Himalayan Viagra: హిమాలయన్ వయాగ్రా.. చాలా కాస్టు గురూ..!

ఇంతకీ ఏమిటీ హిమాలయన్ వయాగ్రా..? దీనికి అంత డిమాండ్ ఎందుకు..? రెండు దేశాల మధ్య యుద్ధం పెట్టే స్థాయి ఈ హిమాలయన్ వయాగ్రాకు ఉందా..? ఈ హిమాలయన్ వయాగ్రా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. వేసవిలో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో మంచు కప్పేస్తుంది.

Himalayan Viagra: హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra).. బంగారం, వెండి, వజ్రాల కంటే విలువైంది. పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని అమాంతం పెంచి రసడోలికల్లో ఊర్రూతలూగించే సహజసిద్ధ అద్భుత ఔషధం ఇది. నేపాల్ మంచు తుపానులో ఆరుగురి గల్లంతుతో దీని గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇంతకీ ఏమిటీ హిమాలయన్ వయాగ్రా..? దీనికి అంత డిమాండ్ ఎందుకు..? రెండు దేశాల మధ్య యుద్ధం పెట్టే స్థాయి ఈ హిమాలయన్ వయాగ్రాకు ఉందా..?
మంచు తుపానులు, గల్లంతులు మామూలే కాబట్టి దాని సంగతి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ అసలు ఇష్యూ హిమాలయన్ వయాగ్రా.. దీని ధరెంతో తెలిస్తే గుండె గుబేలంటుంది. సాధారణ రకపు హిమాలయన్ వయాగ్రా ఖరీదు కేజీ రూ.20 లక్షలు. అందులోనూ అత్యంత అరుదుగా దొరికే నాణ్యమైన రకమైతే గ్రాము 50వేల వరకూ ఉంటుంది. అంటే కేజీ 5కోట్ల వరకూ పలుకుతుందట. ఇది నేపాల్ మార్కెట్ రేటే. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళితే దీని ధర ఎంతుంటుందో ఊహించుకోండి.
హిమాలయన్ వయాగ్రా ప్రత్యేకత ఏంటి..?
ఇదో రకం శిలీంధ్రం. హిమాలయాల్లో మాత్రమే దొరికే అరుదైన మూలిక ఇది. అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని, లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. పేరుకే హిమాలయన్ వయాగ్రా అయినా ఇది అంతకు మించి..! లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో దీన్ని మించినది లేదంటారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే వయాగ్రాలేవీ దీని ముందు పనికిరావు. ఇది సహజసిద్ధమైనది. వెయ్యేళ్ల క్రితమే దీన్ని లైంగిక పటుత్వ చికిత్సల్లో వాడినట్లు చెబుతారు. ఇది నపుంసకత్వం, అంగస్తంభన సమస్యలను దూరంచేసే ఔషధం మాత్రమే కాదు. డయాబెటిస్, క్యాన్సర్, ఆస్తమాలను తగ్గించేందుకూ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకే దీనికి అంత డిమాండ్. వీటిని మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. కొంతమంది దీన్ని నేరుగా టీ, సూపుల్లో కలుపుకుని కూడా తాగుతుంటారు. భారత్‌లో దొరికే రకంతో పోల్చితే నేపాలీ రకానికి డిమాండ్ ఎక్కువ.
ఎలా పుడుతుంది..?
హిమాలయన్ వయాగ్రా అని మనం పిలుచుకుంటాం కానీ దీని అసలు పేరు యర్షగుంబా (Yarshagumba). ఇది పుట్టగొడుగు రకానికి చెందినది. దీన్ని హిమాలయన్ గోల్డ్ లేదా గొంగళి పురుగు ఫంగస్ అని కూడా చెబుతారు. కీడాజడి (Keeda jadi) అని కూడా పిలుస్తారు. అరుదైన రకానికి చెందిన గొంగళి పురుగులకు ఫంగస్ సోకి, ఆ తర్వాత దాని లార్వాలో ఇది పుడుతుంది. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని రుజువైంది. రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడువున మన వేలి తరహాలో ఉండే ఈ ఫంగస్ మంచులో భూమిపైకి పొడుచుకు వస్తుంది. భారత్, నేపాల్, భూటాన్‌లోని హిమాలయన్ పర్వత సానువుల్లో 3వేల నుంచి 5వేల మీటర్ల ఎత్తులో ఇది దొరుకుతుంది. దీన్ని అరుదైన, అంతరించిపోతున్న మూలికల జాబితాలో చేర్చారు. గత 15ఏళ్లలో దీని లభ్యత దాదాపు 30శాతం తగ్గింది.


ఎలా సేకరిస్తారు..?
ఈ హిమాలయన్ వయాగ్రా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. వేసవిలో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో మంచు కప్పేస్తుంది. ఏప్రిల్-జూన్ మధ్య మాత్రమే సేకరణకు అనువైన సమయం. దీనికున్న విలువ కారణంగా స్థానికులు ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తారు. ఎత్తైన పర్వత ప్రాంతాలకు చేరుకుని దీనికోసం అన్వేషిస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటారు. చాలామంది శరీరాలు కూడా దొరకవు. కానీ ప్రభుత్వాలు వీరిని అడ్డుకోవు. స్థానికులకు ఇదో జీవనాధారం. అయితే యర్షగుంబా అన్వేషణకు వెళ్లిన అందరికీ ఇది దొరకదు. అతి కొద్ది మందికి మాత్రమే.. అదీ తక్కువ పరిమాణంలో లభ్యమవుతుంది. అయితే గ్రాము దొరికినా దాని విలువ వేలల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఫంగస్ సేకరణకు వెళ్లేవారికి పాస్‌లు ఇస్తుంది.

అయితే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ దీని అన్వేషణకు వెళతారు. టెంట్లు, కొన్ని నిత్యావసరాలు తీసుకుని పర్వతాల్లోకి వెళ్లిపోతారు. కఠినమైన చలిగాలులు, మంచును తట్టుకుని ఈ మూలికను అన్వేషిస్తారు. రాత్రిళ్లు అక్కడే బసచేస్తారు. వారికి దొరికే ఆ కొద్దిపాటి మూలికే ఏడాది పొడవునా కుటుంబాన్ని నడుపుతుంది. కొన్ని కుటుంబాలు దీనిపై ఏటా రూ.5-6లక్షలు సంపాదిస్తున్నాయి. ఏజెంట్లు తక్కువ ధర చెల్లించి స్థానికుల నుంచి దీన్ని సేకరించి కోట్లు సంపాదిస్తున్నారు. అయిదే దీనిపై వస్తున్న ఆదాయానికి అలవాటు పడిన స్థానికులు వ్యవసాయాన్ని కూడా పక్కన పెడుతున్నారు. 20 ఏళ్ల క్రితం దీని ధర తక్కువగా ఉండేది. అన్వేషకులు తక్కువ ఉండేవారు. దీంతో సమృద్ధిగా దొరికేది. దీని విలువ తెలిసి రేటు పెరగడంతో దానికోసం వెళ్లేవారు పెరిగిపోయారు. దీంతో రోజుకు ఒకటి రెండు దొరకడం కూడా కష్టమవుతోంది. హిమాలయన్ వయాగ్రాను ల్యాబుల్లో కృత్రిమంగా తయారు చేయాలని ప్రయత్నించారు. కానీ ఎవరూ కూడా సంతృప్తికర ఫలితాలు సాధించలేదు. దీనికున్న డిమాండ్ కారణంగా నకిలీలు కూడా పుట్టుకువచ్చాయి.
చైనా పరిస్థితేంటి..?
చైనాలో కూడా ఈ యర్షగుంబా దొరుకుతుంది. అయితే నేపాల్, భారత్‌తో పోల్చితే మాత్రం అది తక్కువ రకం. అది కూడా తక్కువగానే దొరుకుతుంది. గతంలో చైనా సైనికులు దీని కోసమే మన భూభాగంలోకి చాలా సార్లు చొచ్చుకొచ్చారు. యర్షగుంబ/కీడాజడి కోసం వెతికేవారు. వాటి అన్వేషణకు వెళ్లిన భారతీయుల్ని బెదిరించి వాటిని లాక్కునేవారు. మన సైనికులకు, చైనా సైనికులకు గతంలో జరిగిన పలు ఘర్షణలకు ఇదీ ఓ కారణం. చైనాలో దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే ఆ దేశ సైనికులు దీనికోసం తెగ తహతహలాడతారు.
ఈ హిమాలయన్ వయాగ్రా ప్రకృతి ప్రసాదించిన ఓ వరం. లైంగిక పటుత్వాన్ని పెంచే ఓ అద్భుత ఔషధం. అయితే దీనికోసం అతిగా అన్వేషించి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఫలితంగా దీని ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇలాగే అన్వేషణ సాగితే ఇది పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వాలు స్పందించి విచ్చలవిడి అన్వేషణకు అడ్డుకట్ట వేయాలని స్థానికులే కోరుతున్నారు.