NASA Protocol: వ్యోమగాములు అంతరిక్షంలో మరణిస్తే ఏమవుతుంది..? ప్రొటోకాల్ ఏంటంటే..

1986, 2003లో నాసాకు సంబంధించి అంతరిక్షంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. 1971లో సుయోజ్ మిషన్‌లో ముగ్గురు, అపోలో 1కు సంబంధించి 1967లో ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి అంతరిక్షంలోకి వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 03:50 PM IST

NASA Protocol: మనుషులు అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు సాగించడం ఐదు దశాబ్దాలకు ముందునుంచే జరుగుతోంది. వివిధ స్పేస్‌షిప్‌లలో వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లిన సందర్భంలో కొందరు మరణించే అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. ఇలా ఎవరైనా అంతరిక్షంలో ప్రాణాలు కోల్పోతే ఏం చేస్తారు..? వారి మృతదేహాల్ని అలాగే వదిలేస్తారా..? అక్కడే ఖననం చేస్తారా..? లేక భూమిపైకి తీసుకొస్తారా..?
1986, 2003లో నాసాకు సంబంధించి అంతరిక్షంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. 1971లో సుయోజ్ మిషన్‌లో ముగ్గురు, అపోలో 1కు సంబంధించి 1967లో ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి అంతరిక్షంలోకి వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఇప్పటికే అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపి సక్సెస్ అయిన నాసా 2025లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపబోతుంది. ఆ తర్వాత దశాబ్దంలో మార్స్‌పైకి మనుషుల్ని పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరికొన్నేళ్లలో అంతరిక్షంలోకి వాణిజ్యపరంగా మనుషుల్ని తీసుకెళ్లేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అంటే అంతరిక్షంలో విహరించాలనుకునే వాళ్లను అక్కడికి తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తారు. కొన్నేళ్ల తర్వాత మనుషులు చాలా సాధారణంగా అంతరిక్షంలో విహరిస్తారు సరే.. మరి అక్కడ ప్రాణాలు కోల్పోతే వారి మృతదేహాల్ని ఏం చేస్తారు..?
నాసా ప్రొటోకాల్
అంతరిక్షంలో మరణించే వారి విషయంలో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రొటోకాల్ పాటిస్తుంది. ఈ విషయంలో వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షణ బాధ్యతలు చూసే వైద్యబృందం చేసే సూచనల ఆధారంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నాసా ప్రొటోకాల్ ప్రకారం.. తక్కువ ఎత్తు కలిగిన భూ కక్ష్యలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాన్ని మిగతా సిబ్బంది ప్రత్యేక క్యాప్సూల్‌లో భూమిపైకి పంపిస్తారు. కొన్ని గంటల్లోనే మృతదేహాన్ని తీసుకురావొచ్చు. అదే చంద్రుడిపై మరణిస్తే కొన్ని రోజుల్లో మృతదేహాన్ని తీసుకురావొచ్చు. ఈ విషయంలో మరణించిన వారి మృతదేహాల్ని తీసుకురావడం నాసాకు ముఖ్యమే. కానీ, అంతకన్నా ముఖ్యమైంది మిగిలిన వారిని సురక్షితంగా తీసుకురావడం.

అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపైకి పంపినప్పుడు ఈ ప్రక్రియ కాస్త సులభంగానే ఉంటుంది. అయితే, 300 మిలియన్ మైళ్ల దూరం కలిగిన మార్స్‌పై వ్యోమగాములు మరణిస్తే మాత్రం ఇది చాలా కష్టంగా ఉంటుంది. మార్స్‌పైకి వెళ్లిన బృందంలో ఎవరు మరణించినా.. వారి మృతదేహం తిరిగి భూమిపైకి రావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అది కూడా మిషన్ పూర్తైన తర్వాతే. అంతవరకు మృతదేహాన్ని స్పెషల్ ఛాంబర్‌లోని, ప్రత్యేక బ్యాగులో భద్రపరుస్తారు. దానిలోపల ఉండే ఉష్ణోగ్రత, తేమ ఆ మృతదేహం పాడవకుండా చూస్తాయి. అదే అంతరిక్షం బయటకు వెళ్లి మరణిస్తే మృతదేహాల్ని సంరక్షించే అవకాశం లేదు. శరీరం మొత్తం ముక్కలై దహించుకుపోతుంది. చంద్రడిపై, మార్స్‌పై బయటి వాతావరణంలో మరణించినా ఇదే పరిస్థితి ఉంటుంది.
అంత్యక్రియలు ఎలా..?
చంద్రుడిపై, మార్స్‌పై ఎవరైనా మరణిస్తే అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం కష్టం. దీనివల్ల మనిషి శరీరం నుంచి వెలువడే బ్యాక్టీరియా అక్కడి ఉపరితలంపై వృద్ధి చెందవచ్చు. పైగా అక్కడ ఒకరిని పాతిపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనివల్ల మిగతా వ్యోమగాముల శక్తి వృథా అవుతుంది. అందుకే అక్కడ అంత్యక్రియలు చేయకుండా భూమికి తీసుకొస్తారు. నిజానికి ఎవరైనా మరణిస్తే వారి విషయంలో ఏం చేయాలన్నా.. ఇతరులకు ఇబ్బందే.