Tomato Price: డబుల్ సెంచరీకి చేరిన టమాటా.. చింతపండు ధర పైపైకి.. సామాన్యులకు చుక్కలే

చింతపండు, పచ్చిమిర్చి, అల్లం సహా అనేక రకాల కూరగాయలు, బియ్యం, పప్పు ధాన్యాలు కూడా అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. టమాటా ధర కిలో ఏకంగా రూ.196 వరకు పలుకుతోంది.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 10:46 AM IST

Tomato Price: నిత్యావసరాల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా ధరలే కాదు.. చింతపండు, పచ్చిమిర్చి, అల్లం సహా అనేక రకాల కూరగాయలు, బియ్యం, పప్పు ధాన్యాలు కూడా అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు దిగిరావడం లేదు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా ధర కిలో ఏకంగా రూ.196 వరకు పలుకుతోంది. ఆదివారం కేజీ రూ.208 వరకు పలుకుతోంది.

25 కేజీల టమోటా బాక్స్‌ ధర రూ.5,200 పలికింది. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇక్కడ కొన్న టమాటాలు విశాఖప్నం, విజయవాడ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. టమాటా మాత్రమే కాదు.. చింతపండు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. కొన్ని చోట్ల చింతపండు కేజీ ధర రూ.350 వరకు పలుకుతోంది. నెల రోజుల క్రితం చింతపండు ధర కేజీ రూ.100 వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు పచ్పిమిర్చి ధరలు కూడా కేజీ రూ.100 వరకు పలుకుతోంది. అంతేకాదు.. అల్లం, వెల్లుల్లి కూడా కేజీ రూ.350 నుంచి రూ.400 కు చేరింది. బియ్యం ధరలు కూడా బస్తా ధర రూ.100 నుంచి రూ.250 వరకు పెరిగాయి. పప్పుల ధరలు కూడా 10 నుంచి 15 శాతం పెరుగుతున్నాయి. రోజువారీ ఉపయోగించే బియ్యం, పప్పులు, టమాటా, చింతపండు, అల్లం వెల్లుల్లి వంటి ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అన్నింటి ధరలు పెరగడమే తప్ప దిగిరావడం లేదు.

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ధరలు ఇంకొన్నిరోజులు ఇలాగే పెరిగే అవకాశం ఉంది. గత ఫిబ్రవరి, మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా వరకు పంటలకు తీవ్ర నష్టం కలిగింది. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం కలగడంతో రాబోయే రోజుల్లో పంటల దిగుబడి తగ్గుతుంది. దీంతో మరికొంత కాలం సామాన్యుడికి ధరాభారం తప్పదు.