Telangana: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. మెనూ ఇదే..!

తెలంగాణ వ్యాప్తంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. 'ముఖ్యమంత్రి అల్పాహారం' పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.400 కోట్లను కేటాయించనుంది.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 06:14 PM IST

Telangana: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా దసరా నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించనున్నారు. అక్టోబర్ 24 నుంచి ఈ పథకం తెలంగాణ వ్యాప్తంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.400 కోట్లను కేటాయించనుంది. తమిళనాడులో అమలవుతున్న పథకం నుంచి ప్రేరణ పొంది, ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయబోతున్నారు. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే అల్పాహారం అందిస్తుండగా, తెలంగాణలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా అల్పాహారం అందింబోతున్నారు.

తెలంగాణలో ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అల్పాహార పథకం కూడా అమలైతే.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్.. స్కూళ్లోనే తినొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్‌లో అల్పాహార పథకాన్ని అమలు చేస్తారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23,05,801 మంది విద్యార్థులు లబ్ధి కలుగుతుంది. ఇక గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఎలాగూ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉదయం సరిగ్గా తినకుండానే, పస్తులతోనే పాఠశాలకు వస్తున్నట్లు తేలింది. అలాగే విద్యార్థులు నీరసం, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు చదువులకు ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల సమయం కూడా కావడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మెనూ ఇదే
ఆదివారం, సెలవు రోజులు మినహా.. వారంలో ఆరు రోజులు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు.. సోమవారం రోజు గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం రోజు బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, బుధవారం రోజు బొంబాయి రవ్వ ఉప్మా, సాంబార్, గురువారం రోజు రవ్వ పొంగల్, సాంబార్, శుక్రవారం రోజు మిల్లెట్ రవ్వ కిచిడీ, సాంబార్, శనివారం రోజు గోధుమ రవ్వ కిచిడీ, సాంబార్ అందిస్తారు.