ఇదంతా జరుగుతోంది ఈజిప్టులో! ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. తమ కుటుంబాలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే కోడి కాళ్లు వండుకుని తినాలని, దానిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయంటూ ఈ మధ్య ప్రభుత్వం జనాలకు పోషకాహార సూచన చేసింది. దీనిపై జనాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈజిప్ట్‌లో ద్రవ్యోల్బణం పీక్స్‌కు చేరింది. అక్కడ కేజీ చికెన్ ధర మన కరెన్సీలో నాలుగవందలకు పైగా పలుకుతోంది. కోడి కాళ్లు మాత్రం కిలో 50 రూపాయలు మాత్రమే.
ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన వేళ.. కోడికాళ్లు మాత్రమే తినాలని చెప్పడమే కాకుండా.. ప్రొటీన్స్ ఎక్కువ ఉంటాయని కవర్ చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన జనాలకు కోపం తెప్పిస్తోంది. తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను అగాథంలోకి నెట్టి.. ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు వాళ్లంతా! ఈజిప్ట్‌లో పది కోట్ల మంది జనాలు ఉండగా.. ఆ దేశంలో పండే ఉత్పత్తుల కంటే.. పక్క దేశాల మీదే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో కోళ్లు కొనే స్థోమత లేక.. కాళ్లు తినాలని సలహాలు ఇస్తోంది సర్కార్.