Gold Savings: పసిడి కొనుగోలు మార్గాలు – భద్రతకు ఆవాసాలు..!

మహిళలకు ఎన్ని పనులున్నా బంగారం అంటూనే టక్కున వచ్చి వాలిపోతారు. అదే మరి స్వర్ణానికి ఉన్న డిమాండ్ అంటే. సాధారణంగా జువెలరీ షాపుల్లోనో తెలిసిన గోల్డ్ స్మిత్ వద్దనో బంగారు ఆభరణాలు చేయించుకుంటూ ఉంటారు. పెళ్లికో, పండక్కో, ఉద్యోగం దొరికిన మొదటి సాలరీకో, బంగారం ధర తగ్గినప్పుడో జువెలరీ షాపులకు క్యూ కడుతూ ఉంటారు. అలాంటి బంగారాన్ని ఎన్నివిధాలుగా పొందవచ్చో మీకు తెలుసా..

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 05:54 PM IST

భారతదేశంలో ఏడాదికి 800 నుంచి 1000టన్నుల బంగారానికి డిమాండ్ ఉంటుంది. సాధారణంగా బంగారాన్ని ఒకప్పుడు ఇంటిలోని దూరదృష్టి కలిగిన పెద్దవారు కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లోని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒకవేళ తారుమారైతే తక్కువ ధరకు కొనుగోలు చేసిన బంగారం ఉంటుంది. భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్ముకొని జీవనం గడిపే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కొనుగోలు చేస్తూ ఉండేవారు. కానీ అలాంటి రోజులు ఇప్పుడు లేవు. రోజులు మారాయి. ఆభరణంగా అలంకారానికి అయితే మంచిదే కానీ.. బంగారు మీద పెట్టుబడి పెట్టడం అంటే అంతే సంగతులే. ఒకప్పుడు బంగారం ధర ఎన్నో ఏళ్లకు కానీ పెరగడం తగ్గడం జరుగుతూ ఉండేది. అందుకే అలాంటి నిర్ణయాలు తీసుకునే వారు. ప్రస్తుతం ఈరోజు ఉన్న స్వర్ణం ధర రేపు ఉంటుందన్న నమ్మకం మనకే కాదు వాటిని విక్రయించే అనుభవం ఉన్న దుకాణదారునికి కూడా బోధపడటం లేదు. అలా మారిపోయింది నేటి స్వర్ణయుగం. అందుకే బంగారం పెట్టుబడిగా పెట్టి మోసపోకుండా మెరుగైన లాభం పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

గోల్డ్ ఈటీఎఫ్:
దీనిని గోల్డ్ ఎక్చైంజ్ ట్రేడింగ్ ఫండ్ అంటారు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ మాదిరిగా ఉంటుంది. దీనిని కొనుగోలు చేయాలంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే నేషనల్ స్టాక్ ఎక్చైంజ్, భారత్ స్టాక్ ఎక్చైంజ్ లో రిజిష్టర్ అయ్యేటు వంటి ఒకరకమైన సభ్యత్వపు ఖాతా అనమాట. షేర్స్ కొనుగోలు చేసేటప్పడు వచ్చే ఫిజికల్ సర్టిఫికేట్ కి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో అందించే ఒక ఫాం ను పొందేందుకు ఉపయోగపడే అకౌంట్ ను డీమ్యాట్ అకౌంట్ అంటారు. మనం కొనుగోలు చేసిన స్టాక్ మార్కెట్ షేర్లు, బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. ఇంకా ఒకమాటలో చెప్పాలంటే బ్యాంకులో ఉన్న డబ్బులకు ఏవిధంగా అయితే అకౌంట్ తెరవబడి పాస్ బుక్ ఉంటుందో అలాగే ఇది కూడా ఒక రకమైన అకౌంట్. అలాగే బంగారం మనం భౌతికంగా కొనుగోలు చేయనప్పటికీ ఇందులో పెట్టుబడిపెట్టడం వల్ల మనం ఎన్ని గ్రాములు గోల్డ్ కొన్నామో ఆవివరాలను అందులో నమోదు చేసి ఉంచుతారు. అలాగే ఇందులో పొదుపు చేసి ఉంచిన బంగారాన్ని అమ్మకాలు, కొనుగోలు జరిపేందుకు ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. యూనిట్ల మాదిరిగా గోల్డ్ ఈటీఎఫ్లో బంగారు అమ్మకాలు, కొనుగోలు జరుపవచ్చు. ఇవన్నీ బులియన్ మార్కెట్ సూచించిన విధంగా మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. లిక్విడ్ బంగారు మనవద్ద ఉంటే కొనుగోలు చేసేవారు దొరకకపోవచ్చు. ఉన్నప్పటికీ తక్కువ ధరకు అడగవచ్చు. అదే ఇందులో భద్రపరిచి ఉంచడం ద్వారా మార్కెట్ సమయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పడు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో కొనుగోలు చేయవచ్చు. నిర్ణీత కాలవ్యవధిలోగా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ కి బదిలీ అవుతుంది. ఇందులో సిట్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వారు సూచించిన వాయిదాల ప్రకారం కూడా కొంత కొంత నగదును అందులో డిపాజిట్ చేసుకోవడం ద్వారా బంగారం కొనుగోలుకు వీలుంటుది. అందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

GoId-Launches-Sovereign-Gold-Bonds-Scheme

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్:
ఇది కూడా కొంత గోల్డ్ ఈటీఎఫ్ లాగానే ఉంటుంది. ఇందులో డీమ్యాట్ అకౌంట్ లేకున్నా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉంటుంది. చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందులో జమ చేసిన నగదులను గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో ఇది ఈటీ‎ఎఫ్ లో పెట్టుబడిపెట్టి బంగారు పొదుపు చేసేందుకు దోహదపడతాయి. ఇవన్నీ అంతర్జాతీయ స్టాక్ ఎక్చైంజ్ తో ముడిపడి ఉండటం వల్ల భద్రత విషయంలో సంకోచించనవసరం లేదు.

డిజిటల్ గోల్డ్:
ఇప్పటి ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ అయిన తరుణంలో బంగారం కూడా ఇలా దొరకడం కొంత ఆసక్తిగా ఉంటుంది. బట్టలు, చెప్పుటు, గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్ మాదిరిగానే గోల్డ్ కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిపై పెట్టుబడి పెట్టేందుకు భారతీయ యువతలో 15శాతం మంది మక్కువ చూపుతున్నారు. దీనికి సంబంధించి ఒక యాప్ లేదా సైట్ ఉంటుంది. అందులోకి వెళ్లి తన వద్ద ఉన్న డబ్బుకు సరిపడా బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేస్తాడు. ఇలా కొనుగోలు చేసినప్పుడు విక్రయించే సంస్థలే మన పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో భద్రపరుస్తారు. దీనిని మనకు చేతికి అందించరు. కేవలం అకౌంట్లో ఉన్నట్లుగా ఇక పత్రాన్ని జారీచేస్తారు. ఇందులో పూర్తిగా 24 క్యారెట్ల బంగారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మనకు కావల్సినప్పుడు దీనిని విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్నప్పటి ధర కాకుండా ప్రస్తుత ఉన్న ధరకే మనకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు. సేఫ్ గోల్డ్ అనే కంపెనీ డిజిటల్ గోల్డ్ లో సరికొత్త ప్రయోగాలు చేస్తుంది. మన పేరుతో ఉండే బంగారును తయారీ సంస్థలకు లీజుకు ఇస్తుంది. తద్వారా మనకు పెట్టుబడిలో కొంత లాభాన్ని అందిస్తుంది.

గోల్డ్ బాండ్లు:
ఈపేరులోనే ఉంది బాండు అని. అంటే బంగారం స్థానంలో ఒక కాగితం రూపంలో ఉండే బాండు ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటారు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. బయటి వ్యక్తులను నమ్మి స్కాంలో చిక్కుకోకుండా ఉండేందుకే ప్రభుత్వ ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రదాన ఉద్దేశ్యం భౌతికంగా కొనే బంగారును నియంత్రించడం. ఇందులో ఎవరైనా చేరవచ్చు. కనిష్టంగా ఒక్క గ్రాము నుంచి గరిష్టంగా నాలుగు కిలోల వరకూ కొనవచ్చు. మనం ఈ స్కీమును తీసుకోవాలనుకున్న ముందు వారంలో చివరి మూడు దినాల్లోని సగటు బంగారు రేటును బట్టి మనకు గ్రాము బంగారు ధరను నిర్ణయిస్తారు. ఈ బాండు తీసుకున్న తరువాత సంవత్సరానికి 2.5శాతం వడ్డీని నిర్ణయించడం జరుగుతుంది. బాండ్ మెర్చురిటీ సమయం ఎనిమిదేండ్లుగా నిర్ణయించడం జరుగుతుంది. కాలపరిమితి మధ్యలో దీనిని విత్ డ్రా చేసుకోవాలనుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. స్కీంలో జాయిన్ అయినప్పుడు ధరకాకుండా వెనక్కి తీసుకునే ప్రస్తుత ధర ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. అంతేకాకుండా మనకు లోన్స్ కావాలనుకుంటే నిత్యం ఉపయోగించే బంగారు మాదిరిగా ఈ బాండును తీసుకెళ్లి బ్యాంకులో ఇవ్వచ్చు. ఆ బాండుకు తగినంత రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప‎థకం కావడంతో సెక్యూరిటీ విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు.

ఇలా ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ వస్తువుల కొనుగోలు అమ్మకాల్లో కూడా విభిన్న మార్పులు చోటు చేసుకంటున్నాయి. అది కూడా అత్యంత విలువ, ఆదరణకలిగిన లోహాలు కూడా ఇలా రూపాంతరం చెందడం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. కనుక నేటినుంచి మీరుకూడా ఇలాంటి పద్దతుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో పెట్టుకొని అనుకోని సంఘటనల కారణంగా ఆవిలువైన ఆభరణాలు పోతే చాలా బాధపడవల్సి ఉంటుంది. ఇలా బాండ్ల రూపంలో, డిజిటల్ రూపంలో కొనుగోలు, అమ్మకాలు జరపడం వల్ల సెక్యూరిటీ, గ్యారెంటీ రెండూ లభిస్తాయి.

 

 

T.V.SRIKAR