China Delegates: చైనా ప్రతినిధుల బ్యాగుల్లో ఏముంది..? ఎందుకంత రహస్యంగా తెచ్చారు..?

సాధారణంగా విదేశీ ప్రతినిధులు సహా ఎవరొచ్చినా.. వాటిని ఎయిర్‌పోర్టులోనే స్కానింగ్ నిర్వహించి, తనిఖీ చేస్తారు. కొద్దిమంది ప్రతినిధులకు మాత్రమే ప్రొటోకాల్ ప్రకారం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. చైనా ప్రతినిధులు తెచ్చిన బ్యాగులను భారత అధికారులు తనిఖీ చేయలేదు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 02:01 PM IST

China Delegates: జీ 20 సదస్సు సందర్భంగా చైనా ప్రతినిధులు ఇండియా తీసుకొచ్చిన బ్యాగులపై కలకలం రేగుతోంది. ఈ బ్యాగులు అనుమానాస్పదంగా ఉండటంతో వీటిపై విచారణ ప్రారంభమైంది. గత వారం జీ20 సదస్సు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు చైనా సహా వివిధ దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరయ్యారు. వాళ్లు వచ్చేటప్పుడు బోలెడంత లగేజ్ తీసుకొస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో చైనా ప్రతినిధులు తీసుకొచ్చిన బ్యాగులపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా విదేశీ ప్రతినిధులు సహా ఎవరొచ్చినా.. వాటిని ఎయిర్‌పోర్టులోనే స్కానింగ్ నిర్వహించి, తనిఖీ చేస్తారు. కొద్దిమంది ప్రతినిధులకు మాత్రమే ప్రొటోకాల్ ప్రకారం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. చైనా ప్రతినిధులు తెచ్చిన బ్యాగులను భారత అధికారులు తనిఖీ చేయలేదు. ఇరు దేశాల మధ్య ఉన్న వియత్నాం ఒప్పందం, ప్రొటోకాల్ ప్రకారం వీటిని తనిఖీ చేయలేదు. దీంతో తమ బ్యాగుతో సహా చైనా ప్రతినిధులు ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో బస చేశారు. అయితే, వారికి సర్వీస్ చేసేందుకు వెళ్లిన హోటల్ సిబ్బంది అక్కడి గదుల్లో అసాధారణంగా ఉన్న బ్యాగులను గమనించారు. ఈ విషయాన్ని భద్రతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే భారత అధికారులు వెళ్లి ఆ బ్యాగులను తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, చైనా ప్రతినిధులు దీనికి ఒప్పుకోలేదు. తమ ప్రొటోకాల్ ఒప్పందం ప్రకారం వాటిని తనిఖీ చేయడానికి కుదరదని వ్యాఖ్యానించారు. దాదాపు 12 గంటలపాటు భద్రతాధికారులకు, చైనా ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగిన అనంతరం ఈ బ్యాగుల్ని తనిఖీ చేసేందుకు వాళ్లు అంగీకరించారు.

దీంతో ఆ బ్యాగులను చైనా ఎంబసీకి తరలించారు. అక్కడ వాటిని పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాగులు 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పుతో చాలా మందంగా ఉన్నాయి. ఇలాంటి అసాధారణ బ్యాగులు 20 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో నిఘా పరికరాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని స్కాన్ చేసి, తనిఖీలు జరిపిన తర్వాతే వాటిల్లో ఏముందో తేలే అవకాశం ఉంది. ఈ అంశంపై చైనా అధికారికంగా స్పందించలేదు.