసులు చాలా తక్కువే. కానీ కేసులు వస్తున్న తీరు మాత్రం ఆందోళనకరమే. పదుల నుంచి వందల్లోకి… వందల నుంచి వేలల్లోకి జెట్ స్పీడ్‌లో పెరిగిపోయింది. ఇదే టెన్షన్ పెరుగుతోంది. కేరళ (Kerala), మహారాష్ట్ర (Maharashtra), గుజరాత్ (Gujarat), కర్ణాటక (Karnataka), ఢిల్లీల్లో (Delhi) కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. మన దేశంలో కేసుల తీవ్రత పెరగడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. గతంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే కోవిడ్ అన్న అనుమానంతో పరీక్షలు చేయించేవారు. అయితే ప్రస్తుతం సాధారణ జ్వరంగా పరిగణిస్తున్నారు. జనంలో స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇలా ఇది పాకిపోతోంది. సాధారణంగా మన దేశంలో వర్షాకాలంలోను, డిసెంబర్-మార్చి మధ్య జ్వరాల సీజన్ నడుస్తుంది. అయితే ఈసారి వాటి తీవ్రత పెరిగింది. దీనికి, కోవిడ్‌కు ఏమైనా కారణముందా అన్నదానిపైనా పరిశోధనలు జరుగతున్నాయి.
దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరగడానికి కారణం XBB.1.16 వేరియంట్ కారణం కావొచ్చని చెబుతున్నారు. అయితే ఇది అంత ప్రమాదకరం కాదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. గత కొన్ని నెలలుగా ఈ వేరియంటే ఎక్కువగా తిరుగుతోందని.. కానీ తీవ్రస్థాయి దుష్పరిణామాలు మాత్రం చూపలేదంటున్నారు. కానీ వేరియంట్ ఏదైనా రోగనిరోధక శక్తి (Immunity Power) కాస్త తక్కువగా ఉన్నవారికి మాత్రం ముప్పు తప్పదంటున్నారు. కరోనా కేసుల తీవ్రతపై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. టెస్టింగ్ (Testing), ట్రేసింగ్‌పై (Tracing) దృష్టి పెట్టాలని సూచించింది. ప్రస్తుతానికి మాస్క్‌ను (Mask) మస్ట్ చేయనప్పటికీ.. సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌తోనే ఉండాలని సూచిస్తోంది. కేసుల తీవ్రత పెరిగితే మళ్లీ మాస్క్ కచ్చితంగా తప్పదు.
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) కూడా ఫోకస్ పెట్టింది. XBB.1.16 వేరియంట్‌పై ఓ కన్నేసి ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా 21దేశాల్లో ఈ వేరియంట్ కనిపించింది. కోవిడ్ రూపు మార్చుకుందని టీసెల్ ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునేందుకు మరిన్ని మ్యుటేషన్లు (Mutations) చోటు చేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో వైరస్ ఎఫెక్ట్ అయిన సెల్స్‌ను గుర్తించడం ఆలస్యమవుతుంది. ఫలితంగా కోవిడ్ చాలాకాలం పాటు శరీరంలో అలా ఉండిపోతోంది. కోవిడ్ ఇంకెంతకాలం ఉంటుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. అది పూర్తిగా పోవడం అసాధ్యం అని కొందరు అంటున్నారు. అయితే మొత్తం ప్రపంచ జనాభాకు సహజసిద్ధమైన వ్యాధినిరోధక శక్తి వచ్చినప్పుడే పాజిటివ్ కేసులకు బ్రేక్ పడుతుందని కొందరు చెబుతున్నారు. న్యాచురల్ ఇమ్యూనిటీ లేకుండా ఏ వైరస్‌ను అయినా ఎదుర్కోవడం కష్టం… కానీ ఇలా న్యాచురల్ ఇమ్యూనిటి ప్రపంచవ్యాప్తంగా రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.