‌Harsha Sai: హర్ష సాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నాడు?

స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఓవర్ నైట్లో స్టార్ అయిపోతున్నారు. అలా ఒక్క రోజులో స్టార్ కాలేక పోయినా కొన్ని వీడియోలు చేసాక ప్రజల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. నేడు దేశ విదేశాలకు ఇతని కీర్తి ఎగబాకినప్పటికీ అరకు గిరిజన ప్రాంతాల్లో ప్రజల కష్టాల నుంచే యూట్యూబ్ ప్రస్థానం సాగిందని చెప్పాలి.

  • Written By:
  • Updated On - February 28, 2023 / 07:21 PM IST

అతని పేరు హర్ష సాయి.. వినేందుకు ఏకశబ్దంగా పలికేందుకు రెండు పదాలే అయినప్పటికీ దీని వెనుక ఒక చెరిగిపోని చరిత్రే ఉంది. ఇతనిని కొందరు కలియుగపు దానవీర శూర కర్ణ అంటారు. మరికొందరు దేవుడిగా కీర్తిస్తారు. ఇంకా లోతుగా చెప్పాలంటే కుటుంబ పెద్దగా తండ్రి లేని లోటును తీరుస్తున్నాడు అని ప్రశంసిస్తారు. ఇంకొకరైతే ఆయన కోసం చెడ్డవాడిగా అయినా మారతా అంటున్నారు. తండ్రి ఉంటే కూడా ఇలా చేసి ఉండడేమో అనేలా మనోగతాన్ని చెబుతున్నారు. ఒకరికి ఇళ్లు కట్టిస్తే.. కొందరికి ఆపరేషన్ కోసం డబ్బులు అందించారు. తన షర్ట్ ను ఇస్త్రీ చేసిన వారికి 20వేల రూపాయలు ఉదారంగా ఇచ్చేస్తారు. ఇలా ప్రతి వారానికి ఒక ప్రోమోతో.. రెండు నెలలకు ఒకరికి సాయం చేసే వీడియోని పోస్ట్ చేసే వారు. గత ఐదు నెలలుగా ఇతను ఎలాంటి వీడియోలు చేయలేదు. దీంతో అందరిలో కొంత నిరుత్సాహం, ఆసక్తి, ఉత్కంట నెలకొంది. మరికొందరైతే ఇక చేయడేమో డబ్బులన్నీ అయిపోయాయేమో అని గుసగుసలాడుకున్నారు. వీటన్నింటికీ తెరదించుతూ తాజాగా ఒక వ్యక్తికి పశువుల ఫాంను ఉచితంగా ఏర్పాటు చేసి బహుమతిగా ఇచ్చేశారు. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చూసేయాల్సిందే.

పశువుల ఫాం ను కానుకగా:

అనగనగా ఒక రైతు. ఆరైతుకు ఒక భార్య, బాబు ఉన్నారు. ఈ బాబుకు తీవ్రమైన జబ్బు చేసింది. ఆ వ్యాధికి చికిత్స కోసం కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు డాక్టర్లు. అంత ఖర్చు పెట్టడానికి వారి దగ్గర తగిన డబ్బులేదు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు హర్షసాయిని కల్పిస్తానని నమ్మించి వేల రూపాలయలు తీసుకొని మోసం చేశారు. ఈ విషయం ఆనోట, ఈనోట పాకి చివరకు చేరాల్సిన వారి అడ్రస్సుకు చేరింది. ఇంకేముంది. సీన్లోకి దిగాడు హీరో. ఇలా వారి గురించి పరిశోధన మొదలు పెట్టాడు. ఆసుపత్రిలో వైద్యులను అడిగిపూర్తి వివరాలు తెలుసుకున్నాడు. దీంతో బాగా ఆలోచించి వాళ్లకు ఏదో బలమైన సాయం చేయాలని సంకల్పించారు.

దీనికి గతంలో అతని చేత లబ్ది పొందిన వారిని పాత్రధారులుగా చేర్చి పశువుల ఫాం పెడుతున్నట్లు చెప్పారు. వ్యాధితో బాధపడుతున్న బాబు కుటుంబీకులతో దీనికి సహకరిస్తే మీకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి పని ముందుకు సాగేలా ప్రణాళికలు రచించారు. దీనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి చేదోడు వాదోడుగా నిలిచాడు. సీన్ కట్ చేస్తే గేదెల ఫాంని ఈ పేద రైతులకే బహుమతిగా ఇచ్చి సంచలనం సృష్టించారు. దీంతో ఆ పేదకుటుంబంలోని పెదవులపై చిరునవ్వు చూశాడు. ఇంతటితో వీరి కష్టానికి తెరపడింది. వారి జీవనం సాఫీగా సాగుతూ పోతుంది. తాజాగా పశువుల ఫాంని గిప్ట్ గా ఇవ్వడం కోసం చాలా పెద్ద కథనంతో ఒక సినిమాను సృష్టించారు హర్షసాయి.

harsha sai new video

కోట్ల రూపాయలు – వందల మందికి సహాయాలు:

ఇతను గతంలో బెండపూడి జిల్లాపరిషత్ పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ విద్యర్థులకు వ్యాసరచన కాంపిటీషన్ పెడితే ఒకరు డాక్టర్, మరొకరు లాయర్, అవ్వాలని రాస్తే ఒక విద్యార్థి మాత్రం హర్షసాయి లాగా ప్రజలకు సేవ చేయాలని సంకల్పించినట్లు ఎస్సే పోటీల్లో రాశాడు. దీనిని బట్టీ తెలుసుకోవచ్చు అతని పాపులారిటీ ఏస్థాయిలో ఉందో. ఇతని ద్వారా లబ్ధి పొందిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేశారు హర్షసాయి. వీరి టీం కూడా ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా ప్రజల్లోనే ఉంటూ పేదల జీవన శైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తెలిస్తే చాలు వెంటనే హర్ష సాయికి చేరవేస్తారు. ఇలా అతను బీద కుటుంబాలకు తగిన సాయం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు.

కొందరు విమర్శలు – పొరుగు రాష్ట్రాల్లో ప్రశంశలు:

హర్షసాయిపై గతంలో ఫేస్ బుక్ స్టార్స్ వ్యతిరేఖ కామెంట్లు కూడా చేశారు. ఒక లక్షరూపాయల వ్యవహారంలో మనస్పర్థలు వచ్చి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాము మంచి చేయాలని సంకల్పిస్తే హర్షసాయి టీంలో కొందరు తమని తొక్కేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీంతో వారి ఛానల్ పై కూడా దీని వ్యతిరేఖత పడింది అని వివరించారు. పలువురు ప్రముఖులు కూడా ఈయన చేస్తున్న పనిని తప్పుబట్టారు. ఇతను బ్లాక్ మనీ ద్వారా ఇదంతా చేస్తున్నాడనే ఆరోపణలు చేశారు. మరికొందరు ఇతని పై ఇన్వస్టిగేషన్ చేశారు. ఆ పరిశోధనలో హర్షసాయి ధాతృత్వం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారా‌ష్ర్టకు కూడా విస్తరించాయి అని తెలిసింది. ఎన్నో ‎ఏళ్లుగా ఒక స్టార్ హోటల్ బయట నివసిస్తున్న వారు ఒక రోజు లోనికి వెళ్లి పీజ్జా కావాలని కోరగా హోటల్ యాజమన్యం ఆ పిల్లలను బయటకు వెళ్లమని తరిమేశారట. ఈ విషయం తెలుసుకున్న హర్షసాయి వారికి కావల్సిన ఫుడ్ ను తినేందుకు అందులోకి పిలుచుకొని వె‌ళ్లాడట. ఆరోజు నుంచి ఆ పేద ప్రజలను హూటల్ యాజమాన్యం వారు లోనికి ఆహ్వానిస్తున్నారు. ఎన్నో ఏళ‌్లుగా ఇక్కడే ఉంటున్నా ఎవరూ పట్టించుకోని తమని తన సొంత రాష్ట్రం కాకపోయినా వారికి అండగా నిలిచాడు అని చెప్పుకుంటున్నారు.

harsha sai youtube star

పాపులారిటీ తెచ్చిపెట్టిన సృజనాత్మకత: 

పిల్లలకు ట్యాబ్లు, ఇంటికి కావల్సిన గృహోపకరణ సామాగ్రి, బార్బర్ ని మిలీనియర్ చేయడం, అందరికీ ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం ఇలా చాలా రకాలా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వాలు, పాలకులు చేయలేని పనిని ఒక్క యువకుడు చేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అనే అనుమానం అందరిలో తలెత్తింది. దీనికి సమాధానంగా తాను ఒక క్రియేటివ్ యూట్యూబ్ కంటెంట్ అందిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రజలకు ఏది నచ్చుతుందో ఆపనిని నేను సృజనాత్మకంగా చేసి చూపించడం వల్ల ఇంతటి ఆదరణ సాధ్యం అయ్యిందని తెలిపారు హర్షసాయి. ఒకప్పుడు తక్కువ వ్యూవర్ షిప్ ఉండటంతో తక్కువ సాయం చేసేవాడట. ఇప్పుడు దీని స్థాయి పెరగిపోవడంతో సాయం చేసే పరిధిని కూడా పెంచినట్లు చెబుతున్నాడు. ఇతనికి ఎలాంటి రాజకీయ పార్టీల అండదండ లేదని చెబుతూ ఉంటాడు.

హర్ష సాయి ప్రస్థానం:

ఈయన స్వస్థలం విశాఖపట్నం. మార్చి 8, 1999లో జన్మించాడు. గీతం యూనివర్సిటీ నుంచి బీటెక్ గ్రాడ్యూయేట్ పట్టా పోందారు. అతని ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి చనిపోవడంతో ఇలా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో 2018లో హర్ష సాయి ఫర్ యూ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అందరికీ ఆసక్తిని కలిగించే సరికొత్త అంశాలతో వీడియోలు చేసి అనతి కాలంలోనే 7 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. అతను వీడియో చేసి డబ్బులు ఇచ్చే ప్రతి వ్యక్తి నడవడిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆ ఊరిలోని వారితో ఎవరికీ తెలియకుండా సర్వే చేయిస్తారు. ఆ సర్వేలో అతను నిజమైన పేదవాడని హర్షసాయి పంపిన క్రూ వ్యక్తి చెబితేనే రంగంలోకి దిగి ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఇప్పటి వరకూ ఇతని జీవిత కథనం ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత గొప్పగా ప్రజలకు సాయం చేయడం కోసం వ్యాపారాలను నడపాలా, లేక మరింత ఆసక్తిగా యూట్యూబ్ ఛానల్ ని నడపాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కనీసం పాతికేళ్ళు కూడా లేని ఈ కుర్రవాడు చేసిన పనులు ప్రతిఒక్కరినీ తట్టిలేపే విధంగా ఉంటాయని చెప్పాలి.

 

 

T.V.SRIKAR