INDIA As BHARATH: ఇండియా.. భారత్ అయితే వాహనాల నెంబర్లు మారుతాయా..?

ఒకవేళ దేశం పేరు భారత్‌గా మారితే వాహనాల నెంబర్ల రిజిస్ట్రేషన్లలో కూడా మార్పులు వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాహనాల నాణ్యత విషయంలో బీఎస్ (భారత్ స్టాండర్డ్) అని వాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 09:19 PM IST

INDIA As BHARATH: దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ లెక్కన త్వరలోనే ఇండియా పూర్తి స్థాయిలో అధికారికంగా భారత్‌గా మారడం ఖాయం. పేరు మార్పు వల్ల కొన్ని సమస్యలు పుట్టుకొస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇండియా నుంచి భారత్‌గా పేరు మార్పుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. జీ20 సదస్సుకు ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వాన పత్రికలో ఇండియా బదులుగా, భారత్‌గా ఉండటంతో దుమారం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు వ్యతిరేకిస్తుంటే.. బీజేపీ, అనుబంధ పార్టీలు సమర్ధిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకవేళ దేశం పేరు భారత్‌గా మారితే వాహనాల నెంబర్ల రిజిస్ట్రేషన్లలో కూడా మార్పులు వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాహనాల నాణ్యత విషయంలో బీఎస్ (భారత్ స్టాండర్డ్) అని వాడుతున్నారు. అలాగే వాహనాలకు BH- భారత్‌ సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ జారీ చేస్తున్నారు. కొన్ని వాహనాలకు BH సిరీస్‌తో ప్రారంభమయ్యే నెంబర్ల ప్లేట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య తరచూ ప్రయాణించే వాహనాలకు ఇలాంటి నెంబర్లను కేంద్రం కేటాయిస్తుంది. ప్రస్తుతం దేశం పేరును భారత్‌గా మారుస్తున్న నేపథ్యంలో అన్ని వాహనాలకు ఇలాగే BH అని మారుస్తారా అనే డౌట్ కలుగుతోంది.
దేశంలోని అన్ని వాహనాలకు ఇలాంటి నెంబర్ ప్లేట్లు కేటాయించడం సాధ్యం కాదు. దేశంలో రిజిష్టర్ అయ్యే ప్రతి వాహనానికి BH అని కేటాయిస్తే, చాలా సమస్యలు ఎదురవుతాయి. రవాణా రంగాల్ని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్రాలు పర్యవేక్షిస్తుంటాయి. పాలసీల్ని కేంద్రం రూపొందిస్తుంటే, ఆదాయం సంబంధమైన వాటిని రాష్ట్రాలు చూసుకుంటాయ. రాష్ట్రంలో ఎలాంటి నంబర్‌ ప్లేట్లు కేటాయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు నంబర్‌ పేట్లను జారీచేస్తున్నాయి. ప్రభుత్వాలు జారీ చేస్తున్న నంబర్‌ ప్లేట్లలో ముందుగా రాష్ట్రానికి సంబంధించిన పేరు, తర్వాత ఆర్టీవో కార్యాలయం నంబర్‌ ఉంటాయి. ఈ రెండింటి తర్వాత వాహనం సీరియల్‌ కోడ్‌ ఉంటుంది. ఈ నంబర్‌లో మన దేశానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా కనిపించవు. అందువల్ల దేశం పేరు మారినా.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్లలో మార్పులు జరిగే అవకాశం లేదు.

పైగా రాష్ట్రాలకు వేర్వేరు నెంబర్లు కేటాయంచడం వల్ల ఆ వాహనం చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఏదైనా నేరంలో భాగమైనా వాటిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. అదే అన్నింటికీ BH సిరీస్‌ నంబర్‌ మాత్రమే ఉంటే, ఆ వాహనాలను గుర్తించడం కష్టమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు జారీ చేస్తున్న నంబర్‌ ప్లేట్లలో రాష్ట్రం, ప్రాంతాన్ని సులభంగాగా గుర్తించవచ్చు. అత్యవసర సమయంలో వాహనాల యజమానులను సులభంగా ట్రాక్ చేసే వీలుంటుంది. అలా కాకుండా.. దేశమంతా ఒకే రకమైన నంబర్ ప్లేట్లు ఉంటే, వాటి ట్రాకింగ్‌ కష్టమవుతుంది. దేశం పేరు మారినంత మాత్రాన వాహనాల రిజిస్ట్రేషన్లు మార్చడం కూడా అంత సులభమైన పని కాదు. దీనికోసం చాలా నిధులు ఖర్చవుతాయ. ఈ నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లు మారే అవకాశం లేదు.