DSP NALINI: డీఎస్పీ ఉద్యోగం వద్దంటున్న నళిని.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..

ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉపఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశానని అంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ని కలిసినప్పటికీ ఆమెను ఉద్యోగంలోకి తీసుకోలేదని వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Updated On - December 13, 2023 / 08:27 PM IST

DSP NALINI: 2012 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న కాలంలో నళిని తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసింది. తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్లపై లాఠీని ఝలిపించలేను. తూటాల్ని ఎక్కుపెట్టలేను అంటూ కొలువును త్యాగం చేసింది. ఇన్నేళ్ళ తర్వాత ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ నళిని మాత్రం తనకు డీఎస్పీ ఉద్యోగం వద్దని చెప్పింది. అసలు తాను ఇప్పుడెలా గుర్తుకొచ్చానని, తన గురించి మీరెందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తోంది.

Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు ఆకునూరి మురళి పంచ్‌.. ఈమెగారిని వదిలిపెట్టొద్దు అంటూ ట్వీట్‌…

పైగా తాను ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్టు చెప్పింది. తన ప్రస్తుత జీవితం గురించి ఆశ్చర్యకరమైన విషయాలను ఫ్రెండ్ ద్వారా సోషల్ మీడియాతో పంచుకుంది నళిని. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నళిని 2006లో పరకాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా జాబ్ సంపాదించింది. తర్వాత 2007లో గ్రూప్ 1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. ట్రైనింగ్, ప్రొబేషన్ పీరియడ్ తర్వాత కరీంనగర్ డీఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మెదక్ డీఎస్పీగా బదిలీ అయింది నళిని. అదే టైమ్‌లో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. పోలీస్ శాఖలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఎక్కువైందని విమర్శించారు. ఉద్యమ సమయంలోనే నళినిని 2011 డిసెంబర్ 4నాడు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ ఇష్యూ తెలంగాణ ఉద్యమంలో హైలెట్‌గా నిలిచింది. తనది దేశద్రోహం అనడంతో చాలా బాధపడ్డాననీ, ఒక్క సుష్మా స్వరాజ్ మాత్రమే తన సస్పెన్షన్‌ను ఖండించారని నళిని చెబుతోంది.

ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉపఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశానని అంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ని కలిసినప్పటికీ ఆమెను ఉద్యోగంలోకి తీసుకోలేదని వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నళినికి తిరిగి డిఎస్పీ పోస్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నారు కొందరు. అయితే నళిని మాత్రం ఉద్యోగం, రాజకీయాలు అన్నీ వదిలేశాక వాటి కోసం మళ్ళీ ఎవర్నీ, ఎప్పుడూ కలవలేదని అంటోంది. తన రాజీనామా విత్ డ్రా చేసుకుంటున్నట్టు వినతి పత్రం కూడా ఇవ్వలేదట. అలాంటిది 12యేళ్ళ తర్వాత తనను వార్తల్లోకి ఎందుకు లాగారు అని ప్రశ్నిస్తోంది నళిని. జనం ఇంకా తనను గుర్తుంచుకోవడం సంతోషంగా ఉందనీ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతోంది నళిని. కానీ తనకు డీఎస్పీ ఉద్యోగం వద్దనీ, ఇప్పుడు ప్రశాంత జీవితం గడుపుతున్నానని అంటోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నట్లు చెప్పింది. తనకు ఎవర్నీ యాచించడం ఇష్టం లేదని, ఆ అవసరం కూడా లేదని అంటోంది.

Parliament Attack: పార్లమెంటుకే భద్రత లేదా? మరి సామాన్యుల సంగతేంటి..?

ఒకవేళ జాబ్ ఇచ్చినా రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందనీ.. కొలువు చేయలేనని చెబుతోంది. రోగిని అయి కోలుకున్నాననీ.. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్‌ను కూడా కోల్పోయానని నళిని చెబుతోంది. తనకు డీఎస్సీ ఉద్యోగం ఇవ్వడం పోలీస్ రూల్స్ ప్రకారం కూడా కుదరదని చెబుతోంది. ఎవరైనా కోర్టులో పిల్ వేస్తే మళ్ళీ ఉద్యోగం పోతుందని, అందుకే ఏ కొలువూ వద్దుని అంటోంది. బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవ చేస్తూనే ఉంటానని నళిని రాసిన మెస్సేజ్ ప్రతి ఒక్కర్నీ కన్నీళ్ళు పెట్టిస్తోంది. ఆధ్యాత్మిక, యోగా మార్గంలో ఉన్న తాను ఇదే మార్గంలో కొనసాగుతానని చెబుతోంది.