Cyclone Michaung: తుఫాన్ ఎఫెక్ట్‌తో రైళ్లు రద్దు.. రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్

తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా అనేక చోట్ల రహదారులు, ఇండ్లు నీట మునిగాయి. పలుచోట్ల రైలు మార్గాలు కూడా నీటిలోనే ఉండిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 06:19 PM IST

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ప్రభావం చూపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా అనేక చోట్ల రహదారులు, ఇండ్లు నీట మునిగాయి. పలుచోట్ల రైలు మార్గాలు కూడా నీటిలోనే ఉండిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే శాఖ 300 రైళ్లను రద్దు చేసింది.

MICHAUNG EFFECT: మిచౌంగ్ తీరం దాటింది ! 100 కిమీ వేగంతో ఈదురుగాలులు

అలాగే కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్.. మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా 300 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 10 రైళ్లను గూడూరు-చెన్నై మధ్య కాకుండా.. వేరే రూట్లలోకి మళ్లించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి రైల్వే ట్రాకులపై ఎక్కడా నీళ్లు నిలిచి లేవని, అయితే, వరద నీళ్లు నిలిచి ఉండే ట్రాకులను ముందే గుర్తించామని చెప్పారు. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా.. రైళ్లను రద్దు చేశామన్నారు.

ఈ సమాచారాన్ని ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు చేరవేశామన్నారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ సూచన మేరకు రైళ్లను ఎంత కాలం రద్దు చేయాలి.. ఎప్పుడు ప్రారంభించాలి అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.