Rain Alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయ్. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయ్. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉంది. దీంతో జనాలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్‌లో ఒక మోస్తరు వర్షం పడుతుందని.. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.
దీనికి అనుబంధంగా వాయుగుండం.. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో రాష్ట్రంలో పశ్చిమం నుంచి ఒక మోస్తరు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఇక అటు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండటం.. వాతావరణ శాఖ హెచ్చరికలతో జనాలు ఇబ్బందులు పడకుండా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చు. అక్టోబర్ 6 నుంచి 12వ తేదీ మధ్యలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.