IIT-Bombay: జాబ్ ఆఫర్స్‌లో ఐఐటీ బాంబే సంచలనం సృష్టించింది. ఇటీవల జరిగిన వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో అత్యధిక వేతనాలతో విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక విద్యార్థిని విదేశీ కంపెనీ గరిష్టంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంది. ఇక దేశీయంగా మరో విద్యార్థి అత్యధికంగా రూ.1.68 కోట్లతో ఎంపికయ్యారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన నివేదికను ఐఐటీ బాంబే (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే) తాజాగా వెల్లడించింది. దేశంలోనే ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ఇటీవల వార్షిక ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ నిర్వహించింది.
దీనికి దేశీయ టెక్ కంపెనీలతోపాటు అమెరికా, బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్ దేశాల నుంచి కంపెనీలు హాజరయ్యాయి. నైపుణ్యం, ఇతర అంశాల ఆధారంగా విద్యార్థుల్ని ఎంపిక చేసుకున్నాయి. దేశీయ కంపెనీలకు ఎంపికైన విద్యార్థుల్లో గరిష్టంగా రూ.1.68 కోట్ల వేతనం అందనుది. గత ఏడాది ఇది రూ.1.8 కోట్లుగా ఉంది. విదేశీ సంస్థకు ఎంపికైన విద్యార్థికి గరిష్టంగా రూ.3.7 కోట్ల వేతనం అందనుంది. గత ఏడాది ఈ గరిష్ట వేతనం రూ.2.1 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మొత్తం 2174 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,845 మంది పాల్గొన్నారు. మొత్తం 384 కంపెనీలు హాజరయ్యాయి. ఇందులో 324 కంపెనీలు జాబ్స్‌కు ఎంపిక చేసుకున్నాయి. మొత్తం 1898 ఉద్యోగాలుండగా, 1,516 మందికి ఆఫర్స్ దక్కాయి. ఇందులో 300 మందికి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ రాగా, వాటిలో 194 మంది వాటిని అంగీకరించారు.
రూ.కోటికిపైగా వేతనానికి ఎంపికైన వాళ్లు 16 మంది. విదేశాల్లో ఉద్యోగాలు అందుకున్న వాళ్లు 65 మంది. ప్రస్తుతం ఎంపికైన వారిలో సగటు వేతనం రూ.21.82 లక్షలుగా ఉంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగాలకు చెందిన ఐటీ, సాఫ్ట్‌వేర్, ట్రేడింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్ కంపెనీల్లో వీళ్లంతా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గత జూన్, జూలైలలో క్యాంపస్‌లో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నడిచింది. విద్యార్థులు ఎక్కువగా బీటెక్, ఎంటెక్, డ్యుయల్ డిగ్రీ చదువుకున్న వాళ్లే.