Google’s AI Revolution: కంటి స్కాన్‌తో గుండె జబ్బులను గుర్తించవచ్చా..? గూగుల్ AI విప్లవంతో అది సాధ్యమేనా ?

కేవలం కంటి స్కాన్ చేయడం ద్వారా గుండె ఎలా పనిచేస్తుందో, సమస్యలు ఎక్కడున్నాయో తెలిపే అత్యాధునిక వ్యవస్థను గూగుల్ AI అభివృద్ధి చేసింది. గుండె జబ్బులను గుర్తించడంలో AI ద్వారా జరిపిన ప్రయోగాలు విజయవంతమైనట్టు గూగుల్ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 11:12 AM IST

Google’s AI Revolution: మీకు ఛాతిలో ఇబ్బందిగా ఉంది. కొంచెం దూరం నడిచినా ఆయాసం వస్తోంది. గుండె భారంగా అనిపిస్తోంది. ఎడమ చెయ్యి పీక్కుపోతోంది. మీ గుండె లయ తప్పుతుందేమోనన్న సందేహం వచ్చింది. వెంటనే ప్రముఖ కార్డియాలజిస్టును సంప్రదించారు. మీ ఆరోగ్య సమస్యలను డాక్టర్‌కి వివరించగానే సాధారణంగా ఆయన కొన్ని పరీక్షలు సూచిస్తారు. ఈసీజీ, 2డీ ఎకో, థ్రెడ్ మిల్, ఇంకా అనుమానం ఉంటే యాంజియోగ్రామ్.. ఇలా గుండె సంబంధమైన సమస్యలను తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా వైద్యులు నిర్వహించే పరీక్షలు ఇవే. అయితే సమీప భవిష్యత్తులో వీటి అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి పరీక్షలేమీ నిర్వహించకుండానే కేవలం మీ కంటిని స్కాన్ చేయడం ద్వారా గుండె అనారోగ్యాన్ని గుర్తించవచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అద్భుతాన్ని ఇప్పటికే ఆవిష్కరించేసింది. కేవలం కంటి స్కాన్ చేయడం ద్వారా గుండె ఎలా పనిచేస్తుందో, సమస్యలు ఎక్కడున్నాయో తెలిపే అత్యాధునిక వ్యవస్థను గూగుల్ AI అభివృద్ధి చేసింది.
గూగుల్ ఏఐతో ఊహించని ఫలితాలు
గుండె జబ్బులను గుర్తించడంలో AI ద్వారా జరిపిన ప్రయోగాలు విజయవంతమైనట్టు గూగుల్ ప్రకటించింది. రెటీనాను స్కాన్ చేయడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను గుర్తించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరూ ఊహించని ఫలితాలను అందిస్తోంది. AIతో హెల్త్ కేర్‌ను ఇంటిగ్రేట్ చేయడంపై ఐదేళ్ల క్రితమే ప్రయోగాలు మొదలుపెట్టిన గూగుల్ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించింది. ఎలాంటి లక్ష్యాలు లేకుండా కేవలం ప్రయోగాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య రంగాన్ని కీలక మలుపు తిప్పబోతోంది. మానవ మేథస్సుకే సవాలు విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. సంప్రదాయ పని విధానాలకు భిన్నంగా ఏఐ దూసుకుపోతోంది. కృత్రిమ మేథస్సుతో సాధ్యంకానిది ఏదీ లేదన్నట్టుగా ఇప్పుడు ఆరోగ్యరంగంలోకి ప్రవేశించింది. త్వరలోనే వైద్య పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాదాపు 2 లక్షల 85 వేల మంది రెటైనల్ ఇమేజెస్‌ను స్కాన్ చేయడం ద్వారా గూగుల్ AI.. 70 శాతం రోగుల్లో గుండె సమస్యలను గుర్తించింది.
కంటి పరీక్షకు.. గుండెకు సంబంధం ఏంటి ?
కంటి పరీక్షలను నిర్వహించడం ద్వారా కేవలం కంటి సంబంధమైన సమస్యలను మాత్రమే కాదు.. శరీరంలో ఉన్న ఇతర అవయవాల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చని నిరూపించింది గూగుల్ AI. కంటి లోపల పల్చని పొరలా ఉండే రెటీనాలో ఎన్నో రక్త కణాలు ఉంటాయి. ఈ రక్త కణాలను విశ్లేషించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. రెటీనా లోపల ఈ రక్త కణాల అమరిక, వాటి పొడవు, వెడల్పు, ఇలా అనేక అంశాలను గూగుల్ ఏఐ అల్గారిథమ్ విశ్లేషిస్తుంది. అమెరికా, యూకే ఆరోగ్య విభాగాల నుంచి రెటైనల్ ఇమేజెస్ డాటాబేస్‌ను సేకరించిన గూగుల్ కంటి లోపలి లక్షలాది రక్త కణాలను ఏఐ ద్వారా విశ్లేషించింది. కంటి లోపలి రక్త కణాలను స్కాన్ చేసి ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కేవలం గుండె సంబంధమైన సమస్యలనే కాకుండా భవిష్యత్తులో ఆయా వ్యక్తులకు వచ్చే అవకాశమున్న ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించవచ్చు.
భారత ఆరోగ్య రంగంలో ఇక విప్లవమేనా ?
వైద్యరంగంలో పరిశోధనల కోసం భారత వైద్య, ఆరోగ్య శాఖ విభాగంతో కలిసి కొంతకాలంగా గూగుల్ పనిచేస్తుంది. డయాబెటిక్ రెటినోపతిని గుర్తించడంలో ఇప్పటికే విజయం సాధించింది. మనిషి శరీరంలో అసాధారణ స్థాయికి బ్లడ్ షుగర్ చేరుకున్నప్పుడు ఒక్కోసారి కంటిలో ఉండే రక్తనాళాలు దెబ్బతింటాయి. చివరకు ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. Automated Retinal Disease Assessment (ARDA)ను అభివృద్ధి చేసిన గూగుల్ ఏఐ కంటి సమస్యలను ముందే గుర్తించి వాటిని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2 లక్షల మందిని ఈ విధానం ద్వారా పరీక్షించింది గూగుల్ ఏఐ. భారత్‌తో పాటు ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో దాదాపు 220 మిలియన్ల కంటి రోగులు ఉన్నట్టు గుర్తించారు. వీళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి విస్తృతంగా ఐ స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో అంధత్వానికి దగ్గరవుతున్నారు. ఈసమస్యకు Automated Retinal Disease Assessment (ARDA) ద్వారా పరిష్కారం చూపించింది గూగుల్ ఏఐ. ARDA ప్రాజెక్టు విజయవంతం కావడంతో cardiovascular సమస్యలపై దృష్టి పెట్టింది గూగుల్.
హెల్త్ కేర్ రంగంలో AI అద్భుతాలు
కృత్రిమ మేథస్సు ప్రపంచ ఆరోగ్య రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ప్రపంచం అనుసరించిన సంప్రదాయ శాస్త్రీయ వైద్య విధానాలకు భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగాన్ని మలుపు తిప్పేసింది. వైద్య పరీక్షలు నిర్వహించడం నుంచి పేషెంట్లకు ట్రీట్‌మెంట్లు అందించడం, వాళ్లను మానిటరింగ్ చేయడం వరకు ప్రతి అంశంలోనూ ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. అందరికీ అన్ని రకాల పరీక్షలు.. అందరికీ ఒకే రకమైన వైద్యం అనే విధానానికి ఏఐతో ముగింపు పలకబోతున్నారు వైద్యులు.