IBM Employee: 15 ఏళ్లుగా సిక్ లీవ్.. జీతం పెంచలేదని కంపెనీపై కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే..

ఈ ఒప్పందం ప్రకారం ఒక ఉద్యోగి అనారోగ్యం, వైకల్యం వంటి కారణాలతో పని చేయలేని పరిస్థితిలో ఉంటే అతడ్ని ఉద్యోగంలోంచి తీసేయడం కుదరదు. అలాగని ఉద్యోగానికి రమ్మని కూడా బలవంతం చేయకూడదు. అంతేకాకుండా.. అతడు తిరిగి పూర్తిగా కోలుకునే వరకు లేదా రిటైర్ అయ్యే వరకు లేదా మరణించే వరకు.. ఏది ముందైతే అది అతడికి రావాల్సిన జీతంలో 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 03:42 PM IST

IBM Employee: బాగా పని చేస్తేనే ఉద్యోగాలకు గ్యారెంటీ లేని రోజులివి. పని చేస్తుండగా మధ్యలోనే ఉద్యోగంలోంచి తీసేస్తున్నారు. అలాంటిది ఒక వ్యక్తి పదిహేనేళ్లుగా సిక్ లీవ్ తీసుకుని, తీరా తనకు జీతం పెంచట్లేదని కంపెనీపై కేసు వేశాడు. ఇయాన్ క్లిఫర్డ్ అనే ఒక సీనియర్ ఐటీ ఎంప్లాయ్ ఐబీఎమ్ సంస్థలో ఉద్యోగి. అతడు ఉద్యోగే కానీ.. పని చేయడం లేదు. కంపెనీ నిబంధనల ప్రకారం కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు అంతే. పదిహేనేళ్లుగా సిక్ లీవు తీసుకున్నాడు. చాలా కాలంగా పనిచేస్తున్న క్లిఫర్డ్ 2008లో అనారోగ్యం కారణంగా సిక్ లీవ్ తీసుకున్నాడు.

అప్పటి నుంచి 2013 వరకు సరిగ్గా పని చేయలేడు. అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుండేవాడు. చివరకు 2013 నుంచి పూర్తి సిక్ లీవ్ అవసరం కావడంతో కంపెనీతో ఒక కాంప్రమైజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కంపెనీ కల్పించే డిసెబిలిటీ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంటే అనారోగ్యంతో లేదా వైకల్యంతో బాధపడే వాళ్ల కోసం కంపెనీ తెచ్చిన ప్లాన్ ఇది. ఈ ఒప్పందం ప్రకారం ఒక ఉద్యోగి అనారోగ్యం, వైకల్యం వంటి కారణాలతో పని చేయలేని పరిస్థితిలో ఉంటే అతడ్ని ఉద్యోగంలోంచి తీసేయడం కుదరదు. అలాగని ఉద్యోగానికి రమ్మని కూడా బలవంతం చేయకూడదు. అంతేకాకుండా.. అతడు తిరిగి పూర్తిగా కోలుకునే వరకు లేదా రిటైర్ అయ్యే వరకు లేదా మరణించే వరకు.. ఏది ముందైతే అది అతడికి రావాల్సిన జీతంలో 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం అప్పట్లో అతడి వేతనం సంవత్సరానికి 72 వేల పౌండ్లుగా ఉండేది. 25 శాతం తగ్గించిన తర్వాత 54 వేల పౌండ్లు చెల్లించడం ప్రారంభించింది కంపెనీ. దీంతో ఈ నిబంధన ద్వారా అతడు దాదాపు పదిహేనేళ్లుగా వేతనం పొందుతున్నాడు.

అప్పట్నుంచి అదే వేతనాన్ని కంపెనీ కంటిన్యూ చేస్తోంది. ఇతర ఉద్యోగులకు జీతం పెంచినప్పటికీ అతడికి మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో తనకు కంపెనీ వేతనం పెంచడం లేదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐబీఎంపై కేసు వేశాడు. తను అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్లాన్ ప్రకారం.. తను పనిలోకి రాకూడదనే ఉంది కానీ.. వేతనాలు పెంచకుండా ఉంటామనే నిబంధన లేదంటున్నాడు. ఒప్పందం ప్రకారం కంపెనీ తనకు వేతనం పెంచకుండా వివక్ష చూపుతోందని, ఇది వైకల్యం కలవారిపై వివక్ష చూపడమే అని క్లిఫర్డ్ అంటున్నాడు. తనకు వేతనం పెంచేలా ఆదేశించాలని ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ప్రస్తుతం అతడికి సంవత్సరానికి 54 వేల పౌండ్ల జీతం ఇస్తోంది ఐబీఎమ్. అంటే మన కరెన్సీలో రూ.55 లక్షలు. కాగా, అతడి ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. వేతనం పెరగాలంటే ఉద్యోగి పని చేస్తూ ఉండాలని, అలా పని చేయనప్పుడు జీతం పెంచమని కోరడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.