Illegal Marriage: శత పత్నీ పురుషా.. చివరకు పడెను జైలు శిక్ష

పెళ్లి అనగానే కొందరిలో బెణుకు, మరికొందరిలో వణుకు మొదలవుతుంది. ప్రస్తుత సమాజంలో పెళ్లి అంటే అమ్మో అనేలా పరిస్థితి మారిపోయింది. దీనికి గల ప్రదాన కారణం నిత్యవసరాల నుంచి అనవసరాల వస్తువుల ధరలు ఆకాశానికి ఎక్కి కూర్చున్నాయి. అలాంటి తరుణంలో అతి కష్టం మీద భద్రత, బలగం చూసుకొని ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకుంటున్నారు కొందరు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. పూర్తి విరుద్దం. ఒకే ఒక్క వ్యక్తి 105 పెళ్లిళ్లు చేసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అది కూడా ఒక భార్యకు తెలియకుండా మరొకరిని బట్టలు మార్చినంత సులువుగా మార్చేస్తూ.. మకాం మారుస్తూ వచ్చాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు గురించి తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే ఇక పూర్తి వివరాల్లోకి వచ్చేద్దాం.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 10:09 PM IST

ప్రతి ఏటా 10 పెళ్లిళ్లు..

ప్రపంచంలోనే ఎక్కవ పెళ్లిళ్లు చేసుకున్న ఇతని పేరు నికోలాయ్ పెరుస్కోవ్. ఇతను అగ్రరాజ్యం అమెరికాకు చెందిన వ్యక్తి. అతని వయస్సు పట్టుమని 32ఏళ్లు కూడా లేవు. కానీ 105 మంది మహిళలను పెళ్లి చేసుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ మొత్తం వివాహాల సంఖ‌్యను ఇతని వయసుతో భాగిస్తే ప్రతి ఏటా 3 నుంచి 4 పెళ్లిళ్లు చేసుకొని ఉండాలి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడా అలా జరగదు కనుక అమెరికా వివాహ వయసు ప్రకారం లెక్కగడితే ప్రతి సంవత్సరానికి 9 లేదా 10 మంది మగువల మెడలో మాంగళ్యధారణ చేసేవాడు. అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చాడు. ఇతనికి మన తెలుగు సినిమా పెళ్లి వద్దు అనే నేపథ్యంలో రాసిన పాటలు ఒక్కసారైనా వినిపించాలి. అప్పుడు ఇలాంటి తప్పు చేసేవాడు కాదేమో.

14 దేశాలు.. 27 రాష్ట్రాలు.. 50 రకాలా పేర్లు..

ఇక ఇతని ట్రాక్ రికార్డ్ చూస్తే అమెరికా మొత్తాన్ని చుట్టేసినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంలోని 27 రాష్ట్రాలకు చెందిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇంతటితో నిత్యపరిణయోత్సవాన్ని ఆపలేదు. అమెరికా విసుగు వచ్చినట్లుంది. ఇతని కన్ను ఇతర దేశాల మీద పడ్డాయి. దాదాపు 14 దేశాలకు చెందిన మహిళలను పెళ్లాడాడు. పెళ్లికి సిద్దమైన ప్రతీసారీ బ్లఫ్ మాష్టర్ సినిమాలో సత్యదేవ్ అవతారాలు వాటికి తగ్గట్టుగా పేర్లు మార్చుకుంటూ కనిపించినట్లుగా ఇదే సూత్రాన్ని అవలంభించుకున్నాడు. ప్రతి మహిళ వద్దకు వెళ్లి తన పేరు, అడ్రస్, మార్చుకుంటూ వాటికి తగ్గట్టుగా నకిలీ ధృవపత్రాలు తయారు చేసుకునే వాడు. దీంతో అక్కడి మహిళలు ఇతనిని గుడ్డిగా నమ్మేసి వివాహం చేసుకునే వారు. చివరగా ఇతను 1981లో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆఖరి అమ్మాయికి అతని పేరు గయోవన్నీ అయితే విగ్లియాట్టో అని చెప్పినట్లు తెలిసింది. ఇలా దాదాపు 50 రకాలా పేర్లను.. వాటికి తగ్గట్టుగా నకిలీ పత్రాలను తయారు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.

పెళ్లి వెనుక వ్యాపార కోణం..

సహజంగా పెళ్లి అనేది జీవితం ఒకరితో పంచుకోవడం కోసమో, వృద్దాప్యంలో తోడు కోసమో, యవ్వనంలో సుఖం కోసమో, సమాజంలో గౌరవం కోసమో చేసుకుంటూ ఉంటారు. ఇతను మాత్రం అలా కాదు. కేవలం వ్యాపారం కోసం చేసుకుంటూ వచ్చాడు. పెళ్లినే జీవనాధారంగా మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్యతో వారం పది రోజులు గడిపి తాను చేస్తున్న కంపెనీ వేరొక ప్రాంతానికి బదిలీ అయ్యిందని చెప్పేవాడు. ఇందులో భాగంగా ఇంట్లోని విలువైన తనకు అవసరం అనిపించిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని ట్రక్కులోకి ఎక్కించే వాడు. పని చూసుకొని త్వరగా వచ్చేస్తా అంటూ మాయ మాటలు చెప్పి భార్య నుంచి తప్పించుకొని అలాగే పారిపోయేవాడు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో విధంగా బూటకపు మాటలతో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి మోసాలకు, దొంగతనాలకు పాల్పడేవాడు.

పెళ్లిళ్ల సాంప్రదాయానికి తెర..

ఇలా హాయిగా సాగుతున్న గయోవన్నీ జీవితానికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎంతటి మేధావి అయినా ఏదో ఒకచోట బోల్తా పడాల్సిందే. 1981లో షారన్ అనే అమ్మాయికి చేరువయి పెళ్లి చేసుకున్నాడు. వైవాహిక జీవితంలో రోజులు గడిచేకొద్దీ అతని ప్రవర్తనలో మర్పును గమనించింది భార్య షారన్. దీంతో అనుమానం వచ్చి ఈ నిత్యపెళ్లి కొడుకు గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. అలా తెలుసుకునే క్రమంలో పోలీసులను ఆశ్రయించి గయోవన్నీ ప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేశారు. అలా ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మొదటగా పెళ్లి చేసుకున్న భార్య ఇతనిపై చాలా కేసులు పెట్టిన విషయం బయటకు వచ్చింది. అలాగే పెళ్లి చేసుకున్న 105 మందిలో ఏ ఒక్కరికీ విడాకులు ఇవ్వలేదు. 105 మంది భార్యల పేర్లను గుర్తుపెట్టుకోవడం కోసం వారి పేర్లు, అడ్రసులతో ఒక జాబితాను తయారు చేసుకున్నాడు. ఇక ఏముంది మనోడి పెళ్లి భాజా ఆగింది. జైలు దర్వాజా తెరుచుకుంది. ఇతను చేసిన తప్పులన్నీ నిరూపణ అవ్వడంతో కోర్ట్ ఇతనికి 34 సంవత్సరాల జైలు శిక్షతోపాటూ భారీగా జరిమానా విధించింది. ఇలా ఎనిమిదేళ్ళు అరిజోనా స్టేట్ జైల్లో గడిపాడు. 1991లో మెదడులో రక్తస్రావం కారణంగా 61 ఏళ్ల వయసులో చనిపోయాడు.

T.V.SRIKAR