సాధారణంగా పెళ్లి అంటే మమిడాకులు, పెటాకులు అంటే విడాకులు అంటూ అదేదో తప్పుడు సంకేతం వచ్చేలా సమాజం ఒక మూర్ఖపు పోకడను అవలంభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన 2023 సంవత్సరంలో ఉన్నాము. సగటు మానవుడు అన్నం, నీళ్లు, గూడు లేకున్నా బ్రతుకుతాడేమోకానీ స్వేచ్ఛ లేకుంటే క్షణం గడవడం కష్టం అవుతుంది. అందుకే సుదీర్ఘ వైవాహిక జీవనం తరువాత కొందరు ఇలా విడాకులు తీసుకొని విడివిడిగా బ్రతికేందుకు నడుం బిగించారు. అంతేకాకుండా పెళ్లి తరహాలో ఫోటో షూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వైవాహిక బంధాన్నే కాకుండా విడిపోయిన విషయాన్ని బహిర్గతం చేస్తూ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.
Really good. pic.twitter.com/9KaEYgLFEt
— The Big Guy (@TSSteinbacher) March 29, 2019
అమెరికా నుంచి ఈ రకమైన సంప్రదాయాన్ని మన నారీమణులు ప్రేరణపోందారని చెప్పాలి. 2006లో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టి అందులోని ఒడిదుడుకులను, సాదకబాదకాలను అనుభవించి 2019లో తీరని నైరాశ్యంతో విడాకులు తీసుకునేందుకు తొలిఅడుగు వేశారు. ఇలా విడిపోయే తంతు మొత్తాన్ని ఫోటో షూట్ ద్వారా స్వేచ్ఛా లోకంలోకి వెళ్లే మధుర స్మృతులుగా భద్రపరుచుకున్నారు. తన పెళ్లిఫోటోను కాళ్ల కింద వేసి తొక్కేస్తూ, అగ్నిసాక్షిగా జరిగిన వేడుకను అగ్నిసాక్షిగానే తొలగించుకోవాలన్న ఆలోచనతో ఇద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని కాల్చివేశారు. అలాగే ఈ మధురానందంలో వైన్ తాగుతూ వివిధ రకాలా ఫోజులతో ఫోటోలు దిగారు. ఈమొత్తం క్రియను లోలిస్ మాజీ భర్తకు చెందిన సోదరి నటాషా ను ఫోటోగ్రాఫర్గా చేయడం ఇందులో ఆసక్తికరమైన కొసమెరుపుగా చెప్పాలి. ఇలా చేసిన రెండేళ్ల తరువాత తాను ఎంత హాయిగా జీవితాన్ని గడుపుతున్నానో సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
లారెన్ బ్రూక్ అనే మహిళ ఇదే కోవలోకి వస్తారు. తన దశాబ్ధపు వివాహ జీవితంలో అడుగడుగునా ముళ్లబాటే తప్ప పూల దారి ఎక్కడా లేదని 2021లో విడాకుల కోసం న్యాయస్థానాన్ని కోరారు. గత ఏడాది ఆమెకు విడాకులు మంజూరు చేసింది ఆదేశపు న్యాయస్థానం. దీంతో ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈమె కొంచం వినూత్నంగా తన పెళ్లిరోజున ధరించిన వస్త్రాలను కాల్చేసి, పెళ్లిఫోటోలను చించేసి డైవర్స్ రోజును సందడిగా జరుపుకున్నారు. ఈ ఫోటోలను తన తల్లి తీయడం ప్రత్యేకంగా నిలిచింది.
ఇక మన దేశానికి వస్తే తమిళనాడులోని సీరియల్ నటి, ప్రముఖ మోడల్ షాలిని ఈ రకమైన సాంప్రదాయాన్ని పునికి పుచ్చుకున్నారు. తనకు 99 సమస్యలు ఉంటే అందులో ఏ ఒక్క దాంట్లో భర్త జోక్యం లేకుండా ఉండదట. అంటే అన్నింటా తన భర్తే సమస్య అనే అర్థం వచ్చేలా ఒక సందేశాన్ని ఫోటో ఫ్రేమ్ రూపంలో చూపించారు. అలాగే మరో చేతిలో వైన్ బాటిల్ పట్టుకొని రానున్న మంచిరోజులను ఊహించుకుంటూ తన డైవర్స్ ఫోటో షూట్ ని తీసుకున్నారు. విడాకులు అనేది సమాజం దృష్టిలో ఏదో పెద్ద తప్పు చేసినట్లో.. నలుగురిలో చిన్న చూపు చూసినట్లో కాదు. విడాకులు అనేది మన జీవితాలకు గొప్ప వరం, ఇది సరికొత్త మలుపు అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ముంబైకి చెందిన మరో గృహిణి శాశ్వతి శివ విడాకులు తీసుకొని నాలుగేళ్లలో తాను ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించానని, వాటిని మాటల్లో చెప్పలేనంటూ ఫోటోలను షేర్ చేశారు. విడాకులు తీసుకోని దాదాపు 1500 రోజులకు చేరువలో ఉన్నట్లు తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాలు వెనుకకు తిరిగి చూస్తే అన్నీ విజయాలే, సంతోషపు పూవనాలే అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. అలాగే తాను వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టిన తరువాతే గొప్ప వ్యాపారవేత్తగా, రచయిత్రిగా గుర్తింపు పొందానని తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా వర్ణించారు.
అందుకే మహిళలు వివాహం అయిపోయిన తరువాత ఏమీ చేయలేము అనేలా గుడ్డినమ్మకాన్ని పక్కన పెట్టమని చెప్పకనే చెబుతున్నారు. అలాగే దాంపత్య జీవితంలో సాధించలేక పోతే ఆ బంధాన్ని విడిచి బయటకు వచ్చి చూడండి అద్భుతాలు సృష్టించవచ్చు అని సరికొత్త జీవన విధానానికి నాంది పలికారు. ఇలాంటి వారిని చూసి ప్రస్తుతం స్వేచ్ఛలేని మహిళల్లో ఏమైనా మార్పు వస్తుందా లేక అలాగే వంటగదిలో కుందేళ్ల లాగా నలిగి జీవనాన్ని సాగిస్తారో వేచి చూడాలి.
T.V.SRIKAR