Gaddar: గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో చేయకూడదా..? అభ్యంతరం ఏంటి..?

అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించడంపై యాంటీ టెర్రరిజం ఫోరమ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అంటే.. పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమే అన్నది ఆ సంస్థ వాదన.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 11:29 AM IST

Gaddar: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్వాల్‌లో గద్దర్‌ ప్రారంభించిన స్కూల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం నుంచి.. అల్వాల్‌ వరకు గద్దర్ అంతిమ యాత్ర రూట్‌ మ్యాప్ కూడా విడుదల అయిది. ఎల్బీ స్టేడియం నుంచి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. గన్‌పార్క్‌, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్‌లోని నివాసం వరకు అంతిమయాత్ర సాగనుంది.

అల్వాల్‌లోని ఇంట్లో కాసేపు పార్థివదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత బోధి విద్యాలయంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించడంపై యాంటీ టెర్రరిజం ఫోరమ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అంటే.. పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమే అన్నది ఆ సంస్థ వాదన. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమే అంటోంది యాంటీ టెర్రరిజం ఫోరమ్. తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను గద్దర్‌ నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి అని.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని.. నక్సలిజం సాధారణ పౌరులపై, జాతీయవాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని యాంటీ టెర్రరిజం ఫోరమ్‌ లేఖ విడుదల చేసింది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా.. సాయుధ పోరాటాలు చేయడానికి సాహిత్యం ద్వారా యువతను దేశద్రోహులుగా తయారుచేసిన గద్దర్‌లాంటి ఒక వ్యక్తికి.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతీ ఒక్కరు ఖండిచాలని.. పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని యాంటీ టెర్రరిజం ఫోరమ్‌ ప్రతినిధులు అంటున్నారు. దీన్ని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని.. అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ భావజాలానికి, పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యాంటి టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తోంది.