Govt. Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఒకరికి భయం.. మరొకరికి ధైర్యం..!

ప్రభుత్వాలు పరిపాలన సజావుగా సాగించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలి. లేని పక్షంలో ఎంతటి ప్రభుత్వాలైనా వైఫల్యం అవ్వడం తధ్యం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. అదే క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఆరాష్ట్ర ఉద్యోగులు డీఏ పెంపుకు చేస్తున్న నిరసన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు సూచించినంత స్థాయిలో డీఏ ఇవ్వలేము అవసరమైతే నా తల తీసేయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో సానుకూలం, ఒకరేమో ప్రతికూలం ఎందుకు ఇలా ద్వైత సిద్దాంత ధోరణి అవలంభిస్తారో తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 02:51 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, బెనిఫిట్ల విషయమై తెలుగురాష్ట్రాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఇక్కడి ప్రభుత్వాలకు ఉద్యోగుల పట్ల ఉన్న భయం. అదే మనపై రాష్ట్రాల్లో అయితే ఇలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడి జనాభాలోని చదువుకు సామాజిక స్థితిగతులకు ఆర్థిక పరిస్థితులతో పోల్చితే మనకు చేకూరే లబ్ధి చాలా ఎక్కువ అని చెప్పాలి. దీనికి బలం చేకూర్చేందుకు తాజాగా జరిగిన పరిణామాలే సరైన ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నసమయంలో ఉద్యోగులకు రావల్సిన డీఏ బకాయిలతో పాటూ కొన్ని బిల్లులను పెండింగ్లో పెట్టింది. దీని పర్యావసానంగానే 2019 ‎ఎన్నికల్లో ఓటమి పాలైంది. తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల కాస్త ముందుకూ వెనక్కు జంకుతున్నట్లుగా కనిపించింది. వారికి ఇచ్చిన హామీల విషయంలో కొంత జాప్యం ప్రదర్శించింది. దీంతో నిరసన జ్వాలలు తీవ్ర స్థాయిలో తలెత్తాయి. చివరకు వారి సమస్యలను పరిష్కరిస్తామని తీపికబురు చెప్పింది. గతంలో తెలంగాణ కేసీఆర్ కూడా ఉద్యోగులతో సానుకూలంగా ప్రవర్తించిన విషయం మనకు తెలిసిందే.

సాలరీ కోసమే సర్కార్ కొలువు:

ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మంది ఎక్కువగా మక్కువ చూపిస్తారు. దీనికి ప్రదాన కారణం ప్రతి ఆరునెలలకు ఒకసారి కరువుభత్యం రూపంలో నెల వేతనం పెరుగుతుంది. అలాగే మెడికల్ గ్రాంట్ క్రింద మూడు నెలల వరకూ పనిచేయకపోయినా జీతం అందుతుంది. లోన్ సులభంగా లభిస్తుంది. పీఆర్సీ పేరుతో జీతం సగానికి పైగా పెరిగే అవకాశం ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. వీటితోపాటూ ఒకప్పుడైతే పదవీ విరమణ తరువాత పని చేయనప్పటికీ పెంక్షన్ రూపంలో ప్రతినెలా జీతం వచ్చి పడుతుంది అని భావించే వారు. కానీ 2001నుంచి ఉద్యోగంలో చేరిన వారికి ఈరకమైన లబ్ధిని తొలగించారు. కనుకనే వీలైనంత త్వరగా సర్వీస్లో ఉండగానే జీతాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. ఇదంతా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయం.

ఓటు బ్యాంకుగా ఉద్యోగులు:

ఇక ప్రభుత్వాల విషయానికొస్తే.. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు భయపడతాయో తెలుసుకుందాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు గవర్నమెంట్ ఉద్యోగులు సర్వీస్లో ఉండేవారు 8లక్షల పైచిలుకు ఉన్నారు. ఇక సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన వారు 5లక్షలకు పైగా ఉంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సర్వీస్, నాన్ సర్వీస్ ఉద్యోగులను కలిపితే 13లక్షల మందికి పైగా ఉంటారు. వీరికి ప్రభుత్వం విరుద్దంగా వెళితే ఎన్నికల సమయంలో వీరి ఓటు ఎక్కడ కోల్పోతామో అన్న భయాందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వీరికి మద్దతుగా నిలుస్తూ ఉంటాయి. కానీ బయటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉండదు. దీనికి కారణం అక్కడి విద్య, సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులు మనకు విభిన్నంగా ఉంటాయి.

west bengal backward_class

సామాజిక పరిస్థితులే కారణం:

మనకు ఉన్నంత పోటీ పరీక్షల కాంపిటీషన్ అక్కడ ఉండదు. చాలా తక్కువ మంది అభ్యర్ధులే దరఖాస్తు చేసుకుంటారు. కారణం ఉన్నత విద్య ఉండకపోవడం. పదవతరగతి పాసైతే గొప్పగా చూసే సమాజం అక్కడ ఇంకా సజీవంగా ఉంది. మనకు ఇంటర్ అంటే అక్కడ ప్లస్ టూ అంటారు. ప్లస్ టూ ఉత్తీర్ణత సాధించిన అమ్మాయి ప్రైవేట్ సంస్థలో చిన్నపాటి ఉద్యోగం తెచ్చుకొని కుటుంబ భారాన్ని పోషిస్తూ నెట్టుకొస్తుంది. దీంతో ఉన్నత విద్య చదివే పరిస్థితి అక్కడి విద్యార్థుల్లో ఉండదు. ఒకవేళ బీటెక్, ఎంటెక్ వంటి విద్యను అభ్యసించినప్పటికీ వారి మార్గం ఇలా ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఉండదు. కనుకనే అక్కడి ఉద్యోగుల సంఖ్య తక్కువ. దరఖాస్తుదారుల సంఖ‌్య మరింత తక్కువగా ఉంటుంది. దీంతో మనకున్నట్లుగా లక్షల మంది ఉద్యోగులు అక్కడ ఉండరు. అందుకే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉండదు. వీరి ఓటు ప్రభుత్వాలను నిర్ణయించేదిగా ఉండదు. కేవలం సామాన్య, మధ్యతరగతి, దిగువతరగతి, బీద బిక్కి కుటుంబాలే కీలకం అవుతాయి. వీరికి సరైన వైద్యం ప్రభుత్వ పథకాలు అందితే చాలు ఓటు బ్యాంకు ప్రభుత్వనికి అలవోకగా వచ్చేస్తుంది. ఇందులోనూ సామాజిక వర్గ సమీకరణాలు దీనిపై మరింత ప్రభావం చూపుతాయి. అందుకే మమత బెనర్జీ ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.

భవిష్యత్తులో మనకు ఇదే పరిస్థితి:

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్నరోజుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పైగా నియామకాలు సమయానికి చేపట్టడంలేదు. దీనికి కారణం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగస్తులను నియమించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే వేతనంలో పావువంతు ఇస్తే యువకులు పనిచేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఒక లక్షరూపాయలు ఇచ్చే ఉద్యోగికి ఔట్ సోర్సింగ్ క్రింద తీసుకుంటే నెలకు రూ.25 వేలకే ఉత్సాహంగా పనిచేస్తారు. పైగా ఒకరిని నియమించుకునే జీతానికి ఇక్కడ నలుగురు అందుబాటులో ఉంటారు. వీరికి ఎలాంటి ప్రత్యేక బెనిఫిట్లు ఇవ్వనవసరం లేదు. పనిసరిగా చేయకుంటే వెంటనే విధులనుంచి తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. దీంతో యువతలో ఉన్న నిరుద్యోగ సమస్యను కొంతవరకూ నియంత్రించవచ్చు.

నియామకాల్లో జాప్యం అందుకే..

పైగా లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని పనిచేయని కొందరి ఉద్యోగుల పట్ల ఉన్న అసంతృప్తి కూడా తొలిగిపోతుంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రభుత్వ నియామకాల పట్ల ప్రభుత్వాలు అశ్రద్ద కనబరుస్తున్నాయని కొందరి మాట. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి ఉండదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. పైగా మనకున్న సామాజిక వర్గం యావ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. రానున్న రోజుల్లో సామాజిక వర్గ రాజకీయాలు మరింత ఎక్కువయ్యే అవకాశం తప్పకుండా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వాలను నిర్ణయించే అర్హతను కోల్పోయి కేవలం ఒక ఓటరుగా మిగిలే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే రకరకాల సంక్షేమాల పేరుతో సామాన్యలకు ప్రభుత్వాలు లబ్థి ఎక్కువ చేకూరుస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టే ఖర్చుతో పోలిస్తే కొంత తక్కువే అవుతుంది.

 

 

T.V.SRIKAR