US-Iran: ఇరాన్‌లో అక్రమంగా శిక్ష అనుభవిస్తున్న తమ దేశానికి చెందిన ఐదుగురు పౌరుల విడుదల కోసం అమెరికా చేసిన పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఐదుగురిని విడుదల చేయించేందుకు ఏకంగా 6 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.49 వేల కోట్లను ఇరాన్‌కు అప్పగించింది అమెరికా.
అమెరికాకు చెందిన ఐదుగురు పౌరులను ఎనిమిదేళ్ల క్రితం ఇరాన్ అరెస్టు చేసింది. ఇరాన్‌లోని అత్యంత కఠినమైన ఎవిన్ జైలులో వారిని బందీలుగా ఉంచింది. దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమంగా, అకారణంగా తమ పౌరుల్ని ఇరాన్ అరెస్టు చేసిందని ఆరోపించింది. ఐదుగురిని విడుదల చేయాలని కోరింది. తమ పౌరులు అక్కడ అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అమెరికా చెప్పింది. ఇరు దేశాల మధ్య శతృత్వం ఉన్న నేపథ్యంలో ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరించింది. అమెరికా పౌరులను విడుదల చేయాలని కోరింది. దీనికి ఇరాన్ కొన్ని షరతులు విధించింది. అమెరికా జైలులో మగ్గుతున్న ఐదుగురు ఇరాన్ పౌరుల్ని విడుదల చేయాలని కోరింది. అలాగే దక్షిణ కొరియాలో సీజ్ చేసిన తమ దేశపు డబ్బును విడుదల చేయాలని కూడా కోరింది.
కొన్నేళ్లక్రితం ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో, ఆ దేశానికి చెందిన డబ్బు.. సుమారు రూ.49 వేల కోట్లు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షల కారణంగా నిలిచిపోయిన తమ దేశపు డబ్బు ఇస్తేనే, ఖైదీల్ని విడుదల చేస్తామని ఇరాన్ సూచించింది. ఇరాన్ ఖైదీల విడుదలతోపాటు, దక్షిణ కొరియాలో ఉన్న రూ.49 వేల కోట్లను ఇచ్చేందుకు అమెరికా అంగీకరిచింది. దీంతో ఖైదీల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి అమెరికా అంగీకరించగానే.. మొదట ఇరాన్ జైలులో ఉన్న ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆ తర్వాత కొరియాలో ఉన్న డబ్బుల్ని యూరోల్లోకి మార్చింది. ఆ డబ్బును ఖతార్ బ్యాంకుకు తరలించింది అమెరికా. ఈ ప్రక్రియ పూర్తికాగానే, అమెరికన్ పౌరుల్ని దోహాకు తీసుకొచ్చి అప్పగించింది.
అమెరికా కూడా ఐదుగురు ఇరాన్ పౌరుల్ని అప్పగించింది. దీంతో ఇరు దేశాలు ఐదుగురు ఖైదీల్ని మార్పిడి చేసుకున్నారు. ఇరాన్ తమ దేశ పౌరుల్ని తీసుకుని స్వదేశం వెళ్లిపోగా, అమెరికా ఖైదీలు కూడా దోహా నుంచి యూఎస్ వెళ్లిపోయారు. ఇందులో ఇరాన్‌కు చెందిన డబ్బు ఖతార్ బ్యాంకుకు చేరింది. దీనికి సంబంధించిన చర్చలు చాలా కాలంగా సాగాయి. అనేక దఫాలుగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఖతార్ మధ్యవర్తిత్వం పని చేసింది. ఐదుగురిని కాపాడుకోవడం కోసం అమెరికా రూ.49 వేల కోట్లను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.