India: అక్కడ ముందు పిల్లలు.. తరువాతే పెళ్లి వీళ్ల ఆచారాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..

మన దగ్గర పెళ్లి అంటే చాలా పెద్ద ఇష్యూ. ఎన్నో ప్రశ్నలు మరెన్నో నిర్ణయాలు. పెళ్లింట్లో జరిగే హడావిడి మామూలుగా ఉండదు. నెల రోజులపాటు పెద్ద పండగలా చేస్తారు. పెళ్లికి మనవాళ్లు ఇచ్చే ఇంపార్టెన్స్‌ అలా ఉంటుంది మరి.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 07:15 PM IST

ఇక పెళ్లికి ముందే అమ్మాయిలు వేరే అబ్బాయితో కలిసి జీవిస్తే.. జీవిస్తే ఏంటి.. కనిపిస్తే చాలు.. కాళ్లు విరగ్గొట్టేస్తారు. చదువు, ఉద్యోగాలు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. అమ్మాయి ఫ్రీడమ్‌ అక్కడితో ఎండ్‌. కానీ రాజస్థాన్‌, గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గరాసియా అనే తెగ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆచారాలు పాటిస్తోంది.

భర్తను ఎంచుకునే విషయంలో అక్కడి యువతులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అంటే మామూలు స్వేచ్ఛ కాదు. పెళ్లి చేసుకోకుండా నచ్చిన వ్యక్తితో కాపురం ప్రారంభిస్తారు. పిల్లలన్ని కూడా కనేస్తారు. భవిష్యత్తులో వాళ్లు ఆర్థికంగా స్థిరపడ్డ తరువాత అందరి సమక్షంలో ఫార్మల్‌గా పెళ్లి చేసుకుంటారు. అంటే మ్యారీడ్‌ లైఫ్‌ను ఒకసారి ట్రయల్‌ వేసి.. సెట్‌ అయితే పెళ్లి చేసుకుంటారు. లేదు అంటే విడిపోతారు.

ఇదేదో ఈ మధ్య మొదలైంది కాదండోయ్. శతాబ్ధాల నుంచి గరాసియా తెగలో ఇదే ఆచారం కొనసాగుతోంది. ఈ తంతు మొత్తాన్ని వీల్లు దాపా అని పిలుస్తారు. అమ్మాయిలు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకునేందుకు రెండు రోజుల పాటు ఓ జాతర నిర్వహిస్తారు. అక్కడ అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడితే వెంటనే అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి ఫ్యామిలికీ కొంత డబ్బు ఇస్తారు. తరువాతి రోజు నుంచి అమ్మాయి అబ్బాయి సహజీవనం స్టార్ట్‌ చేస్తారు. లైఫ్‌లో సెటిల్‌ అవడం లేట్‌ అయితే వాళ్లకు పిల్లలు కూడా పుడతారు. ఇలా కొందరు వృద్ధాప్యంలో పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా ఇక్కడ జరిగాయి.

అంతే కాదు పెళ్లికి అమ్మాయి వాళ్లు చేసే ఖర్చు రూపాయి కూడా ఉండదు. పెళ్లి అబ్బాయి ఇంట్లోనే చేయాలి.. దానికి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా అబ్బాయి కుటుంబమే భరించాలి. శతాబ్ధాల నుంచి తరాలు మారినా ఈ ఆచారం మాత్రం ఇలాగే కొనసాగిస్తున్నారు గరాసియా తెగ ప్రజలు. ఈ ఆచారాల వల్ల వరకట్న వేధింపులు, ఆత్మహత్యలు బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని వీళ్లు చెప్తున్నారు. అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాల్సిన భాగస్వామిని తల్లిదండ్రులు నిర్ణయించే అధికారం లేదు అనేది వీళ్ల నమ్మకం. ఈ విషయంలో పూర్తి నిర్ణయాధికారం అమ్మాయికే ఇవ్వాలనే వీళ్ల సాంప్రదాయం. వినడానికి కొత్తగా ఉన్నా.. వీళ్ల ఆచారంలో చాలా పాజిటివ్‌ యాంగిల్స్‌ ఉన్నాయంటున్నారు ఈ స్టోరీ తెలిసినవాళ్లు.