FREE BUS RIDE: బస్సులు సరిపోతాయా..? కర్ణాటక పథకంతో ఆర్టీసీకి లాభమా..? ఎలా..?

వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ఉచితంగా ప్రయాణించడానికి తెలంగాణ సర్కార్ అవకాశం కల్పిస్తోంది. అయితే మహిళంతా ప్రయాణించడానికి వీలైనన్ని బస్సులు మన రాష్ట్రంలో ఉన్నాయా..? అసలు కర్ణాటకలో ఈ స్కీమ్ ఎలా అమలవుతోంది..?

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:58 PM IST

FREE BUS RIDE: కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది. సిటీలోని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ఉచితంగా ప్రయాణించడానికి తెలంగాణ సర్కార్ అవకాశం కల్పిస్తోంది. అయితే మహిళంతా ప్రయాణించడానికి వీలైనన్ని బస్సులు మన రాష్ట్రంలో ఉన్నాయా..? అసలు కర్ణాటకలో ఈ స్కీమ్ ఎలా అమలవుతోంది..?
కర్నాటకలో శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది సిద్ధ రామయ్య సర్కార్. జూన్ మొదటి వారం నుంచి కర్నాటకలో ఈ పథకం అమలవుతోంది. మామూలు రోజులతో పాటు.. వీకెండ్‌లోనూ బస్సులు బిజీగా ఉంటున్నాయి. ఇక పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కరే ప్రయాణం చేయలేరు. అందువల్ల మగవాళ్లు కూడా ట్రావెల్ చేస్తుండటంతో డైరెక్ట్ ఇన్‌‌కమ్‌ పెరిగిందని కర్నాటక సర్కార్ లెక్కల్లో తేలింది. టూరిజం ప్లేసెస్‌కు వెళ్లిన వారు.. షాపింగ్స్ చేస్తుండటంతో.. డబుల్ సైడ్ ఇన్‌‌కమ్‌ ఎక్కువగా ఉందని కేఎస్ ఆర్టీసీ నివేదికలో తేలింది. బెంగళూరు సిటీ పరిధిలో ఒకప్పుడు బీఎంటీసీ నుంచి ఎయిర్‌ పోర్ట్‌కు మాత్రమే బస్సులు రద్దీగా తిరిగేవి. మిగతా అన్ని డిపోల్లోనూ ఏసీ బస్సులు ఖాళీగా తిరిగేవి.

WOMEN RTC FREE: మహిళలకు ఉచిత ప్రయాణం.. వారం రోజుల దాకా ఐడీ కార్డ్ అక్కర్లేదు !

దాంతో బీఎంటీసీ నష్టాల్లో ఉండేది. అయితే శక్తి స్కీమ్‌ ద్వారా మహిళలంతా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ రద్దీగా మారాయి. అదే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు రాజహంస, ఓల్వో బస్సుల్లో టికెట్ ఎంతైనా కానీ కొనుక్కొని తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. దాంతో బీఎంటీసీ ఆదాయం కూడా పెరిగింది. మరోవైపు.. అంతే స్థాయిలో కొన్ని అంశాలు కేఎస్ ఆర్టీసీని భయపెడుతున్నాయి. కర్ణాటక అంతటా 17 వేల బస్సులు ఉన్నాయి. బెంగళూరులో దాదాపు 3 నుంచి 4 వేలు ఉన్నాయి. శక్తి స్కీమ్‌ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి డిమాండ్‌ పెరగడంతో.. బస్సుల సంఖ్య పెంచేందుకు కర్నాటక సర్కార్‌తో పాటు కేఎస్ ఆర్టీసీ కూడా కొత్తగా 5 వేల బస్సులను కొంటోంది. ఇందులో ఒక్క బెంగళూరు సిటీ కోసమే 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. కర్ణాటకలో ఇప్పుడున్న 17 వేల బస్సులకు తోడు అదనంగా కొంటున్నారు. కానీ, తెలంగాణలో మొత్తం ఉన్నవి 7,200 బస్సులు మాత్రమే. అదే సరిపోవడం లేదు. హైదరాబాద్ సిటీతో కొన్ని పల్లెటూళ్ళకి కూడా బస్సులు నడవడం లేదు.

REVANTH REDDY: ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా.. స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పణ..

బస్సులు చాలడం లేదంటూ స్కూల్, కాలేజీల విద్యార్థులు ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొత్తవి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెబుతున్నారు. కానీ, వేల సంఖ్యలో వస్తే తప్ప ఇక్కడ జనం అవసరాలు తీరేలా లేవు. అలాగే కర్ణాటకలో శక్తి స్మార్ట్ కార్డ్‌ను మహిళలకు అందిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్డులు తీసుకున్న మహిళలు కర్ణాటకలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్ళొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం వారం రోజుల దాకా ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మహిళలు ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండి చెబుతున్నారు. వారం తర్వాత శక్తి స్మార్ట్ కార్డ్ తరహాలోనే మహాలక్ష్మి కార్డులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.