UJJWALA SCHEME: గ్యాస్ వినియోగదారులకు సూచన.. ఈకేవైసీ.. 500 సిలిండర్ కోసం కాదు..

కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం రావాలంటే ఈ-కేవైసీ చేయాలంటూ జనమంతా గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూలు కడుతున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఫేక్ మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 07:01 AM IST

UJJWALA SCHEME: తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు పథకం, 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ వైద్యం పెంపు.. ఈ రెండు పథకాలను మాత్రమే సీఎం రేవంత్ అమల్లోకి తెచ్చారు. ఇంకా 500కే సిలెండర్ పథకం ప్రవేశపెట్టలేదు. 100 రోజుల్లోగా దాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మరి ఇప్పుడు జనం గ్యాస్ ఏజెన్సీల ముందు జనం ఎందుకు క్యూలు కడుతున్నారు? ఏజెన్సీలు కూడా ఎందుకు E-KYC తీసుకుంటున్నాయి..?
కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం రావాలంటే ఈ-కేవైసీ చేయాలంటూ జనమంతా గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూలు కడుతున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఫేక్ మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ చాలామందికి అసలు విషయం తెలియట్లేదు. 500 రూపాయల గ్యాస్ సిలెండర్ స్కీమ్ ఇంకా తెలంగాణలో అమల్లోకి రాలేదు. పైగా ఈ-KYC చేసుకోవాలి అని కూడా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయినా ఈ రూమర్ ఎందుకు వచ్చింది అంటే.. ఈ-KYC అనేది ఉజ్వల స్కీమ్ కు సంబంధించినది. ఇది కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. 2016 నుంచి ఉజ్వల స్కీమ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికింద ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల్లోని మహిళలకు.. కేంద్రం కోట్ల రూపాయల రాయితీ భరించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది.

BANDI SANJAY: తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ బండికే !

ఈ పథకం కింద ముందుగా గ్యాస్ స్టవ్, సిలెండర్‌ను ప్రభుత్వం అందిస్తుంది. తర్వాత నెల నెలా 300 రూపాయల దాకా గ్యాస్ సిలెండర్లపై రాయితీని నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్స్‌లోకి కేంద్రప్రభుత్వం డబ్బులు జమచేస్తోంది. ఇలా ఉచితంగా ఇచ్చిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ స్కీమ్ పొందిన వినియోగదారుల్లో మృతి చెందినవారు, అనర్హులను ఏరివేసేందుకు.. లబ్దిదారుల వేలిముద్రలను నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా అనర్హులను తొలగిస్తే.. వారి స్థానంలో కొత్తవారికి కనెక్షన్స్ ఇవ్వొచ్చనేది కేంద్రం ఆలోచన. దాంతో గ్యాస్ ఏజెన్సీల్లో మహిళల వేలిముద్రల సేకరణ జరుగుతోంది. గత రెండు నెలలుగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కొత్తగా ఉజ్వల కోసం అప్లయ్ చేసుకున్న మహిళలకు కనెక్షన్లు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31 లోపు ఉజ్వల లబ్దిదారుల వేలిముద్రల సేకరణ పూర్తవ్వాలని గడుపు పెట్టింది కేంద్రం. లబ్దిదారుల గ్యాస్ పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంది.

JEEVAN REDDY: ఆర్మూర్‌ బీఆర్ఎస్‌లో ముసలం.. పాండు అడ్డాలో అలజడి..

తంబ్ ఇంప్రెషన్ పనిచేయకపోతే.. ఐరిస్ ద్వారా EKYC పూర్తి చేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారు మాత్రమే E-KYC చేసుకోవాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయల సిలెండర్ పథకానికీ.. ఉజ్వల స్కీమ్‌కీ ఎలాంటి సంబంధం లేదు. కానీ చాలామంది ఇది తెలియక గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కడుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు ఈ విషయం జనానికి సరిగా చెప్పడం లేదు. పైగా E KYC పేరుతో 20 నుంచి 50 రూపాయల దాకా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఉచితంగా చేయాల్సిన E -KYCకి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఇది తెలంగాణ స్కీమ్ కాదని చెబుతున్నా జనం వినిపించుకోవడం లేదు. ఈ-KYC ఉంటేనే 500 రూపాయల సిలెండర్ వస్తుందన్న ప్రచారం నమ్మొద్దని అధికారులు కూడా చెబుతున్నారు. ఆ పేరు చెప్పి ఎవరైనా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు.. డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీల ముందు ఎవరూ క్యూకట్టవద్దు. 500 సిలెండర్ స్కీమ్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పటిదాకా వేచి ఉండాల్సిందే.