విశాఖ సాగరతీరానికి భారీ పెట్టె కొట్టుకువచ్చింది. సుమారు వంద టన్నుల బరువున్న ఈ పెట్టెలో ఏముందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఇది చాలా పురాతనమైనదిగా కనిపిస్తోంది. బరువు కూడా ఎక్కువగా ఉండడంతో పొక్లెయినర్ సహాయంతో దీన్ని ఒడ్డుకు చేర్చారు. అంతుచిక్కని ఈ పెట్టెను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు భారీగా తరలి వస్తున్నారు.
అయితే ఈ పెట్టె వయసు వందేళ్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటిదై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు ఆర్కియాలజీ విభాగం అధికారులు కూడా చేరుకున్నారు. అయితే ఈ పెట్టెలో ఏముందనేది మాత్రం ఆసక్తి కలిగిస్తోంది.
గతంలో విశాఖ తీరానికి వింత వింత వస్తువులు కొట్టుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతో విలువైన వస్తువులు కూడా వచ్చాయి. ఇలాగే ఇప్పుడు ఈ పెట్టెలో కూడా విలువైన ఆభరణాల లాంటివి ఏవైనా ఉన్నాయా.. అనే ఉత్కంఠ కలుగుతోంది. బ్రిటీష్ వాళ్లు మన సంపదను లండన్ కు దోచుకెళ్తున్న సమయంలో ఈ పెట్టె సముద్రంలో పడిపోయిందా..? లేకుంటే రాజుల కాలం నాటి ఆభరణాలు ఏమైనా ఇందులో ఉన్నాయా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ పెట్టెను ప్రస్తుతం అధికారులు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది దృఢంగా ఉండడంతో తెరిచేందుకు ఇబ్బందికరంగా మారింది.