Rent A Girlfriend: డబ్బుతో ప్రేమను కొనలేం అని చాలా మంది చెప్పే మాట. నిజమే.. డబ్బుతో ప్రేమను కొనకపోయినా అద్దెకు మాత్రం తీసుకోవచ్చు. ఎక్కడా అనుకుంటున్నారా.. జపాన్‌లో. అవును.. జపాన్‌లో అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతుంది. అంతేకాదు.. ఒంటరితనంతో బాధపడితే ఓదార్చి, ప్రేమను పంచడానికి పేరెంట్స్, కుటుంబం కూడా అద్దెకు దొరుకుతుంది. ఇదంతా చట్టప్రకారమే.
జపాన్ టెక్నాలజీలోనే కాదు.. కొన్ని సంస్కరణల్లోనూ ముందుంటుంది. మానవ జీవితాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ఒంటరిగా ఉండేవారిని అర్థం చేసుకుని, వారి కోసం ఒక కొత్త ఆలోచనకు అనుమతించింది. అదే అద్దెకు గర్ల్ ఫ్రెండ్, పేరెంట్స్, కుటుంబం.. ఏదైనా అద్దెకు తీసుకోవచ్చు.
జపాన్‌లో అందరూ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం వంటివాటికంటే కెరీర్, డబ్బు కోసమే అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీంతో చాలా మందికి లవ్ చేయడానికి కూడా టైం ఉండటం లేదు. సరైన పార్ట్‌నర్ మాత్రమే కాదు.. పేరెంట్స్ నుంచి కూడా కొందరికి ప్రేమ దొరకడం లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కుటుంబం, బంధువులు కూడా దూరంగానే ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి తరానికి చెందిన యువత ఒంటరితనం, డిప్రెషన్ వంటివాటికి గురవుతోంది. చాలా మంది తమకు సరైన పార్ట్‌నర్, ఫ్యామిలీ, పేరెంట్స్ లేదని ఫీలవుతున్నారు. ఇలాంటివాళ్లకు ఉపశమనం కలిగించేలా జపాన్‌లో గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకిచ్చే సంస్కృతి మొదలైంది. అలాగే ఫ్యామిలీని కూడా అద్దెకు తీసుకోవచ్చు.
రెంట్ కాస్త ఎక్కువే..
గర్ల్ ఫ్రెండ్, ఫ్యామిలీని రెంట్‌కు ఇచ్చేందుకు జపాన్‌లో ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ అనుమతితోనే ఇవి నడుస్తున్నాయి. కాబట్టి ఇవి చట్టబద్ధమే. ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లు, లైఫ్‌లో ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేనివాళ్లు, ఉన్నా వారితో సమయం దొరక్క విడిపోయిన వాళ్లు, పేరెంట్స్, ఫ్యామిలీ ప్రేమను పొందలేకపోయిన వాళ్లు ఆన్‌లైన్‌లో ఈ సర్వీస్ వాడుకోవచ్చు. దీనికి కొన్ని నిబంధనలున్నాయి. కనీసం రెండు గంటలకు 6,000 యెన్స్ (జపాన్ కరెన్సీ) చెల్లించాలి. అంటే మన కరెన్సీలో సుమారు రూ.3,000. అది కూడా మొదటిసారి. పైగా మొదటిసారి నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ రెండోసారి కూడా వాళ్లే కావాలి అనిపిస్తే అదనంగా మరో రూ.1200 వరకు చెల్లించాలి. ఎక్కవ సేపు రెంట్ తీసుకుంటే ఛార్జి కొంచెం తగ్గుతుంది. ఈ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
నో గిఫ్ట్స్ ప్లీజ్
గర్ల్ ఫ్రెండ్స్‌గా వచ్చిన వారికి ఎలాంటి గిఫ్టులు, నగదు వంటివి ఇవ్వకూడదని కంపెనీ రూల్ పెట్టింది. అలాగే ఎలాంటి వేధింపులు గురి చేయకూడదు. లైంగికపరమైన చర్యలకు పాల్పడకూడదు. అంటే ఇది అడల్ట్ ఓరియంటెడ్ సర్వీస్ కాదని కంపెనీలు చెబుతున్నాయి. అందువల్ల అద్దెకు తీసుకున్న వాళ్లు హద్దుల్లోనే ఉండాలి. అలాగే రెంట్ తీసుకున్నప్పుడు తప్ప బయట ఎక్కడా, ఎప్పుడూ వారిని కలవకూడదు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే గర్ల్ ఫ్రెండ్స్ డేట్‌కు వస్తారు. వారితో కొద్దిసేపు సరదాగా గడపొచ్చు. ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా అద్దెకు వెళ్లే షిహోమి అనే ఒక యువతి మాట్లాడుతూ ‘‘ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లే ఎక్కవగా రెంట్‌కు తీసుకుంటున్నారు. వాళ్లు చెల్లించే ఫీజులో సగం మాకు అందుతుంది. 20 ఏళ్లు పైడిన చాలా మంది ఈ సర్వీస్ వాడుకుంటున్నారు’’ అని తెలిపింది. ఇటీవలే విష్ణు అనే ఒక ఇండియన్ యూట్యూబర్‌తోపాటు మరికొందరు యూట్యూబర్లు ఇలా జపాన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుని, ఆ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇదే తరహా సర్వీసు చైనాలో కూడా కొన్నిచోట్ల అమలవుతోంది.