Heavy Rains: దక్షిణాదిన వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుంటే ఉత్తర భారత దేశం మాత్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో 24 గంటల్లో ఐదుగురు మరణించారు. రెండు రోజుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి. నదులు పోటెత్తుతున్నాయి. వాహనాలు నదుల్లో కొట్టుకపోయాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. శనివారం అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే మొదటిసారి.
ఢిల్లీలో రికార్డుస్థాయి వాన
ఢిల్లీలో ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జూలైలో ఒకరోజు అత్యధిక వర్షపాతం కురవడం ఇదే మొదటిసారి. ఇంటిపైకప్పు కూలి 58 ఏళ్ల ఒక మహిళ మరణించింది. ఢిల్లీ నగరంలోని అనేక రోడ్లు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల నడుములోతు వరకు నీళ్లు చేరుకున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకీ నీరు చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్, కుల్లు పరిధిలోని బియాస్ నది పొంగి ప్రవహిస్తుండటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రహదారి పక్కనుంచే నది ప్రవహిస్తుండటంతో రోడ్డు తీవ్రంగా ధ్వంసమైంది. వరుసగా రెండో రోజూ భారీ వానలు పడటంతో గుర్గావ్ నగరం మొత్తం నీరు నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజస్థాన్‌లో వర్షాల కారణంగా నలుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక ఇల్లు కూలి ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఒక ఇల్లు కూలి, ఇంటిలోని ముగ్గురు మరణించారు.
పంజాబ్, హరియాణాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. చండీగఢ్‌లో రికార్డు స్థాయిలో 322 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. 24 గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. పంజాబ్‌లోని అంబాలాలో ఇండ్లలోకి నీరు చేరుకుంది. జనావాసాలు నదుల్ని తలపిస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్‌లోని జెలుమ్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదిలోని నీరు ఇండ్లలోకి ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.
ఇల్లు కూలి మహిళ మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుల్లులో ఒక ఇల్లు కూలిపోయి, మహిళ మరణించింది. కల్కా-షిమ్లా మధ్య ఉన్న రైల్వే రూట్‌ను అధికారులు మూసేశారు. భారీ వరదల ప్రభావంతో చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక బ్రిడ్జి కూలిపోయింది. దీంతో అనేక గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. దాదాపు 12 గంటలుగా ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. వర్షాల కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. కాగా, మరో 24 గంటలపాటు ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అమర్‌నాథ్ యాత్ర వాయిదా
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర వరుసగా మూడో రోజు కూడా నిలిచిపోయింది. ఈ యాత్ర సాగే మార్గంలో కొండ చరియలు విరిగిపడి రవాణా స్తంభించి పోయింది. కొండ చరియలు విరిగిపడటం, రోడ్లు ధ్వంసం కావడం వంటి కారణాలతో శ్రీనగర్-జమ్మూ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 3,000కుపైగా వాహనాలు రోడ్లపైనే ఉండిపోయాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.