సారీ చెప్పిన దలైలామా
ప్రపంచ వ్యాప్తంగా విమర్శల తీవ్రత పెరగడంతో దలైలామా కార్యాలయం క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని స్నేహితులకు క్షమాపణలు చెప్పింది. అలా ప్రవర్తించడంలో దలైలామాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని.. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా అందరినీ టీజ్ చేస్తూ మాట్లాడటం ఆయన సహజ లక్షణమని తెలిపింది.
ఇంతకీ దలైలామా ఎందుకలా చేశారు ?
దలైలామా ఎందుకలా ప్రవర్తించారో తెలియాలంటే టిబెట్ సంప్రదాయాలను అర్థం చేసుకోవాలి. మనకు ఎదురుపడ్డ వ్యక్తులను పలకరించడానికి ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం ఉంది. భారతీయ సంస్కృతిలో రెండు చేతులు జోడించి నమస్కారం చెబితే.. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ పలకరించుకుంటారు. అయితే వీటన్నింటికంటే భిన్నమైన సంప్రదాయం టిబెట్‌లో ఉంది. నాలుకను బైట పెట్టి ఎదుటి వ్యక్తిని గ్రీట్ చేయడమన్నది టిబెట్‌లో ఓ సంప్రదాయం. వినడానికి విచిత్రంగా ఉన్నా 9వ శతాబ్దం నుంచి అక్కడ ఈ సంప్రదాయం ఉంది. దీని వెనుక ఓ కారణం ఉంది. ఆ కాలంలో టిబెట్‌లో లాంగ్ ధర్మా అని ఓ రాజు ఉండేవాడు. అతని నాలుక చాలా నల్లగా ఉండేదట. పునర్జన్మలను బాగా విశ్వసించే టిబెట్ ప్రజలు ఆ రాజు చనిపోయి మళ్లీ పుట్టాడని నమ్మడం మొదలు పెట్టారు. అయితే అలా రాజుగా పుట్టిన వ్యక్తి తాము కాదు అని నిరూపించుకునేందుకు నాలుకను బయటకు పెట్టి చూపించేవారు. నల్లటి నాలుక లేకపోతే వాళ్లు రాజు కాదని భావించారు. చివరకు ఇది ఓ సంప్రదాయంగా స్థిరపడిపోయి ఇలాగే పలకరించుకునే వరకూ వచ్చింది. దలైలామా suck my tongue అని ఆ బాలుడితో పరాచకమాడటానికి కూడా అదే కారణమని ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన ప్రతినిధులు వాదిస్తున్నారు.