చదువు అనేది ఇప్పటి సమాజంలో ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు మంచి భవిష్యత్తు కోసం చదువుకునే వారు. కానీ ఇప్పుడు సర్టిఫికేట్లకోసం చదువుకోవల్సిన పరిస్థితి వచ్చింది. చేతిలో విద్య ఉంటే ఎక్కడైనా వెళ్లి బ్రతకొచ్చు అని పూర్వం చెప్పేవారు. కానీ ఇప్పుడు బ్రతకాలంటే చదువు అవసరం లేదు.. చదవులేకున్నా సరే ఎక్కడైనా వెళ్లి ఏమైనా చేసి బ్రతకొచ్చు అనేలా మారిపోయింది నేటి తరం. ఇలాంటి సూపర్ ఫాస్ట్ యుగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు బెంగళూరు వాసి ఒకరు. తన ఇంటిని అద్దెకు ఇవ్వడం కోసం చిన్నపాటి ఆన్లైన్ ఇంటర్వూను కండెక్ట్ చేశారు. అందులో పాస్ అయితేనే ఇల్లు ఇస్తారంట. లేకుంటే అంతే సంగతి.
ఒకప్పుడు తిండి కోసం రోడ్ల వెంబడి తిరిగే పరిస్థితి నుంచి ఇంటి కోసం తిరిగే పరిస్థితి వచ్చేసింది. తిండి దొరికినంత సులభంగా ఇల్లు దొరకడంలేదు. అందుకే రకరకాలా స్మార్ట్ ఫోన్ యాప్స్ వచ్చేశాయి. అందులో వెతికితే మనకు కావల్సిన ధరలో పసందైన సౌకర్యాలతో అందమైన ఇల్లు దొరుకుతుంది. అలా వెతికే క్రమంలో బ్రోకర్ కి, ఇంటి ఓనర్ కి, అద్దెకోసం వచ్చిన వ్యక్తికి మధ్య ఇలాంటి వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంభాషణ సారాంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యోగేష్ కి అద్దె ఇల్లు అవసరం అయ్యింది. అందుకోసం బ్రోకర్ ని సంప్రదించారు. బ్రోకర్ ద్వారా హౌస్ ఓనర్ తో సంభాషించారు. తన లింక్డ్ ఇన్, ట్విట్టర్ వంటి సామాజిక ఖాతాలతో పాటూ ఆధార్, ఫోటో, పాన్, టెన్త్, ఇంటర్ మార్క్స్ సర్టిఫికేట్ ను షేర్ చేయమని ఇంటి ఓనర్ అద్దెకు ఇల్లు వెతికే వ్యక్తిని అడిగాడు. గద్యంతరం లేక తన పూర్తి వివరాలను వాట్సప్ లో షేర్ చేశారు. ఇంతటితో ఆగకుండా ఇల్లు అవసరమైన వ్యక్తి గురించి ఇంట్రోను 150 నుంచి 200 పదాల్లో లఘు వ్యాసాన్ని రాసి పంపమన్నాడు. దానికి కూడా సిద్దపడ్డాడు.
ఓనర్ చెప్పిన విధంగా ఇంట్రో రాసి పంపాడు యోగేష్. ఇన్ని చేసినప్పటికీ తనకు ఇంటర్ మీడియట్ లో కేవలం 76 శాతం మార్కులు వచ్చిన కారణంగా తన ఇంటిని బాడుగకు ఇవ్వడం కుదరదంటూ బదులిచ్చాడు ఇంటి ఓనర్. తన ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే కనీసం 90 శాతం మార్కులతో అయినా ఇంటర్ పాస్ అవ్వాలంటా. దీంతో కంగుతిన్న యోగేష్ తన కజిన్ శుభ్ కు ఈ విషయం చెప్పి బాధపడ్డాడు. ఆశ్చర్యపోయిన శుభ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకూ 1.5 మిలియన్ పీపుల్ దీనిని చూశారు. అంతేకాకుండా నెటిజన్లు తమకు ఇష్టమొచ్చిన విధంగా కాంమెంట్ అస్త్రాలను సంధిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంటి కోసం ఎంట్రన్స్ పరీక్షలు కూడా పెడతారేమో అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు.
“Marks don’t decide your future, but it definitely decides whether you get a flat in banglore or not” pic.twitter.com/L0a9Sjms6d
— Shubh (@kadaipaneeeer) April 27, 2023
T.V.SRIKAR