Fevikwik Treatment: మరీ ఇంత నిర్లక్ష్యమా..? ఫెవిక్విక్‌తో కుట్లు వేసిన డాక్టర్..!

నిత్యం అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతగా ఉండాల్సిన వైద్యులు కొన్నిసార్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఒక వైద్యుడి నిర్లక్ష్యం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. శరీరానికి గాయం అయితే.. దానికి కుట్లు వేసే బదులు ఫెవిక్విక్‌తో అతికించేశాడు.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 05:01 PM IST

Fevikwik Treatment: వైద్యుల్ని ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే రోగుల ప్రాణాల్ని కాపాడుతారు కాబట్టి. అంత గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించే డాక్టర్లు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఘటనలు ఎన్నో వెలుగు చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు రోగుల ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. నిత్యం అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతగా ఉండాల్సిన వైద్యులు కొన్నిసార్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా ఒక వైద్యుడి నిర్లక్ష్యం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. శరీరానికి గాయం అయితే.. దానికి కుట్లు వేసే బదులు ఫెవిక్విక్‌తో అతికించేశాడు. ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కర్ణాటక రాష్ట్రం, రాయచూర్ జిల్లా, లింగసూగూరుకు చెందిన వంశీ కృష్ణ, సునీత దంపతులు.. తమ బంధువుల పెళ్లి నిమిత్తం ఇటీవల తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజకు వచ్చారు. వంశీకృష్ణ దంపతుల తనయుడు ప్రవీణ్ చౌదరి పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఈ క్రమంలో బాలుడి ఎడమకంటి పై భాగంలో గాయమైంది. దీంతో వెంటనే వంశీకృష్ణ తన కుమారుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ నాగార్జున బాలుడిని పరీక్షించాడు. బాలుడికి లోతుగా గాయమైందని, కుట్లు వేయాలని చెప్పాడు. దీనికి వంశీకృష్ణ సరే అన్నాడు. అయితే, గాయమైన చోట కుట్లు వేయడానికి బదులు.. ఫెవిక్విక్‌తో అతికించారు. ఇది గమనించిన వంశీ కృష్ణ డాక్టర్ నాగార్జునను నిలదీశాడు.

దీంతో సిబ్బంది పొరపాటున ఈ పని చేసి ఉంటారని, అయినప్పటికీ బాలుడికి ఏమీ కాదని.. ఏదైనా అయితే తాను బాధ్యత వహిస్తానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బాలుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సాధారణంగా లోతుగా గాయమై, రక్తస్రావం అవుతుంటే.. దీన్ని ఆపేందుకు డాక్టర్లు కుట్లు వేస్తుంటారు. కానీ, ఇలా ఫెవిక్విక్ వాడితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఈ పద్ధతిని డాక్టర్లు ఎవరూ ఫాలో కారు. ఆస్పత్రి డాక్టర్, సిబ్బంది బాలుడి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని సీజ్ చేసి, డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.